Return of the Dragon Review: మూవీ రివ్యూ: రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్

కాలేజీ జీవితం ఎలా ఉన్నా చివరిగా జీవితంలో గెలుపోటములు, తప్పొప్పులు, పశ్చాత్తాపాల మధ్య నలిగి సాత్వికమైన ముగింపుని చూసేవాళ్లకి బానే ఉంటుంది.

చిత్రం: రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్
రేటింగ్: 2.5/5
తారాగణం: ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్, కయదు లోహార్, కె ఎస్ రవికుమార్, గౌతం వాసుదేవ్ మీనన్, మిస్కిన్, జార్జ్ మర్యన్, ఇందుమతి, స్నేహ తదితరులు
ఎడిటింగ్: ప్రదీప్ రాఘవ్
కెమెరా: నికేత్ బొమ్మిరెడ్డి
సంగీతం: లియోన్ జేంస్
నిర్మాతలు: కల్పతి అఘోరం, గణేష్, సురేష్
దర్శకత్వం: అశ్వథ్ మారిముత్తు
విడుదల: 21 ఫిబ్రవరి 2025

2022లో “లవ్ టుడే” తో అలరించిన దర్శక హీరో ప్రదీప్ రంగనాథన్ ఈ “రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్” లో హీరో. దర్శకుడు మాత్రం అశ్వథ్ మారిముత్తు. “ఓరి దేవుడా” తీసిన దర్శకుడు ఇతను. ట్రైలర్ ఆకట్టుకుంది. వినోదాన్ని ఆశించే యువ ప్రేక్షకుల దృష్టి దీనిపై పడింది. ఇంతకీ ఎలా ఉందో చూద్దాం.

టెంత్ వరకూ టాపర్ అయిన రాఘవన్ (ప్రదీప్ రాఘవన్), తాను ఇష్టపడ్డ అమ్మాయి ఒక పనికిమాలిన వాడిని ఇష్టపడిందని మనసు విరిగిపోయి, తనకి తానుగా డ్రాగన్ అని పేరు పెట్టుకుని బ్యాడ్ బాయ్ గా తన కాలేజీ జీవితాన్ని ప్రారంభిస్తాడు. నాలుగేళ్ల ఇంజనీరింగ్ జీవితంలో కీర్తి (అనుపమ) తో లవ్ లో పడతాడు. 48 సబ్జెక్టులు బ్యాక్ లాగులు పెట్టుకుంటాడు. దిగువ మధ్యతరగతి తల్లిదండ్రుల్ని మోసం చేసి నెలకి రూ 18000 ల జీతం గల ఉద్యోగం చేస్తున్నానని నమ్మిస్తూ బతుకుతాడు. కానీ కీర్తి కూడా అతనికి దూరమవుతుంది. దానికి కారణం తాను ఫెయిల్యూర్ గా మిగలడమే అని తెలుస్తుంది. మళ్లీ అతని మనసు విరిగిపోతుంది.

ఎలాగైనా జీవితంలో ఎదిగి సక్సెస్ అవ్వాలనుకుంటాడు. ఎన్నో అడ్డదార్లు తొక్కుతాడు. అవేమిటి? వాటి వల్ల అతను పొందిన సక్సెస్ ఏమిటి? అతని తప్పులు ఎవరి జీవితాలని ప్రభావితం చేసాయి, అతను ఎలా ప్రభావితం చెందాడు అనేది కథ.

కథతో పాటు కథనం..దానితో పాటు ట్విస్టులు, అందులోనే వినోదం, చివరికి సందేశం..ఇలా నానారకాల కలయికతో ఉన్న ఈ “డ్రాగన్” బోర్ కొట్టదు కానీ, కొంతవరకు డ్రాగ్-ఆన్ అయినట్టు అనిపిస్తుంది.

ట్యాలెంట్ ఉన్న విద్యార్థులు, యుక్త వయసులో చేసే తప్పులు, వాటి వల్ల వచ్చే ఇబ్బందులు, వాటిని అధిగమించడానికి చేసే మరింత పెద్ద తప్పులు, చివరికి తప్పుని దిద్దుకునే క్రమం..హత్తుకునే విధంగా తెరకెక్కించాలన్న ప్రయత్నం బాగుంది.

ట్యాలెంట్ ఉంటే చాలు ఏ కంపెనీ అయినా ఉద్యోగం ఇచ్చేస్తుంది, డిగ్రీతో సంబంధం లేదు..అనే ఆలోచనలతో ఒక వర్గం యువత ఉంది. కానీ పెద్ద కంపెనీల్లోనూ, ఎమ్మెన్సీలలోనూ అలా ఉండదు. తరచూ బ్యాక్ గ్రౌండ్ చెక్స్ ఉంటాయి. ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి ఉద్యోగాలు సంపాదిస్తే చట్టబద్ధమైన శిక్షలు కూడా పడతాయి. ఎంత ట్యాలెంటుతో కంపెనీకి పనికొచ్చే పనులు చేసినా ఒక్కసారి ఫ్రాడ్ అని తేలితే ఇబ్బందులు తప్పవు. వాటన్నింటినీ ఒక చక్కటి కథలో పొందుపరిచి చెప్పడం ఈ చిత్రంలో ప్రత్యేకత. నేటి యువతలో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యేలా ఉన్న కథా కథనాలు ఇందులో ఉన్నాయి. నేర్చుకోవడానికి, మలచుకోవడానికి కావాల్సిన విషయాలు కూడా ఉన్నాయి.

నటీనటుల విషయానికి వస్తే ప్రదీప్ రంగనాథన్ తన పాత్రలో జీవించాడు. ఆద్యంతం ఆకట్టుకున్నాడు. సున్నిత హాస్యం, పొగరుబోతుతనం, మోసం, పశ్చాత్తాపం అన్నీ అతనిలో పలికాయి.

అనుపమ పరమేశ్వరన్ కీర్తి పాత్రలో ఒదిగిపోయింది. ప్రదీప్ పక్కన సరిపోయింది. “అల్లూరి” సినిమాలో శ్రీవిష్ణు సరసన కనిపించిన అస్సామీ నటి కాయదు లోహర్ ఇందులో రెండో హీరోయిన్. ఆమెది చాలా నిడివి ఉన్న పాత్ర. గ్లామర్ కి, అభినయానికి కూడా స్కోప్ ఉన్న కేరెక్టర్.

గౌతం వాసుదేవ్ మీనన్, కె ఎస్ రవికుమార్ కేరెక్టర్ ఆర్టిస్టులుగా కనిపించారు. స్నేహది గెస్ట్ రోల్.

హీరో తల్లిదండ్రులుగా జార్జ్ మర్యన్, ఇందుమతి సరిపోయారు.

కాలేజ్ ప్రిన్సిపాల్ గా మిస్కిన్ నటన బాగుంది. నిండైన విగ్రహంతో, కొంత కన్నింగ్ లుక్ తో పర్ఫెక్ట్ గా సూటయ్యాడు.

సాంకేతికంగా చూస్తే సంగీత సాహిత్యాలు బాగున్నాయి. పాటల్లో పదాలు స్పష్టంగా వినిపించాయి. ఆ విషయంలో సంగీత దర్శకుడు లియాన్ జేంస్ ని అభినందించాలి. అలాగే బాణీల్లో చక్కని పదాలు, అర్ధవంతమైన కవిత్వం పలికాయి. ఆ విషయంలో రామజోగయ్య శాస్త్రిని కూడా అభినందించాలి. ఎక్కడా డబ్బింగ్ పాటలు వింటున్నట్టు లేదు.

కెమెరా వర్క్, ఎడిటింగ్ లు బాగున్నాయి. ఫస్టాఫులో కొంత భాగం డ్రాగ్-ఆన్ అయినట్టున్నా, రెండో సగం మిడ్-పార్ట్ లెంగ్దీగా అనిపించినా అది ఎడిటర్ మిస్టేక్ కాదు. దర్శకుడే ఆ స్పేస్ పెట్టుకున్నాడు.

యువతని టార్గెట్ చేసే చిత్రాలంటూ కేవలం బూతులు, అశ్లీల దృశ్యాలు కాకుండా సరైన కథాకథనాలతో విలువలతో కూడిన కథతో, నేటి తరానికి పనికొచ్చే సినిమా తీసినందుకు దర్శక నిర్మాతలని అభినందించాలి.

పైన చెప్పుకున్నట్టు కొంత భాగం డ్రాగ్-ఆన్ అవుతోందని అనిపించే లోపే, సరైన సీన్లు పడి బానే ఉందనిపిస్తుంది. కానీ “లవ్ టుడే”లో ఉన్నంత విండొదం ఇందులో వర్కౌట్ కాలేదు. ఆ సినిమాతో పోలిక ఎందుకు..అంటే..తప్పదు. ఎందుకంటే ఈ చిత్రానికి ఓపెనింగ్స్ వచ్చిందే ఆ చిత్రాన్ని ఇష్టపడ్డవాళ్ల నుంచి. ఆ తరహా కామెడీ లేకపోయినా, “3 ఇడియట్స్” వైబ్స్ ఇష్టపడేవాళ్ళకి నచ్చుతుంది. కాలేజీ జీవితం ఎలా ఉన్నా చివరిగా జీవితంలో గెలుపోటములు, తప్పొప్పులు, పశ్చాత్తాపాల మధ్య నలిగి సాత్వికమైన ముగింపుని చూసేవాళ్లకి బానే ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే వినోదం తక్కువ-సందేశం ఎక్కువ ఉన్న చిత్రమిది.

బాటం లైన్: సందేశాత్మకం

8 Replies to “Return of the Dragon Review: మూవీ రివ్యూ: రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్”

  1. ఏదో ఒక సినిమా డిఫరెంట్ గా ఉంది అని తెలుగు వాళ్ళు చూసారు..ఈ అరవ సినిమాలకి ఇక్కడ తెలుగు మార్కెట్ బాగా చీప్ గా దొరికింది…మన సినిమాలు మళ్ళీ అక్కడ చూడరు….

Comments are closed.