బన్నీ-మోహన్ బాబు.. ఈ వారమే కీలకం

ఇటు మోహన్ బాబుకు, అటు అల్లు అర్జున్ కు ఈ వారం అత్యంత కీలకంగా మారింది.

ఒకేసారి 2 వివాదాలు టాలీవుడ్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మోహన్ బాబు మీడియాపై దాడి చేసిన కేసు ప్రభావం టాలీవుడ్ పై తక్కువ. కానీ బన్నీ కేసు ప్రభావం మాత్రం చాలా ఎక్కువ. ఎందుకంటే, మొత్తంగా బెనిఫిట్ షోలే రద్దయ్యే ప్రమాదం ఏర్పడింది. ఈ సంగతి పక్కనపెడితే.. ఇటు బన్నీ కేసు అయినా, అటు మోహన్ బాబు కేసుకైనా.. ఈ వారమే కీలకంగా మారింది.

ముందుగా మోహన్ బాబు కేసు విషయానికొద్దాం.. మీడియా ప్రతినిధిపై దాడి చేసిన ఘటనలో క్రిమినల్ కేసు ఎదుర్కొంటున్నారు మోహన్ బాబు. ఆయనపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో హత్యాయత్నం కేసు నమోదు కాగా, ఆయన తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ పెట్టుకున్నారు. దీనిపై హైకోర్టులో విచారణ పూర్తయింది. తుది తీర్పును రేపటికి వాయిదా వేసింది ధర్మాసనం.

మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ వస్తుందా రాదా అనే అనుమానం అందర్లో నెలకొంది. ఆయనకు బెయిల్ వస్తే ఓకే, రాకపోతే మాత్రం అరెస్ట్ ఖాయం. అరెస్టయిన తర్వాత ఆయన రెగ్యులర్ బెయిల్ కు అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆయన పరారైనట్టు వార్తలొస్తున్నాయి.

మోహన్ బాబు పరారీపై గతంలో పుకార్లు వినిపించాయి. వాటిని స్వయంగా మోహన్ బాబు ఖండించారు. తాజాగా మరోసారి ఆయన పరారీపై రూమర్లు వినిపిస్తున్నాయి. మోహన్ బాబు దుబాయ్ వెళ్లిపోయారని అంటున్నారు చాలామంది. దీనికి సంబంధించి ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ ఆయన లాయర్ మాత్రం మోహన్ బాబు ఇక్కడే ఉన్నారని కోర్టుకు వెల్లడించారు. మోహన్ బాబు స్థానికంగానే ఉన్నారనే అఫిడవిట్ ను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఆ తర్వాతే తుది తీర్పు వస్తుంది.

ఇటు అల్లు అర్జున్ కు కూడా ఇది కీలకమైన వారమే. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై కేసు నమోదవ్వగా, అందులో ఏ-11 నిందితుడిగా ఉన్నాడు బన్నీ. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. అదే టైమ్ లో హైకోర్టుకెళ్లి బెయిల్ తెచ్చుకున్నాడు.

హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ముగియడానికి ఇంకొన్నాళ్లు సమయం ఉంది. అయితే ఈ బెయిల్ పై ఈ వారంలోనే తెలంగాణ పోలీసులు, సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి ఎంత సీరియస్ గా ఉన్నారనే విషయం నిన్నటి అసెంబ్లీ సమావేశంతో పోలీసులకు కూడా అర్థమైంది.

దీంతో బన్నీ మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని కోరుతూ, పోలీసులు ఈ వారం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు కొట్టేస్తే, ఆ వెంటనే బన్నీని అరెస్ట్ చేస్తారు. అప్పుడు అల్లు అర్జున్, రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది.

సో.. ఇటు మోహన్ బాబుకు, అటు అల్లు అర్జున్ కు ఈ వారం అత్యంత కీలకంగా మారింది. వీళ్లిద్దరి కేసులు ఈ వారం కీలక మలుపులు తిరిగే అవకాశం ఉందంటున్నారు చాలామంది.

2 Replies to “బన్నీ-మోహన్ బాబు.. ఈ వారమే కీలకం”

  1. మొత్తానికి అల్లు అర్జున్ గారు జూనియర్ మోహన్ బాబు రేంజ్ కి ఎదిగాడు అంటావు

Comments are closed.