2025 పండగలు.. హౌజ్ ఫుల్ బోర్డులు

కొత్త ఏడాది మొదలవ్వడానికి ఇంకా టైమ్ ఉంది. కానీ 2025 సంవత్సరానికి సంబంధించి అన్ని పండగల్ని టాలీవుడ్ కబ్జా చేసింది. సంక్రాంతి, దసరా లాంటి పెద్ద పండగలే కాదు.. వాలంటైన్స్ డే, మే డే…

కొత్త ఏడాది మొదలవ్వడానికి ఇంకా టైమ్ ఉంది. కానీ 2025 సంవత్సరానికి సంబంధించి అన్ని పండగల్ని టాలీవుడ్ కబ్జా చేసింది. సంక్రాంతి, దసరా లాంటి పెద్ద పండగలే కాదు.. వాలంటైన్స్ డే, మే డే లాంటి చిన్న చిన్న అకేషన్స్ ను కూడా వదల్లేదు.

సంక్రాంతికి ఎప్పట్లానే భారీ పోటీ నెలకొంది. జనవరి 10న గేమ్ ఛేంజర్ వస్తోంది. 12న డాకు మహారాజ్ వస్తోంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా 13 లేదా 14న వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా సంక్రాంతికి 3 పెద్ద సినిమాలు షెడ్యూల్ అయ్యాయి. రామ్ చరణ్, బాలకృష్ణ, వెంకటేష్ ఈసారి సంక్రాంతి స్లాట్స్ షేర్ చేసుకున్నారు. సందీప్ కిషన్ సినిమాను ప్రకటించినప్పటికీ వచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.

వాలంటైన్స్ డేకు కూడా సినిమా సిద్ధంగానే ఉంది. విశ్వక్ సేన్ నటిస్తున్న ‘లైలా’ వస్తోంది. దానికి వారం ముందే నాగచైతన్య తండేల్ రెడీ అవుతోంది. ఈ రెండూ ‘ప్రేమికుల రోజు’ సినిమాలే.

ఇక శివరాత్రికి నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు సినిమాను షెడ్యూల్ చేశారు. దీనికి పోటీగా ఆ టైమ్ కు మరో మిడ్-రేంజ్ సినిమా వచ్చేలా ఉంది. అటు మే డే కానుకగా నాని హిట్-3 వస్తోంది.

ఇక దసరాకు ఎల్లమ్మ ప్రాజెక్టు ఉంది. బలగం వేణు దర్శకత్వంలో నితిన్ హీరోగా రాబోతున్న ఈ సినిమాను జనవరిలో మొదలుపెట్టి, దసరాకు రిలీజ్ చేస్తామని దిల్ రాజు ఇదివరకే ప్రకటించాడు.

తాజాగా గాంధీ జయంతికి కూడా సినిమా లాక్ అయింది. స్వీయ దర్శకత్వంలో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్న కాంతార ప్రీక్వెల్ (కాంతార ఛాప్టర్ 1) ను అక్టోబర్ 2న విడుదల చేయబోతున్నారు. ఇలా వచ్చే ఏడాదికి సంబంధించి దాదాపు అన్ని పండగ తేదీలపై కర్చీఫులు పరిచేశారు.

ప్రస్తుతానికైతే 3 లాంగ్ వీకెండ్ లు, 2025 క్రిస్మస్, రంజాన్ డేట్స్ మాత్రమే ఓపెన్ ఉన్నాయి. మరికొన్ని రోజుల్లో సాయిదుర్గతేజ్, రవితేజ లాంటి హీరోలు ఆ తేదీల్ని ప్రకటించబోతున్నారు. పండగలు, లాంగ్ వీకెండ్స్ మినహా సాధారణ రోజుల్లో జనం థియేటర్లకు రావడం లేదు. అందుకే మేకర్స్ ఇలా రిలీజ్ డేట్స్ ను అడ్వాన్స్ గా లాక్ చేస్తున్నారు. అయితే ఇది టాలీవుడ్. చెప్పిన తేదీకి ఎన్ని సినిమాలొస్తాయో చెప్పలేం. ప్రస్తుతానికి ఇలా రిజర్వ్ చేసుకున్నారంతే, తర్వాత సంగతి తర్వాత.

5 Replies to “2025 పండగలు.. హౌజ్ ఫుల్ బోర్డులు”

Comments are closed.