సినిమా ఇండస్ట్రీ ని చంపేస్తున్నదెవరు??

1949 లో దేశ జనాభా 35 కోట్లు. సినిమా చూసేవారు 3 కోట్లు. ప్రస్తుత దేశ జనాభా దాదాపు 140 కోట్లు. కానీ అదే మూడు కోట్ల మంది ఇప్పుడు సినిమా చూడడం దాదాపు…

1949 లో దేశ జనాభా 35 కోట్లు. సినిమా చూసేవారు 3 కోట్లు. ప్రస్తుత దేశ జనాభా దాదాపు 140 కోట్లు. కానీ అదే మూడు కోట్ల మంది ఇప్పుడు సినిమా చూడడం దాదాపు అసాధ్యం అనుకోవాలి.

దీనికి కారణాలు ఏమిటి? అందరికి నచ్చే కంటెంట్ తో సినిమాలు తీయకపోవడం ఒకటైతే, టికెట్ రేట్లు ఇష్టానుసారంగా పెంచుకుంటూ పోవడం రెండవది. ఇదే అతి ముఖ్యమైనది.

బాలీవుడ్ లో చూస్తే మాస్ ని విస్మరిస్తూ లవ్ స్టోరీలు తీసుకుంటూ పోయారు. ఫూట్ ఫాల్స్ తగ్గుతున్నాయని టికెట్ రేట్లు పెంచుకుంటూ పోయారు. అందుకే హిందీ సినిమాలకు మొదటి రోజు మొదటి షో కు 30-40% ఫుట్ ఫాల్స్ వచ్చినా ఆ సినిమా ఓపెనింగ్ బావుందనే ట్రేడ్ పండితులు అంటున్నారు.

తెలుగు సినిమాలకు ఆ దుస్థితి అయితే లేదు. పెద్ద హీరో అయితే టాక్ తో సంబంధం లేకుండా ఫస్ట్ డే హౌస్ ఫుల్స్ ఉంటాయి. అదే మొదటి షో అయితే చెప్పనే అవసరం లేదు. ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకోడానికే డిస్ట్రిబ్యూటర్ లు బెనిఫిట్ షో లు వేస్తారు. తెలుగు సినిమాలకు ఉన్న హడావుడి అలాంటిది.

అయితే నెమ్మదిగా మనం కూడా మన తెలుగు ఇండస్ట్రీ ని నాశనం చేసుకుంటున్నామా? ఫూట్ ఫాల్స్ ని పట్టించుకోకుండా షార్ట్ కట్ లో డబ్బులు సంపాదించాలని నిర్మాతలు చూస్తున్నారా? పరిస్థితులు చూస్తుంటే అదే నిజం అనిపిస్తుంది.

జనరల్ గా సినిమా బావుంటే రిపీట్ ఆడియన్స్ వస్తారు, ఫ్యామిలీస్ వస్తాయి. దానివలన టోటల్ టర్నోవర్ లో లాభం కనపడుతుంది. ఇదీ జనరల్ ప్రొసీజర్. కంటెంట్ బావుంటేనే ఇది జరిగేది.

రాజమౌళి లాంటి అగ్ర దర్శకులకు కూడా తమ కంటెంట్ మీద నమ్మకం లేనట్లు గా ఉంది. అందుకనే ఇష్టానుసారంగా టికెట్ రేట్లు పెంచుకుంటూ పోయారు. హైద్రాబాద్ లో RRR కు మొదటి మూడు రోజులు మల్టీప్లెక్స్ లో 413 రేట్ ఉంటే ఆంధ్ర లో సింగిల్ స్క్రీన్ రేట్ 234 ఉంది. ముంబై, ఢిల్లీ లాంటి ముఖ్య పట్టణాలలో అయితే టికెట్ రేట్ 2000 దాటింది.

సౌత్ లో చాలా ఎక్కువ టికెట్ రేట్ ఉండే బెంగళూరు లో మాత్రం ప్రభుత్వ రూల్ వలన 200+ మాత్రమే ఉంది. అక్కడ అది చాలా తక్కువ.

సోమవారం నుండి ముంబైలో తెలుగు వెర్షన్ కి 150 నుండి 180 ఉండగా తెలంగాణ లో 354 ఆంధ్రాలో 236 గానే టికెట్ రేట్ ఉంది. మొదటి పది రోజుల వరకు ఇలానే ఉంటుందట.

నార్త్ లో చూసుకుంటే హిందీ వెర్షన్ కలెక్షన్ బానే కనపడుతుంది కానీ ఫూట్ ఫాల్స్ చూసుకుంటే “గంగు భాయి కాట్వాడి”  సినిమా కన్నా తక్కవగానే ఉన్నాయంట. కానీ కలెక్షన్స్ కనపడుతుండడం తో తర్వాత విడుదల అయ్యే KGF2, జెర్సీ నిర్మాతలు కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తారంట.

ఇలా చేయడం వలన కొన్ని సినిమాలకు కలెక్షన్ కనపడవచ్చు. కానీ క్రమంగా జనాలు సినిమాలకు రావడం మానుకుంటారు. హిందీ లో కనీసం సోమవారం నుండి టికెట్ రెట్లు తగ్గిస్తారు. తెలుగులో మొదటి 10 రోజులు టికెట్ రేట్లు ఎక్కువగా ఉండబోతున్నాయి. పోనీ ఈ అధిక రేట్లు ఒకే సినిమాకో లేదా కొన్ని సినిమాలకో అనుకుంటే పొరపాటే. ఇకనుండి ప్రతీ నిర్మాత కోర్టు కి వెళ్లి టికెట్ రేట్లకు పెర్మిషన్ తెచ్చుకుని రేట్లు పెంచేస్తారు. గతంలో ఇలా చాలా సార్లు జరిగింది కూడా. కానీ ఇప్పుడు RRR తో ఈ రేట్ల పెంపకం క్రొత్త పుంతలు త్రొక్కుతుంది.

ఇప్పుడు సినిమాలు చూసే ప్రేక్షకులకు OTT అనే ఆప్షన్ కూడా ఉంది. 7 వారాల వరకు తమ సినిమాను OTT కి ఇవ్వము అని స్టేట్మెంర్స్ ఇస్తున్న నిర్మాతలే నాలుగు వారాలు కూడా కాకముందే OTT లో తమ సినిమా రిలీజ్ చేసేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్ ల నోటిలో మట్టి కొడుతున్నారు. కొన్నయితే వారానికే రిలీజ్ అవుతున్నాయి.

ఇంతింత రేట్ లు పెట్టి ఒక సామాన్య ఫ్యామిలీ సినిమాకు ఎలా వెళ్లగలదు? వాళ్ళు OTT లో రిలీజ్ అయ్యేంత వరకు వైయిట్ చేస్తారు లేదా పైరసీ లో సినిమా చూసేస్తారు. అంటే నిర్మాతలే ప్రేక్షకులను ఇండైరెక్టు గా పైరసీ లో సినిమా చూసేందుకు ప్రోత్సహిస్తున్నారు.

షార్ట్ కట్ లో డబ్బులు సంపాదించేద్దాం అనే దురాశే నేడు సినీ ఇండస్ట్రీ నాశనానికి కారణం అవుతుంది. బాలీవుడ్ లో ఆల్రెడీ ఇది జరుగుతుంది. మన తెలుగు కు ఇది మొదలయింది. ఇప్పటికైనా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సరయిన టికెట్ రేట్లను ఉంచినప్పుడు ఫ్యామిలీ లు థియేటర్ కి వస్తాయి. సినిమా ఇండస్ట్రీ కళకళలాడుతుంది. కాదు కూడదని దురాశ కి పోతే తమ కాళ్ళని తామే గొడ్డలి తో నరుక్కునట్లు అవుతుంది. నిర్మాతలు ఆలోచించుకోవాల్సిన విషయమిది.

భాస్కర్ కిల్లి.