రివ్యూ: భాయ్
రేటింగ్: 2/5
బ్యానర్: అన్నపూర్ణ స్టూడియోస్
తారాగణం: నాగార్జున, రిచా గంగోపాధ్యాయ, సోనూ సూద్, బ్రహ్మానందం, ఆశిష్ విద్యార్థి, జయప్రకాష్‌రెడ్డి, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ తదితరులు
మాటలు: రత్నబాబు, సందీప్
సంగీతం: దేవిశ్రీప్రసాద్
కూర్పు: కార్తీక శ్రీనివాస్
ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి
నిర్మాత: అక్కినేని నాగార్జున
కథ, కథనం, దర్శకత్వం: వీరభద్రమ్
విడుదల తేదీ: అక్టోబర్ 25, 2013
కొంతకాలంగా ప్రయోగాలు చేస్తున్న నాగార్జున చాలా గ్యాప్ తర్వాత ఒక కమర్షియల్ సినిమా చేశారు. ఈమధ్య చాలా అరుదుగా నిర్మాత అవతారమెత్తుతున్న ఆయన ‘భాయ్’ చిత్రాన్ని స్వయంగా నిర్మించారు. ‘అహ నా పెళ్లంట’, ‘పూలరంగడు’ చిత్రాలతో విజయాలు అందుకున్న వీరభద్రమ్‌కి ఈ చిత్రంతో ప్రమోషన్ దక్కింది… సరాసరి ఒక పెద్ద స్టార్‌ని డైరెక్ట్ చేశాడు. కొన్నేళ్లుగా నాగార్జునకి దక్కకుండా పోతున్న విజయాన్ని ‘భాయ్’ అందిస్తుందని అక్కినేని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. మరి వీరభద్రమ్ ఆ ఆశల్ని తీర్చే సినిమా తీశాడా?
కథేంటి?
మాఫియా డాన్ డేవిడ్‌కి (ఆశిష్) కుడిభుజంలాంటి భాయ్ (నాగార్జున) హైదరాబాద్‌లో తమ మాఫియా కార్యకలాపాలకి అడ్డు తగుల్తున్న ఓ పోలీస్‌ని మట్టుబెట్టడానికి వస్తాడు. అండర్ కవర్‌లో ఉన్న ఆ పోలీస్ ఎవరో తెలుసుకుని, అతడిని కాల్చి చంపుదామనుకునే లోపు అతనే తన తమ్ముడని (ప్రసన్న కుమార్) అని భాయ్‌కి తెలుస్తుంది. చిన్నతనంలో ఇంట్లోనుంచి వెళ్లిపోయిన భాయ్ ఇప్పుడు తన కుటుంబానికి దగ్గరై, చెల్లి పెళ్లి దగ్గరుండి చేద్దామనుకుంటాడు. అయితే భాయ్ తమ్ముడి కారణంగా తన చిన్న కొడుకుని పోగొట్టుకున్న డేవిడ్ అతడిని చంపేందుకు తన పెద్ద కొడుకుతో (సోనూ సూద్) కలిసి హైదరాబాద్‌కి వస్తాడు. వారి బారి నుంచి తమ్ముడ్ని కాపాడుకుని, తిరిగి తన కుటుంబానికి ఎలా దగ్గరయ్యాడనేది కథ.
కళాకారుల పనితీరు!
నాగార్జునకి ఈ పాత్ర కొత్తదేం కాదు. ఆయన గతంలో చేసిన కొన్ని క్యారెక్టర్స్‌ని పోలి ఉన్న ఈ పాత్రలో వివిధ మాండలికాల్లో మాట్లాడుతూ కొత్తదనం తెచ్చే ప్రయత్నం చేశారు. మూడు గెటప్స్‌లో కనిపించినా కానీ నాగార్జునకి నటుడిగా ఎలాంటి పరీక్ష ఎదురు కాలేదు. ఎప్పట్లానే అందంగా కనిపించి మన్మథుడు అనిపించుకున్నారు.
రిచా గంగోపాధ్యాయకి ఇందులో గుర్తించదగ్గ పాత్ర లేదు. పాటలకే ఆమె పాత్రని పరిమితం చేశారు. నటన పరంగా ఆమె ఏమాత్రం మెరుగుపడలేదు. విలన్లు చాలా మందే ఉన్నారు. స్నేహ భర్త ప్రసన్నకి ఈ చిత్రంలో నాగార్జున తమ్ముడిగా గుర్తించదగ్గ క్యారెక్టర్ ఇచ్చారు. అతను ఫర్వాలేదనిపించుకున్నాడు. సోనూ సూద్ టాలెంట్‌కి తగ్గ క్యారెక్టర్‌ని రాసుకోలేకపోయారు. ఆశిష్ విద్యార్థి సంభాషణలు విసిగిస్తాయి. అజయ్, రాహుల్ దేవ్, జయప్రకాష్‌రెడ్డి ఇతర విలన్స్‌గా నటించారు. బ్రహ్మానందం క్యారెక్టర్ ఎక్కువ సేపు లేదు. ఉన్నంతలో కాస్తో కూస్తో నవ్వించింది బ్రహ్మానందం మాత్రమే. ఎమ్మెస్ నారాయణ కూడా అక్కడక్కడా పంచ్‌లు పేల్చాడు. రఘుబాబు, రాజేష్ తదితరుల కామెడీ పండలేదు. హంసా నందిని, నథాలియా కౌర్ చెరో పాట షేర్ చేసుకున్నారు.
సాంకేతిక వర్గం పనితీరు:
సినిమా నిండా పంచ్ డైలాగ్‌లు ఉండాలని పట్టుబట్టి మరీ రాసినట్టున్నారు. కొన్ని డైలాగ్‌లు బాగానే ఉన్నా కానీ చాలా వరకు సీన్‌తో సంబంధం లేకుండా, అతిగా అనిపించాయి. ప్రాస కోసం పాకులాట ఈ చిత్రంలోను బాగా కనిపించింది. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. ఎడిటింగ్ బాలేదు. సీన్‌కీ, సీన్‌కీ లింక్ లేనట్టుగా కథనం సాగుతుంది. ప్రథమార్థంలో ఈ సమస్య మరీ ఎక్కువైంది.
దేవిశ్రీప్రసాద్ సంగీతం సోసోగా ఉంది. భాయ్ టైటిల్ సాంగ్ క్యాచీగా ఉంది. నేపథ్య సంగీతం కొన్ని సీన్స్‌లో మాత్రమే బాగుంది. నిర్మాతగా నాగార్జున రాజీ పడలేదు. చాలా మంది ఆర్టిస్టులు, ఎన్నో లొకేషన్లు ఉన్న ఈ చిత్రానికి ఖర్చు బాగానే పెట్టారు. అన్నపూర్ణా స్టూడియోస్ బ్యానర్ వేల్యూకి తగ్గట్టుగా ప్రొడక్షన్ వేల్యూస్ ఉన్నాయి.
మొదటి రెండు సినిమాల్లో కామెడీ పండించి విజయాలు అందుకున్న వీరభద్రమ్ ఈ సినిమాతో ట్రాక్ మార్చాడు. స్టయిలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే స్టయిల్ మీద దృష్టి ఎక్కువ పెట్టి సబ్‌స్టెన్స్ గురించి పట్టించుకోలేదు. ఈ కథపై చాలా కాలం వర్క్ చేశానని చెబుతున్న వీరభద్రమ్ సరైన కథనం రాసుకోవడంలో విఫలమయ్యాడు. నాగార్జునని స్టయిలిష్‌గా చూపించే ప్రయత్నంలో తన స్టయిల్ మర్చిపోయి, కామెడీ సీన్స్‌తో కూడా రాణించలేకపోయాడు.
హైలైట్స్:
- నాగార్జున లుక్స్
- ప్రొడక్షన్ వేల్యూస్
డ్రాబ్యాక్స్:
- స్క్రీన్‌ప్లే
- డైలాగ్స్
- ఫస్ట్ హాఫ్
విశ్లేషణ:
స్టోరీ టేకాఫ్ అయిన విధానం కానీ, హీరో ఇంట్రడక్షన్ సీన్స్ కానీ ఆకట్టుకోవు. సినిమాపై పాజిటివ్ ఇంప్రెషన్ కలిగించి, హుక్ చేయాల్సిన చోట దర్శకుడు ఫెయిలయ్యాడు. అవసరానికి మించిన పంచ్ డైలాగులతో, తెరపై ఉన్న క్యారెక్టర్లన్నీ మాటల ‘తూటాలు’ పేలుస్తూ కాన్సన్‌ట్రేషన్‌ని దెబ్బ తీస్తాయి. హీరో పరిచయం లోపే పదుల కొద్దీ పంచ్ డైలాగులు పేల్చేసారంటే ఎంత అతిగా మాట్లాడించారో అర్థం చేసుకోవచ్చు.
నాగార్జున బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కి వచ్చే కారణం, దాని కోసం చేసే ప్రయత్నం అంతా ఏదో ఇంటర్వెల్ వరకు టైమ్ పాస్ చేయడానికి చేస్తున్నట్టు అనిపిస్తుంది. హీరోయిన్ ట్రాక్‌తో అయినా కాస్త వినోదం పండించడానికి అవకాశమున్నా దర్శకుడు ఆ దిశగా దృష్టి పెట్టలేదు. ఏ దశలోను మెయిన్ ప్లాట్‌తో హీరోయిన్ ట్రాక్ ముడిపడకపోగా, విడిగా ముందుకి సాగుతూ, హీరోయిన్ కనిపించినప్పుడల్లా విసిగిస్తుంది.
ఇంటర్వెల్ దగ్గర అసలు కథలోకి వెళ్లిన దర్శకుడు ఆ తర్వాత ‘భాయ్’ని అన్ని మసాలాలున్న కమర్షియల్ సినిమాగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. సెంటిమెంట్, కామెడీకి చోటు దక్కడంతో పాటు హీరోకి ఒక లక్ష్యం కూడా ద్వితీయార్థంలోనే ఏర్పడడం వల్ల ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ బెటర్ అనే ఫీలింగ్ వస్తుంది. అయితే విలన్స్ వీక్ అవడం వల్ల స్టార్టింగ్‌లో భాయ్‌కిచ్చిన బిల్డప్‌కి తగ్గ యాక్షన్ మిస్ అయింది.
కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌లో కొత్త కథలు ఏమీ ఉండవు కానీ స్క్రీన్‌ప్లేతో, మంచి కామెడీతో సక్సెస్ చేస్తుంటారు. కానీ వీరభద్రమ్ ‘భాయ్’ చిత్రంలో స్క్రీన్‌ప్లే పరంగా చాలా తప్పులు చేశాడు. ఎక్కడా కథని ఆసక్తికరంగా నడిపించలేకపోయాడు. కామెడీ కూడా పెద్దగా వర్కవుట్ కాకపోవడంతో ‘భాయ్’ భారంగా తయారయ్యాడు.
బోటమ్ లైన్: లాభం లేదు ‘భాయ్’!
– ఏ.ఆర్.