Advertisement

Advertisement


Home > Movies - Reviews

Liger Review: మూవీ రివ్యూ: లైగర్

Liger Review: మూవీ రివ్యూ: లైగర్

టైటిల్: లైగర్
రేటింగ్: 2/5
తారాగణం: విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్య కృష్ణ, రోనిత్ రాయ్, విష్ణు రెడ్డి, ఆలి, గెటప్ శీను, మైక్ టైసన్ తదితరులు
కెమెరా: విష్ణు శర్మ
ఎడిటింగ్: జునైద్ సిద్దికి
సంగీతం (బ్యాక్ గ్రౌండ్): సునీల్ కాశ్యప్
నిర్మాతలు: కరణ్ జోహార్, పూరి జగన్నాథ్, చార్మి, అపూర్వ మెహ్త అంద్ హీరూ యాష్ జోహార్
దర్శకత్వం: పూరి జగన్నాథ్
విడుదల తేదీ: 25 ఆగష్ట్ 2022

మొట్టమొదటిసారిగా విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా హీరోగా అరంగేట్రం, భారీ స్థాయి ప్రచారం, ప్రపంచప్రఖ్యాత బాక్సింగ్ యోధుడు మైక్ టైసన్ నటించడం... వెరసి మరో "ఇస్మార్ట్ శంకర్" అవుతుందేమోనని "లైగర్" మీద ప్రేక్షకుల ఫోకస్ పడింది. 

పూరీ జగన్నాథ్ చేయితిరిగిన దర్శకుడు. "పోకిరి" లాంటి అద్భుతాన్ని రాసినవాడు, తీసినవాడు. తన సినిమా ఎలా ఉన్నా డయలాగ్స్ లో జీవిత సత్యాలు, ఫిలాసఫీ, ఫన్ ఉంటాయని ప్రేక్షకులకి ఆశ. ఆ అనుభూతిని పొందాలని ఆయన అభిమానులు ప్రతి సినిమా కోసం వేయికళ్లతో చూస్తుంటారు. 

అవన్నీ ఏ మేరకు ఉన్నాయో చూద్దాం. 

ఏ దర్శకుడైనా ప్రధానంగా దృష్టి పెట్టాల్సింది హీరోగా నటించే నటుడి బలాల మీద. ఇక్కడున్నది విజయ్ దేవరకొండ. అతని బలమే డయలాగ్ డెలివెరీ. ఈ విషయంలో తనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. అతని పట్ల ప్రేక్షకులు అభిమానం పెంచుకోవడానికి ఒకానొక ముఖ్యకారణం ఇదే. కానీ ఈ లైగర్ పాత్రకి నత్తిని పెట్టి ఆ బలాన్ని బయటికి రాకుండా చేసేసాడు దర్శకుడు. హీరోకి ఏ మందు కొట్టడం వల్లో, షాక్ కొట్టడం వల్లో కాసేపు నత్తిగా మాట్లాడతాడంటే తట్టుకోవచ్చు..కానీ ఆద్యంతం కథానాయకుడి నత్తిని భరించాలంటే కష్టం. పోనీ ఓపికగా చూసినా ఎమోషనల్ జర్నీకి అడ్డుపడుతుంటుంది. పైగా మొట్టమొదటి సారి హిందీ తెర మీదకి కూడా వెళ్తున్న ఈ నటుడికి మాట సరిగా లేకపోతే అక్కడి ఆడియన్స్ ఎలా కనెక్ట్ అవుతారు! పోనీ ఈ నత్తి వల్ల కథకేమైనా అవసరముందా అంటే ఏ మాత్రం లేదు. 

ఇక కథ విషయానికొస్తే ఇది అత్యంత పేలవమైన సాదా సీదా కథ. ప్రేక్షకులకి కొత్త ఫ్లావరేమీ తగలదు. ఇలాంటి కథలు కోకొల్లలుగా వచ్చేసాయి కూడా. 

అన్ని మార్షల్ ఆర్ట్స్ ని కలగలిపి రూపొందించిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎం.ఎం.ఏ) నేపథ్యంలో సాగే కథ ఇది. 

"కుస్తీ" నేపథ్యంగా తీసిన "దంగల్"లో అసలు కుస్తీ అంటే ఏంటో, అందులో ఉన్న టెక్నికాలిటీస్ ఏమిటో చాలా ఆసక్తికరంగా చూసాం. అవన్నీ క్లైమక్స్ లో కల్మినేట్ అవుతుంట్ భావోద్వేగానికి గురయ్యాం. అందుకే అది ఆ స్థాయిలో నిలబడింది. కానీ ఇక్కడ ఆ ఎమోషనే కనపడదు. స్పోర్ట్ గురించి వివరమే లేదు, రింగులో నిలబడి తన్నుకోవడం తప్ప. అంటే రైటింగులో డీటైలింగ్ లేదు. 

ఇంత సెటప్ పెట్టుకున్నా కూడా ఏ రీసర్చ్ అవసరంలేకుండా రాసిన ఒక సాధారణ లవ్ స్టోరీగా మారిపోయింది. పోనీ అదైనా బలంగా ఉందా అంటే అసలు హీరోయిన్ క్యారక్టరే పరమ వీక్. ఆమె హీరోతో బ్రేకప్ కి కారణం చూస్తే పూరి మీద జాలిపడాల్సొస్తుంది, ఇంత వీక్ పాయింటా అని. 

రమ్యకృష్ణ పాత్ర నేపథ్యం కరీంనగర్. కానీ ఆమె యాస ఏ ప్రాంతానిదో, ఏ మతానిదో తెలియకుండా కంగాళీగా అనిపిస్తుంది. కొన్ని చోట్ల ఆమె ఓవరాక్షన్ కూడా ఇబ్బంది పెడుతుంది. 

ఈ సినిమా పరమ రొటీన్ గా ఉన్నా చివరి వరకు ఆడియన్స్ కూర్చున్నారంటే కారణం విజయ్ దేవరకొండ మాత్రమే. తన ఆకట్టుకునే స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు, బాడీకి ఫైటర్ లుక్ ఇవ్వడానికి అతను పడిన కష్టం కళ్లకు కట్టినట్టు కనపడింది. ఈ విషయంలో అతని కృషి లోపం అస్సలు లేదు. కానీ స్క్రిప్ట్ వీకవ్వడం మూలాన, పాత్రకు నత్తి పెట్టడం వల్ల అతను తన 100% ట్యాలెంట్ ని బయట పెట్టలేకపోయాడు. 

ఇక ఈ సినిమాకి ప్రచారపరంగా అతి పెద్ద ఆకర్షణ మైక్ టైసన్. క్లైమాక్స్ లో వచ్చే ఈ పాత్ర ఏ రకమైన మెరుపులు మెరిపించదు. టైసన్ ని మన సినిమాలో చూస్తున్నామనే కొత్త ఫీలింగ్ తప్ప కథనపరంగా ఏ ప్రయోజనమూ కనపడలేదు. అంత పెద్ద మనిషిని పెట్టుకుని ఏ మాత్రం మజిల్ లేని క్యారక్టర్ రాసుకున్నారు. ఎంత కేమియో అయినా ఆ పాత్రకంటూ గూస్బంప్స్ తెప్పించే గ్రేస్ ఉండాలి కదా! అది పూర్తిగా మిస్సయ్యింది. 

టెక్నికల్ గా కూడా అద్భుతాలేవీ లేవు. లాస్ వేగాస్ లో తీసినా కూడా ఫైటింగ్ రింగ్ తప్ప ఆ సిటీ బ్యాక్ గ్రౌండ్ పెద్దగా చూపించలేదు. 

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పాలంటే ఇందులో విజయ్ ని చూసి అతని నత్తిని విన్న ఆలి ఒక డయలాగ్ కొడతాడు- "వీడియో చూస్తే అలా ఉంది- ఆడియో ఏంటి ఇంత దారుణంగా ఉంది" అని. యాజిటీజ్ గా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి ఇంతే చెప్పుకోవాలి. 

పాటలు మాత్రం దేనికదే బాగున్నాయి. అయినా కథనం బ్యాడ్ అవడం వల్ల పాటల్ని కూడా పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోవడం బాధాకరం. 

సినిమా మొదట్లో హీరో తన ఫ్లాష్ బ్యాక్ చెప్తూ, "నాకు కథ చెప్పడం రాదు..కానీ చెప్పే ప్రయత్నం చేస్తా" అంటాడు. ఈ సినిమా వరకు పూరీ జగన్నాథ్ పరిస్థితి అలాగే ఉందనిపించింది. విజయ్ దేవరకొండని చూసి వ్యామోహంలో పడిపోయి ఒక మాస్ సినిమా తీసెయ్యాలనే యావతో దిగిపోయారు తప్ప కథ మీద, కథనం మీద ఏ రకమైన వర్క్-షాప్ కూడా పెట్టుకోలేదనిపించింది. లేకపోతే క్లైమాక్స్ అంత దారుణంగా అయితే ఉండదు. హీరో, అతని తల్లి ఏ లక్ష్యంతో బతుకుతుంటారో ఆ లక్ష్యం నెరవేర్చకుండానే దర్శకుడు ఒక అవసరం లేని పాట పెట్టి రోలింగ్ టైటిల్స్ వేసేయడం ఓవర్ కానిఫిడెన్స్ కి, లెక్క లేనితనానికి, టెకిట్-ఫర్-గ్రాంటెడ్ కి నిదర్శనం. 

మరో పెద్ద మైనస్ ఇందులో విలన్లు లేకపోవడం. పూరీ సినిమాల్లో బలమైన విలన్లుంటారు. కానీ అదేంటో మరి...ఈ ఫండమెంటల్ ని కూడా గాలికొదిలేసారు. 

ఓవరాల్ గా ఈ సినిమా పరిస్థితి ఏంటి అంటే రోనిత్ రాయ్ డయలాగ్ గుర్తొస్తుంది. ఒక సీన్లో "ప్రతీదీ రిటర్న్స్ కోసం కాదు..ప్రైడ్ కోసం చెయ్యాలి" అంటాడు. బహుశా ప్యాన్ ఇండియా సినిమా అనే ప్రైడ్ కోసం మాత్రమే ఈ సినిమా తియ్యాలనుకున్నారేమో. 

బాటం లైన్: క..క..క..కష్టం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?