రివ్యూ: విల్లా (పిజ్జా 2)
రేటింగ్: 3/5
బ్యానర్: గుడ్ సినిమా గ్రూప్, స్టూడియో సౌత్ ప్రొడక్షన్స్
తారాగణం: అశోక్ సెల్వన్, సంచితా షెట్టి, నాజర్ తదితరులు
మాటలు: శశాంక్ వెన్నెలకంటి
సంగీతం: సంతోష్ నారాయణన్
కూర్పు: లియో జాన్ పాల్
ఛాయాగ్రహణం: దీపక్ కుమార్ పాధి
నిర్మాతలు: గుడ్ ఫ్రెండ్స్
కథ, కథనం, దర్శకత్వం: దీపన్ చక్రవర్తి
విడుదల తేదీ: నవంబర్ 16, 2013
షార్ట్ ఫిలింస్‌తో పాపులర్ అయిన వారిని డైరెక్టర్లుగా పరిచయం చేస్తూ తమిళంలో చాలా చిత్రాలొస్తున్నాయీ మధ్య. లవ్ ఫెయిల్యూర్, పిజ్జా చిత్రాల దర్శకులు అలా షార్ట్ ఫిలింస్‌తో కెరీర్ స్టార్ట్ చేసిన వారే. ‘విల్లా’ దర్శకుడు దీపన్ చక్రవర్తి నేపథ్యం కూడా అదే. విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకాభినందనలు కూడా అందుకున్న ‘పిజ్జా’ చిత్రం స్ఫూర్తితో ‘విల్లా’ తెరకెక్కిందని చెబుతూ దీనిని ‘పిజ్జా 2’గా ప్రచారం చేశారు. అయితే ‘పిజ్జా’కీ, ‘విల్లా’కీ ఎలాంటి సంబంధం లేదు. ప్రేక్షకుల్ని ఈజీగా ఆకట్టుకోవచ్చుననే పబ్లిసిటీ ఎత్తుగడే తప్ప అంతకు మించి ‘పిజ్జా’తో దీనికి ఎటువంటి సిమిలారిటీ కానీ, దాంట్లో ఉన్న సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్ కానీ ఇందులో లేవు. ‘పిజ్జా’తో పోల్చకుండా చూస్తే మాత్రం థ్రిల్లర్ జోనర్ ఫాన్స్‌ని ఆకట్టుకునే అంశాలు ‘విల్లా’లో బాగానే ఉన్నాయి.
కథేంటి?
నవలా రచయిత అయిన జబిన్ (అశోక్) కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న టైమ్‌లో అతని తండ్రి (నాజర్) చనిపోతాడు. తన తండ్రి చనిపోయిన తర్వాత జబిన్‌కి తమకో పెద్ద విల్లా ఉందనే విషయం తెలుస్తుంది. దానిని అమ్మి జీవితంలో సెటిల్ అవుదామని వెళ్లిన జబిన్‌కి ఆ విల్లాకి సంబంధించిన విచిత్రమైన విశేషాలు తెలుస్తాయి. ఆ విల్లా కారణంగా ఎంతోమంది చనిపోయారని, తనకీ ప్రాణ హాని ఉందని తెలుసుకున్న జబిన్ దాని గురించి రీసెర్చ్ మొదలు పెడతాడు. ఎలాగైనా జరిగే అనర్ధాన్ని ఆపాలని ప్రయత్నిస్తాడు.
కళాకారుల పనితీరు!
అశోక్ సెల్వన్‌కి చాలా లిమిటెడ్ స్కిల్స్ ఉన్నాయి. అలాంటి నటుడికి ఇంత ఎమోషనల్ క్యారెక్టర్ ఇవ్వడం సాహసమే. మంచి నటుడైతే ‘విల్లా’ని మరో లెవల్‌కి తీసుకుని వెళ్లి ఉండేవాడు. అశోక్‌కి బేసిక్ ఎమోషన్స్ అయిన కోపం, భయంలాంటివి కూడా అభినయించడం చేతకాలేదు. హీరోయిన్ సంచితా షెట్టి కూడా నటిగా ఆకట్టుకోలేకపోయింది. ‘పిజ్జా’ సక్సెస్‌లో సేతుపతి, రమ్య నటన కీలక పాత్ర పోషించింది. ఇలాంటి సినిమాలకి టాలెంటెడ్ లీడ్ పెయిర్ ఉండడమనేది చాలా ఇంపార్టెంట్. మిగిలిన నటీనటులు కూడా అవసరానికి మించి నటించారు. ఇళ్ల బ్రోకర్, హీరో స్నేహితుడు… ఓవరాక్ట్ చేశారు. నాజర్, ఎస్.జె. సూర్య చిన్న పాత్రల్లో కనిపించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
ఈ జోనర్ సినిమాలకి నేపథ్య సంగీతం ప్రధాన పాత్ర పోషిస్తుంది. సంతోష్ నారాయణన్ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కట్టి పడేశాడు. దీపక్ కుమార్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మరో బిగ్గెస్ట్ ఎస్సెట్. లో బడ్జెట్ సినిమా అయినా కానీ క్వాలిటీ పరంగా ఏ పెద్ద సినిమాకీ తీసిపోని విధంగా చక్కని ఫ్రేమింగ్, సినిమా మూడ్‌కి తగ్గ లైటింగ్ స్కీమ్స్‌తో దీపక్ ఈ చిత్రానికి బ్యాక్‌బోన్‌గా నిలిచాడు. సంభాషణల్లో మరీ ఉపన్యాస ధోరణి కనిపించింది. హీరో తప్ప మిగిలిన పాత్రలన్నీ అవసరానికి మించి మాట్లాడుతుంటాయి. ఎడిటింగ్ ద్వితీయార్థంలో చాలా బాగుంది. డబ్బింగ్ క్వాలిటీ బాగుంది. ఎక్కడా తమిళ లిపి కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
దీపన్ చక్రవర్తి చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్‌ని ఎంచుకుని దానిని చాలా బాగా ప్రెజెంట్ చేశాడు. దర్శకుడి పరిశోధన ఎంత చేశాడనేది అర్థం కావడంతో పాటు పలు సన్నివేశాల్లో అతని తెలివితేటలు కూడా హైలైట్ అవుతాయి. ఈ చిత్రం ఇంటర్వెల్ సీన్, సినిమాని ఎండ్ చేసిన విధానం దర్శకుడి ప్రతిభకి దర్పణం పడతాయి.
హైలైట్స్:
- కథనం
- నేపథ్య సంగీతం
- ఛాయాగ్రహణం
- పతాక సన్నివేశాలు
డ్రాబ్యాక్స్:
- తారాగణం
- కథలో తొలి అంకం
విశ్లేషణ:
ఈ సినిమా కాన్సెప్ట్ ఏమిటనేది ముందే ఊహించడానికి వీల్లేకుండా దర్శకుడు తెలివిగా కథ నడిపించాడు. ఒక్కో విషయం తెలిసే కొద్దీ ప్రేక్షకులకి కలిగే ఊహలకి భిన్నంగా కథ ముందుకు సాగుతుంది. అసలు కథకి కొన్ని లీడ్స్ ముందే ఇచ్చేసి, వాటిని అవసరమైనప్పుడే మళ్లీ తెర మీదకి తీసుకురావడమనే టెక్నిక్ ‘విల్లా’కి పెద్ద ప్లస్ పాయింట్. ఈ సినిమా దేనికి సంబంధించినది అనేది తెలియడానికి ఇంటర్వెల్ వరకు వేచి చూడాల్సి వస్తుంది. అంతవరకు ఆడియన్స్‌కి డైరెక్టర్ ఇచ్చే క్లూస్‌కి భిన్నంగా షాకింగ్ ఇంటర్వెల్ బ్లాక్‌తో కథ రసకందాయంలో పడుతుంది.
ఒక మామూలు థ్రిల్లర్ అనుకున్నది కాస్తా ‘సూపర్‌నేచురల్ థ్రిల్లర్’గా టర్న్ తీసుకున్నాక ‘విల్లా’ టాప్ గేర్‌లోకి చేరుకుంటుంది. సెకండాఫ్‌లో బిగి సడలని కథనం కట్టి పడేస్తుంది. చివరి ముప్పయ్ నిముషాలు ఊహించని మలుపులతో సాగి సూపర్ ట్విస్ట్‌తో సినిమా ముగుస్తుంది. ఏ సినిమా గొప్పతనమైనా చూస్తున్నప్పుడు కాదు… చూసి బయటకి వచ్చాక ఒకసారి తిరిగి దానిని రీకాల్ చేసుకుంటే తెలుస్తుంది. థియేటర్ బయటకి వచ్చిన తర్వాత ‘విల్లా’లో దర్శకుడు ఇచ్చిన క్లూస్‌తో క్లయిమాక్స్‌ని లింక్ చేసుకుంటే అబ్బుర పరుస్తుంది.
ఇది సగటు థ్రిల్లర్ లేదా హారర్ సినిమా అయితే ఖచ్చితంగా కాదు. సౌండ్స్‌తో, భయపెట్టే ఆకారాలతో ప్రేక్షకుల్ని థ్రిల్‌కి గురి చేయాలని దర్శకుడు చూడలేదు. తన కథలోని సస్పెన్స్‌ని లాస్ట్ షాట్ వరకు కంటిన్యూ చేసి తన నేర్పరితనంతో ఆకట్టుకుంటాడు. అందుకే చీప్ థ్రిల్స్ కోసం ఈ జోనర్ సినిమాలకి వెళ్లే సగటు ప్రేక్షకులకి ‘విల్లా’ గొప్పతనం అర్థం కాకపోవచ్చు. డైరెక్టర్ ఇంటిల్లిజెంట్ అప్రోచ్ వల్ల ‘విల్లా’ ఒక వర్గం ప్రేక్షకులకి పరిమితం అవుతుంది. రాబోయే రోజుల్లో ‘కల్ట్ స్టాటస్’ తెచ్చుకునే అవకాశాలు బాగా ఉన్న చిత్రమిది. ప్రథమార్థంలో సంభాషణల్లో ఆ ‘సుత్తి’ని తగ్గించి ఉంటే, మంచి తారాగణం ఉండి ఉంటే ‘విల్లా’ స్థాయి మరింత పెరిగి ఉండేది.
ఒక సరికొత్త అనుభూతి కావాలనుకుంటే ‘విల్లా’ చిత్రం తప్పక చూడాలి. రెగ్యులర్ హారర్/థ్రిల్లర్ సినిమాలకి పూర్తి భిన్నంగా సాగుతూ, చక్కని సాంకేతిక విలువలతో, అద్భుతమైన నెరేటివ్ స్కిల్స్‌తో ‘విల్లా’ ఒక స్పెషల్ మూవీగా లాస్టింగ్ ఇంప్రెషన్ వేస్తుంది.
బోటమ్ లైన్: ‘విల్లా’ ` ఆకట్టుకునే థ్రిల్లర్
వి.ఆర్