Daaku Maharaaj Review: మూవీ రివ్యూ: డాకు మహరాజ్

కొత్తదనం లేని కథే అయినా విసిగించదు, ప్రెడిక్టబుల్ గా సాగుతున్నా బోర్ కొట్టదు. ఊచకోతలు, హింసాత్మక పొయెటిక్ జస్టిస్, దుష్టశిక్షణ కలగల్సిన చిత్రమిది.

చిత్రం: డాకు మహరాజ్
రేటింగ్: 2.5/5
తారాగణం: బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి, సచిన్ ఖేడేకర్, మకరన్ దేశ్‌పాండే, రవి కాలె, దివి వైద్య, హిమజ, హర్షవర్ధన్, సత్య తదితరులు
కెమెరా: విజయ్ కార్తీక్ కన్నన్
ఎడిటింగ్: నిరంజన్ దేవరమానే
సంగీతం: ఎస్. తమన్
నిర్మాత: నాగవంశీ, సౌజన్య
దర్శకత్వం: బాబీ
విడుదల: 12 జనవరి 2025

“అఖండ”, “భగవంత్ కేసరి” లాంటి ట్రాక్ రికార్డుతో ఉన్న బాలకృష్ణ, “వాల్తేర్ వీరయ్య” లాంటి హిట్ కొట్టిన దర్శకుడు బాబీ కలిసి “డాకు మహరాజ్” తో ముందుకొచ్చారు. తొలి ట్రైలర్ పెద్దగా ఆకట్టుకోకపోయినా, మలి విడతలో వచ్చిన ట్రైలర్ ఆకట్టుకుంది. సినిమాపై మాస్ అంచనాలు పెంచింది. విషయంలోకి వెళ్లి చూద్దాం.

కథ మదనపల్లిలో 1996లో మొదలవుతుంది. అక్కడొక గురుకుల్ స్కూల్ యజమాని కృష్ణమూర్తి (శరద్ ఖేడేకర్). ఆయనకొక పెద్ద టీ ఎస్టేట్. అదే ఊరి సిట్టింగ్ ఎమ్మెల్యే త్రిమూర్తులు నాయుడు (రవికిషన్) అత్యంత క్రూరుడు. అతనికి, కృష్ణమూర్తికి మధ్య ఒక గొడవ మొదలై మాట మాట పెరిగి పెద్దదవుతుంది. దాంతో అతని మనవరాలిని టార్గెట్ చేస్తాడు. ప్రమాదాన్ని గమనించి ఒక వ్యక్తి (మకరంద్ దేశ్ పాండే) పాప ప్రాణాపాయంలో ఉందని మహరాజ్ కి కబురుపెడతాడు. ఉత్తర భారతదేశంలో కరడు కట్టిన ఖైదీగా ఉన్న మహరాజ్ (బాలకృష్ణ) ని పోలీస్ కస్టడీలోంచి ఆయుధాలతో దాడి చేసి విడిపిస్తారు అతని అనుచరులు. అక్కడి నుంచి నానాజి పేరుతో పాపకి రక్షణ కోసం డ్రైవరుగా చేరతాడు మదనపల్లిలోని కృష్ణమూర్తి ఇంటిలో.

ఇదిలా ఉంటే స్టీఫెన్ (చక్కో) అనే పోలీసాఫీసర్ మహరాజ్ జాడని పట్టుకునే పనిలో ఉంటాడు. ఇంతకీ మహరాజ్ ఎవరు? ఆ పాప ఎవరు? స్టీఫెన్ మహరాజ్ ని పట్టుకుంటాడా? వెనుక జరిగిన కథ ఏంటి? కథాగమనంలో వచ్చే బల్వంత్ సింగ్ (బాబీ డియోల్) ఎవరు? అతను ఏ స్థాయి క్రూరుడు..వంటివన్నీ ఒక్కొక్కొటిగా తెరపై పరిచయమవుతాయి.

ఈ కథ సగమే చెప్పి ఆపినా, పూర్తిగా చెప్పినా.. వినడానికి, చదవడానికి, చూడడానికి కూడా కొత్తగా అనిపించదు. ఇలాంటి కథనాలు తెలుగు తెరపై గత పాతికేళ్లగా చాలానే వచ్చాయి. రొటీన్ కథే అయినా, ప్రెడిక్టెబుల్ గా సాగుతున్నా ప్రేక్షకులకి బోర్ కొట్టనీయకుండా నడపాలంటే కంటెంట్ కంటే ట్రీట్మెంట్, టెక్నికాలిటీ మీద దృష్టి పెట్టాలి. ఈ చిత్రంలో మూడు విభాగాలు చక్కగా పని చేసి సాధారణ కథా కథనాలని కూడా ఆసక్తిగా కూర్చోబెట్టగలిగాయి- అవి..బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పంచ్ డైలాగ్స్, ఎడిటింగ్. ఆ తర్వాత కెమెరా వర్క్ గురించి చెప్పుకోవచ్చు.

హీరో ఎలివేషన్ సీన్స్, యాంటి గ్రావిటీ స్టంట్లు ప్రతి మాస్ సినిమాల్లోనూ ఉండేవి. అయితే అవి వెగటు పుట్టకుండా కథనంలో సింక్ అయ్యేలా నడపడం బాగుంది. అలాగని ఈ చిత్రంలో అతిపోకడలు లేవని కాదు. క్వారీ వద్ద ఠాకూర్ల చేతిలో తన్నులు తింటూ బతికిన జనం పోరాటయోధులుగా మారిపోవడం కొంచెం అతిగా ఉంది. గర్భిణిగా ఉన్న హీరోయిన్ కూడా కత్తి పట్టుకుని నలుగురైదుగుర్ని కసకసా చంపిపారేయడం కాస్త ఎక్కువ అతిగా ఉంది. బాలకృష్ణ సినిమా అంటేనే “అతి”. దాన్ని “అతి” అంటే ఎలా? జనం చూసేదే ఆ “అతి” కోసం అనుకుంటే కంప్లైంటే లేదు. “అతి” ని “అతిశయోక్తి అలంకారం” గా భావించి చూసేయడమే.

– “గంగని ఆకాశం నుంచి నేల మీదకి దించిన భగీరథుడు కూడా ఇంజనీరే. మీ తలలో ఉన్న పొగరుని దించడం పెద్ద పనికాదు”

– “అతనితో భార్యగా కాపురం చేయడం తప్పులేదు. ప్రజలకి మంచి చేయమని ఇచ్చిన పవర్ ని వాడి పక్కలో పడుకోపెట్టొద్దు”

– “వార్ణింగులు చచ్చేవాడు కాదు- చంపేవాడు ఇవ్వాలి”

– “నువ్వు అరిస్తే బార్కింగ్- నేను అరిస్తే ….” అనగానే సింహం గర్జన బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తుంది.

– “నేను గతంలో లారీ డ్రైవర్ గా పని చేసానులే”.

ఇలాంటి డైలాగ్ మొమెంట్స్ అన్నీ మాస్ ప్రేక్షకులకి ఉత్సాహాన్నిచ్చేవే. అలాగే ఒక షాటులో తలలేని డాకు మహరాజ్ విగ్రహానికి బాలకృష్ణ తల సింక్ అయ్యేలా ఉన్న సింబాలిక్ షాట్ కూడా ఎమోషన్ ని ఎలివేట్ చేసింది. మరొక షాట్ లో బాలకృష్ణ పెట్టి తెరవగానే అందులో ఆయన బ్రాండ్ సీసా కనిపించడం కూడా ఫ్యాన్స్ కి విజిలెయ్యాలనిపించే విషయమే.

సాంకేతికంగా తమన్ మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా నేపథ్య సంగీతం మూడ్ ని బాగా సెట్ చేసి, ఎక్కడా డ్రాప్ అవకుండా నిలబెట్టింది. “దబిడి దిబిడి” పాట వినడానికి, చూడడానికి మాస్ మసాలాగా బాగుంది. “చిన్ని చిన్ని” పాట రొటీన్ సెంటిమెంటల్ సాంగ్. అయినా కథనంలో ఒదిగిపోయింది.

ఏ సీన్ ఎంత ఉండాలి, ఏ సీన్లో ఎన్ని షాట్లు ఎంత క్రిస్ప్ గా కట్ చేయాలి అనే తూకంలో ఎడిటింగ్ విభాగం సమర్ధవంతంగా పనిచేసింది. సంభాషణల్లో పంచ్ డైలాగ్స్ సమతూకంలో సాగాయి. సెకండాఫులో పాటలు లేకపోయినా, ఓవరాల్ గా కామెడీ ట్రాకులు లేకపోయినా ఎక్కడా డ్రాప్ అవ్వలేదు. నిజానికిది పూర్తి స్థాయి సీరియస్ యాక్షన్ చిత్రం.

ప్రధమార్ధం గ్రిప్పింగ్ గా ఉండి, ఇంటర్వెల్ సీన్ హైలైట్ గా నిలిచి, క్లైమాక్స్ రొటీన్ గా ముగిసింది.

బాలకృష్ణ తన సహజ పద్ధతిలో చేసుకుపోయాడు. డాకు మహరాజ్ పాత్ర ఏ తూకంలో ఉండాలో ఆ లెక్కలో చేయించుకున్నాడు దర్శకుడు.

ప్రజ్ఞా జైస్వాల్ ఓకే. శ్రద్ధా శ్రీనాథ్ ది విషయమున్న పాత్ర. ఊర్వశి రౌతేలా ఫస్టాఫులో పూర్తిస్థాయి గ్లామర్ డోస్ అద్దింది.

బాబీ డియోల్ సీరియస్ విలనీ బాగుంది. నిజానికి “యానిమల్” లో అతని అభినయం చూసాక ఒక లెవిల్ అంచానాలుంటాయి ప్రేక్షకులకి. ఆ స్థాయిలో అతనిలోని క్రుయాలిటీని ఇందులో కూడా ఆవిష్కరించడం జరిగింది.

సచిన్ ఖేడేకర్ కి ఐదారు సీన్లున్నాయి. హర్షవర్ధన్, హిమజ, చాందిని చౌదరి ప్యాడింగ్ ఆర్టిస్టుల్లా ఉన్నారు. ఒకటో, అరో డైలాగ్స్ ఉన్నాయంతే. సత్య కాసేపు కనిపించినా పెద్దగా ఉపయోగం లేని పాత్ర అయిపోయింది. విటివి గణేష్ పాత్ర కూడా అంతే. మకరన్ దేశ్‌పాండేది కాస్త ఉనికి ఉన్న కేరెక్టర్. రవి కాలేకి పెద్ద స్కోప్ లేదు. దివి వైద్య అయితే ప్యాడింగ్ ఆర్టిస్టే.

“ఆదిత్య 369” లో పాస్ట్ ఎపిసోడ్ లో చివరి సీన్లో శ్రీకృష్ణదేవరాయలు గెటప్ ని ఇందులో డాకు మహరాజ్ పాత్రకి వాడారు. అయితే ఆ గెటప్ కి ఒరిజినల్ స్ఫూర్తి “సర్దార్ పాపారాయుడు”. ఒక సాధారణ సివిల్ ఇంజనీర్ ఆయుధం పట్టేసుకుని యోధుడైపోతాడా అంటే.. అది సినిమాటిక్ లిబర్టీ మాత్రమే అని పూర్తిగా కొట్టిపారేయలేం. ఎందరో టీచర్లు, చదువుకున్న వాళళ్లో కూడా అణగారిన జనాల తరపున నిలబడి పోరాడడానికి ఆయుధాలు పట్టుకున్నవాళ్లున్నారు గతంలో. పైగా ఇది పీరియడ్ బ్యాక్ డ్రాప్ చిత్రం కూడా కాబట్టి అన్-కన్విన్సింగ్ గా ఉందని కొట్టిపారేసే పాయింట్ కాదు.

చివరిగా చెప్పేదేంటంటే.. కొత్తదనం లేని కథే అయినా విసిగించదు, ప్రెడిక్టబుల్ గా సాగుతున్నా బోర్ కొట్టదు. ఊచకోతలు, హింసాత్మక పొయెటిక్ జస్టిస్, దుష్టశిక్షణ కలగల్సిన చిత్రమిది. పండగ రిలీజ్ కనుక ఏదో వినోదం, ఫ్యామిలీ సెంటిమెంట్ లాంటివి ఉంటాయని ఆశించకుండా.. బాలకృష్ణ నటించిన ఫక్తు కమెర్షియల్ యాక్షన్ సినిమా చూస్తున్నామని చూస్తే ఫ్యాన్స్ వరకు అంచనాలు ఏమాత్రం వమ్ము కావు. మిగిలిన వారికి మాత్రం “జస్ట్ ఓకే” అనిపిస్తుంది.

బాటం లైన్: ఓకే మహరాజ్!

23 Replies to “Daaku Maharaaj Review: మూవీ రివ్యూ: డాకు మహరాజ్”

          1. Despite of new release,huge negative campaign from Paccha and blue media present 3rd day Game-changer bookings are better than Daaku maharaj.Movie choosina common audience yevvedu kuda GC baagoledu anadu..

  1. గేమ్ changer కన్నా చాలా బెటర్ ఈ సినిమా ,ఊర్వశి మాత్రం అందాల విందుతో కుమ్మేసింది ,తమన్ మ్యూజిక్ ఇరగదీశాడు

  2. ఆ మాత్రం చాలు…సంక్రాంతి కి చెలరేగి పోతాడు బాలయ్య.. కధ లో కొత్తదనం లేకపోయినా గ్రిప్పింగా, ముఖ్యంగా మొదటి సగం ఇరగదీసాడు.. ఎక్కడా ఎక్స్ట్రా లు లేకుండా,బోరింగ్ అనేది లేకుండా బాబీ బాగా తీశాడు. తమన్ కి బాలయ్య సినిమా అంటే పూనకాలు వస్తాయి. దబిడి దబిడి సాంగ్ eye ఫీస్ట్.

    దుష్మ న్ కం హై..జాన్ దేనే వాలా జాదా హై! ఇప్పుడు కొత్త బాలయ్య.. ని చూస్తున్నాం….ఆబాల గోపాలం ఇప్పుడు బాలయ్య ఫాన్స్ లిస్ట్ లో చేరారు.. వాడు కున్నోళ్లకి వాడుకున్నంత…

  3. హిట్ అనేది హీరో నీ బట్టి కాదు,

    కథ, డైరెక్షన్ బట్టి అని ఇంకోసారి నిరూపించిన సినిమా.

    తనకి అలవాటు ఐ నట్లు తెగేసుకుంటూ వెళ్ళాడు బాలకృష్ణ.

    అతని నీ డిఫరెంట్ గా చూపించారు.

    మళయాలం లో మార్కో లో హీరో విజువల్ అప్పరీన్స్ బాగా వుంది. ఇక్కడ అలాగే ఫాలో అయ్యారు.

    బాలకృష్ణ సొంత బ్రాండ్ ఆరా డానికి తోడు అయింది.

    సంక్రాంతి కి సరదా గా ఫ్రెండ్స్ తో కలిసి ఒకసారి వెళ్లొచ్చు థియేటర్ కి. కానీ థియేటర్ లో డాన్సు టైమ్ లో లేచి మీరు కూడా సరదాగా ఈలలు వేసే సత్తా వుంటేనే వెళ్ళండి.

    లేకపోతే ఇంట్లో oot లో వచ్చినప్పుడు చూడండి.

  4. దురదృష్టవశాత్తు, శంకర్ గేమ్ ఛంజెర్ కన్నా ఇది చాలా ఉత్తమం. అన్నిటిలోకి మన వెంకీ సినిమా అందరు చూడదగ్గ సినిమా, ఇది బాలయ్య ఫాన్స్ కోసం. GC – అరవ డబ్బింగ్ చేసుకొని వాళ్ళు చూసుకోవచ్చు.

Comments are closed.