ఔను.. క్రికెట్‌ చిన్నబోయింది.!

ఏముంది.. సచిన్‌ రిటైరయ్యాక జట్టులో ఓ స్థానం ఖాళీ అవుతుంది.. ఇంకొకరు ఆ స్థానాన్ని భర్తీ చేయొచ్చు.. అని క్రికెట్‌ విశ్లేషకులు వీలు చిక్కినప్పుడల్లా సచిన్‌ని లైట్‌ తీసుకుంటూ మాట్లాడటం చూస్తూనే వున్నాం. సచిన్‌…

ఏముంది.. సచిన్‌ రిటైరయ్యాక జట్టులో ఓ స్థానం ఖాళీ అవుతుంది.. ఇంకొకరు ఆ స్థానాన్ని భర్తీ చేయొచ్చు.. అని క్రికెట్‌ విశ్లేషకులు వీలు చిక్కినప్పుడల్లా సచిన్‌ని లైట్‌ తీసుకుంటూ మాట్లాడటం చూస్తూనే వున్నాం. సచిన్‌ ఫామ్‌ కోల్పోయిన ప్రతిసారీ ఇదే మాట విమర్శకుల నుంచి వస్తోంది. అలా చాలామంది సచిన్‌ స్థానంలో జట్టులోకి వచ్చారు. కానీ, ఎవరూ సచిన్‌లా జట్టులో నిలదొక్కుకోలేకపోయారు.

ఇరవై నాలుగేళ్ళ క్రికెట్‌లో సచిన్‌ చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. బహుశా సచిన్‌ ఎదుర్కొన్నన్ని విమర్శలు ఇంకే ఇతర క్రికెట్‌ ఎదుర్కోలేదేమో. అందుక్కారణం.. ప్రతిసారీ సచిన్‌ సెంచరీ సాధించాల్సిందేనన్న అంచనాలే కావొచ్చు.. సచిన్‌ లేకపోతే టీమిండియా గెలవలేదన్న ఆభిప్రాయం కావొచ్చు.. కారణం ఏదైనా, సచిన్‌ లేని ఇండియన్‌ క్రికెట్‌ని ఊహించుకోవడం కష్టం. కాస్తంత అతిగా అన్పించినా సరే, క్రికెట్‌ అభిమానులు అనుకుంటున్నదే ఇది. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని క్రికెట్‌ ఆడే వివిధ దేశాల్లోని క్రికెట్‌ అభిమానులు ఇదే మాట అనుకుంటున్నారు.

సచిన్‌ సాదా సీదా క్రికెటర్‌ కాదని అందరికీ తెలుసు. సచిన్‌కి మాత్రమే ప్రత్యేకమైన కొన్ని షాట్స్‌ వున్నాయి. అవి సచిన్‌ ఆడితేనే చూడాలన్పిస్తుంది, చాలామంది క్రికెటర్లు సచిన్‌ని ఫాలో అవడానికి ప్రయత్నించారు.. ఎవరివల్లా కాలేదు. కెరీర్‌లో చివరి టెస్ట్‌ ఆడుతున్న సమయంలోనూ సచిన్‌.. తనకు మాత్రమే ప్రత్యేకమైన షాట్స్‌తో అలరించాడు.

వయసు ఎప్పుడూ ఒకేలా వుండదు కదా.. గవాస్కర్‌, కపిల్‌దేవ్‌ ఎలాగైతే రిటైర్‌ అయ్యారో.. కుంబ్లే, ద్రావిడ్‌, గంగూలీ ఎలాగైతే క్రికెట్‌కి దూరమవ్వాల్సి వచ్చిందో.. సచిన్‌ కూడా అంతే. కాకపోతే, సచిన్‌ కాస్త ఎక్కువ కాలం క్రికెట్‌ ఆడాడు.. ఎక్కువ మ్యాచ్‌లలో ఆడాడంతే. అంతే కాదు, చాలా వుంది. సచిన్‌ అంటేనే ఇండియన్‌ క్రికెట్‌.. ఇండియన్‌ క్రికెట్‌ అంటేనే సచిన్‌.

క్రికెట్‌ లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నా.. అని బహుశా ఇప్పటిదాకా రిటైర్‌మెంట్‌ ప్రకటించిన ఏ క్రికెటర్‌ అని వుండడు. ఎందుకంటే, సచిన్‌ అంతలా క్రికెట్‌కి అంకితమైపోయాడు. విమర్శకులకు ప్రతిసారీ బ్యాట్‌తోనే సమాధానమివ్వడం, నోటికి ఎప్పుడూ పని చెప్పకపోవడం సచిన్‌లోని ప్రత్యేక లక్షణాలు. జట్టులో సచిన్‌కి ఎవరితోనూ గొడవల్లేవు.. వుండవు కూడా. ఎందుకంటే, భారత క్రికెట్‌లో పదేళ్ళకుపైగానే పెద్దన్నగా సచిన్‌ చెలామణీ అయ్యాడు. సీనియర్ల దగ్గర ఎటూ బుడ్డోడే కావడంతో.. వారిని గౌరవించి, వారి అభిమానాన్నీ చూరగొన్నాడు.

సచిన్‌ చేసిన పరుగుల గురించీ, రికార్డుల గురించీ ఎంత తెలుసుకున్నా, ఎంతగా పదే పదే ప్రస్తావించుకుంటున్నా తనివి తీరదు. ఓ దశలో సచిన్‌ చేసే ప్రతి పరుగూ రికార్డు పరుగే అయినా, రికార్డుల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పనిలేకుండా పోయింది. ఎందుకంటే సచిన్‌ ఓ రికార్డ్‌ గనుక. ఆయనతోనే రికార్డులు నడిచాయి గనుక.

పరుగులు ఎవరైనా చేయొచ్చు.. రికార్డులు ఎవరైనా తిరగరాయొచ్చు.. కానీ, సచిన్‌లా ‘సరైన నడత’ భవిష్యత్‌ తరంలో ఊహించుకోలేం. అన్నిటికీ మించి, క్రికెట్‌ సర్వస్వం.. అనుకునే క్రికెటర్‌ని చూడలేం. కపిల్‌దేవ్‌ తర్వాత ఆ స్థాయి ఆల్‌రౌండర్‌ టీమిండియాకి ఇప్పటిదాకా దొరకలేదు.. ద్రావిడ్‌లా క్రీజ్‌లో నిలదొక్కుకునే బ్యాట్స్‌మన్‌ని మళ్ళీ చూడలేకపోయాం.. కుంబ్లేలా మ్యాచ్‌ని తిప్పగలిగే ‘ఇంటెలిజెంట్‌ బౌలర్‌’ వస్తాడని ఆశించలేం.. సచిన్‌.. లాంటోడి గురించి ఊహించుకోవడమూ కష్టమే.

సచిన్‌.. క్రికెట్‌కి నువ్వు మిస్‌ అవలేదు.. క్రికెట్‌ నిన్ను మిస్‌ అవుతోంది.. దేశమంతా.. దేశంలోని క్రికెట్‌ అభిమానులంతా.. ఆ మాటకొస్తే ప్రపంచంలోని క్రికెట్‌ని ఇష్టపడే ప్రతి ఒక్కరూ సచిన్‌ని మిస్‌ అవుతున్నారు. సచిన్‌ లేని క్రికెట్‌ని ఊహించుకోవడం ఎవరివల్లా కాదు. కానీ తప్పదు కదా.!