ఎమ్మెల్యేలు తిర‌గ‌డానికి భ‌య‌ప‌డుతున్నారా?

జ‌గ‌న్ ప్ర‌త్యేక‌త ఏమంటే గ్రౌండ్ రియాల్టీ తెలుసుకోడు. క్షేత్ర‌స్థాయి వాస్త‌వాలు నిజంగా తెలియ‌వా? తెలియ‌న‌ట్టుగా ఎమ్మెల్యేల మీటింగ్‌లో మాట్లాడుతున్నాడో అర్థం కాదు. ఆయ‌న చుట్టు వున్న‌వాళ్లు వాస్త‌వాలు చెబుతున్నారా? చెప్ప‌డానికి భ‌య‌ప‌డుతున్నారా? చెప్పినా ఆయ‌న…

జ‌గ‌న్ ప్ర‌త్యేక‌త ఏమంటే గ్రౌండ్ రియాల్టీ తెలుసుకోడు. క్షేత్ర‌స్థాయి వాస్త‌వాలు నిజంగా తెలియ‌వా? తెలియ‌న‌ట్టుగా ఎమ్మెల్యేల మీటింగ్‌లో మాట్లాడుతున్నాడో అర్థం కాదు. ఆయ‌న చుట్టు వున్న‌వాళ్లు వాస్త‌వాలు చెబుతున్నారా? చెప్ప‌డానికి భ‌య‌ప‌డుతున్నారా? చెప్పినా ఆయ‌న విన‌డో తెలియ‌దు.

కాగితాల మీద చూడ‌డానికి, మాట్లాడ్డానికి చాలా విష‌యాలు బాగుంటాయి. అమ‌ల్లోకి వ‌చ్చిన‌పుడే త‌త్వం అర్థ‌మ‌వుతుంది. ఎమ్మెల్యేల‌ను జ‌నంలో తిర‌గాల‌ని అంటున్నాడు. ఇది మంచి విష‌యం. తిరిగి, ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల్ని అర్థ‌మ‌య్యేలా చెప్పి, గ‌త ప్ర‌భుత్వానికి, ఈ ప్ర‌భుత్వానికి తేడా వివ‌రిస్తే జ‌నం మ‌న వైపున వుంటార‌ని అంటున్నాడు. ఇది కూడా క‌రెక్టే. అయితే ఎమ్మెల్యేలు వెళ్లి ప‌థ‌కాలు వివ‌రించేలోగా జ‌నం స‌మ‌స్య‌ల చిట్టా విప్పుతున్నారు. అవి తీర్చ‌డానికి ఎమ్మెల్యేల‌కు ప‌వ‌ర్స్ లేవు.

రాష్ట్రం మొత్తం మీద రోడ్లు గ‌బ్బు ప‌ట్టి వున్నాయి. దీనికి ఇపుడైతే వ‌ర్షాలు కార‌ణం. ఇంత‌కాలం గోతుల్లో ప‌డుతూ లేస్తూనే తిరుగుతున్నారు. క‌డ‌ప టౌన్‌లో ఒక ముఖ్య నేత ఇంటికి వెళ్లే రోడ్డే అధ్వానంగా ఉంది. ఆయ‌న ఎవ‌రితో చెప్పుకోవాలి?

రోడ్ల గురించి స‌హ‌జంగానే జ‌నం నిల‌దీస్తున్నారు. ఈనాడు, జ్యోతిలో ఎమ్మెల్యేల నిల‌దీత అని రాస్తారు. అదేం లేదు గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ ఘ‌న స్వాగ‌తం అని సాక్షిలో రాస్తారు. ఈ చ‌ర్చ చ‌దువు వ‌చ్చి, పేప‌ర్లు చ‌దివే వాళ్ల మ‌ధ్య‌. చ‌దువు రాని వాళ్ల‌కి క‌ళ్లు ఉన్నాయి క‌దా! గోతులు క‌న‌ప‌డుతున్నాయి క‌దా! వీటిని ప‌రిష్క‌రించ‌లేన‌ప్పుడు ఎమ్మెల్యేలు తిరిగి ఏం ప్ర‌యోజ‌నం? జ‌నంతో తిట్లు తిన‌డానికా?

నాడు-నేడు చాలా మంచి ప‌థ‌కం. నిజంగానే చాలా స్కూళ్ల రూపురేఖ‌లు మారిపోయాయి. జ‌గ‌న్ ప్ర‌భుత్వం చాలా గ‌ర్వంగా చెప్పుకోవాల్సిన ప్రాజెక్ట్ ఇది. స్కూళ్ల‌ని బ్ర‌హ్మాండంగా ఒక‌వైపు మారుస్తూ, మ‌రోవైపు స్కూళ్ల‌ని మూసివేస్తూ కొత్త‌గా ఈ విలీనం ఏంటి?  

ఏసీ గ‌దుల్లో నిర్ణ‌యాలు తీసుకుంటే అయిపోతుందా? చిన్న‌పిల్ల‌ల త‌ల్లిదండ్రుల బాధ‌లు అక్క‌ర్లేదా? ఆర్డ‌ర్లు పాస్ చేసే అధికారుల పిల్ల‌లు ఆటోలు, బ‌స్సులు, కార్ల‌లో స్కూల్‌కి వెళ్తారు కాబ‌ట్టి వాళ్ల‌కి బాధ‌లు తెలియ‌దు. పేద‌వాళ్లు తెల్లారి లేస్తే కూలికి వెళ్తారు. పిల్ల‌ల్ని స్కూళ్ల‌కి తీసుకెళ్తారా? ఎక్క‌డ పోయినా ఎమ్మెల్యేల‌కు ఇదే సెగ‌. చాలా మంది ఎమ్మెల్యేల‌కి ఈ విలీనాల‌పై అవ‌గాహ‌న లేదు. ఏం చెప్పాలో తెలియ‌దు. బొత్స స‌త్య‌నారాయ‌ణ‌లా అర్థం కాకుండా అంద‌రూ అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌లేరు క‌దా!

ఈ మ‌ధ్య 10 వేలు డ‌బ్బుల కోసం అధికారులు ఏర్పాటు చేసిన స‌మావేశానికి ఆటో డ్రైవ‌ర్లు వ‌చ్చారు. “ఈ 10 వేలు లేక‌పోతే పోయింది సామీ రోడ్లు బాగు చేస్తే చాలు, న‌డుములు విరిగిపోతున్నాయి” అని ఒక డ్రైవ‌ర్ అంటున్నాడు. ఇది రియాల్టీ.

అంద‌ర్నీ సంతృప్తిప‌ర‌చ‌డం ఏ ప్ర‌భుత్వానికీ సాధ్యం కాదు. అయితే ప‌ట్టువిడుపుతో వెళ్లాలి. ప‌థ‌కాల వ‌ల్ల అద్భుతాలు జ‌ర‌గ‌డం లేదు. అదో సాయం మాత్ర‌మే. బ‌ట‌న్ నొక్కితే డ‌బ్బులు ప‌డుతున్నాయి కానీ, స‌మ‌స్య‌లు తీరుతాయా?

ప‌థ‌కాల వ‌ల్ల వ‌చ్చిన డ‌బ్బుని జ‌నం రెండు రోజుల్లో ఖ‌ర్చు పెడుతున్నారు. డ‌బ్బులు ప‌డిన రోజు బంగారం, ఫ్రిజ్‌, వాషింగ్ మిష‌న్‌, బ‌ట్ట‌ల షాపుల వ్యాపారాన్ని ప‌రిశీలిస్తే ఇది అర్థ‌మ‌వుతుంది. ఇదేం త‌ప్పుకాదు. చేతులు ప‌డిపోయేలా బ‌ట్ట‌లు ఉతికే ఆడ‌వాళ్ల‌కి ఇది నిజంగా సౌక‌ర్యం, ఊర‌ట‌. అయితే సౌక‌ర్యాల వ‌ల్ల శ్ర‌మ త‌గ్గుతుంది కానీ, ఆక‌లి త‌గ్గ‌దు క‌దా! తెల్లారిలేస్తే పెట్రోల్ ధ‌ర‌లు, వంట‌నూనె అన్ని ధ‌ర‌లు వాళ్ల‌ని భ‌య‌పెట్టి, సంపాద‌న‌లో అధిక భాగం తిండికే ఖ‌ర్చు పెడుతున్నారు.

అయితే ప్ర‌భుత్వం ఆర్థిక సాయం చేయ‌గ‌ల‌దు కానీ, దేనికి ఖ‌ర్చు పెట్టాలో దిశానిర్దేశం చేయ‌లేదు. అందులోనూ ఇన్ని ల‌క్ష‌ల మందికి.

ఇపుడు వాస్త‌వ ప‌రిస్థితి ఏమంటే ప‌థ‌కాల‌ను అర్థం చేసుకోలేనంత అజ్ఞానంలో జ‌నం లేరు. వాళ్ల మ‌ధ్య తిరిగి చైత‌న్య‌వంతం చేసే స్థితిలో ఎమ్మెల్యేలు లేరు. ఇపుడు కావాల్సింది మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌. వాటికి నిధులు.

జ‌నంలో తిరుగుతున్న‌ప్పుడు స‌హ‌జంగానే వాళ్లు స‌మ‌స్య‌ల గురించి చెబుతారు. ఎమ్మెల్యే క‌నిపిస్తే ఛోటా నాయ‌కులైతే భ‌జ‌న చేస్తారు కానీ, సామాన్యుల‌కు ఏం అవ‌స‌రం? వాళ్లు ఎత్తిచూపిన స‌మ‌స్య‌ల్ని ఎంతోకొంత ప‌రిష్క‌రించే సానుకూల‌త‌, సౌల‌భ్యం ఎమ్మెల్యేల‌కి వుంటేనే జ‌నంలో తిర‌గ‌గ‌లుగుతారు. లేదంటే జ‌నం విసుక్కుంటారు, నిల‌దీస్తారు. ఈనాడు, జ్యోతిలో బాక్సులు క‌ట్టి వార్త‌లు వేస్తారు. అంతా తూచ్ అని సాక్షిలో వార్త‌లు రాస్తారు.

ముక్తాయింపు- చౌక‌దుకాణాల్లో కుదిరిన‌ప్పుడు స‌రుకులు తెచ్చుకునే జ‌నానికి ఇంటి ద‌గ్గ‌రే రేష‌న్ అని కోట్లు ఖ‌ర్చు పెట్టారు. దాని కోసం ప‌డిగాపులు కాస్తే ఒక‌రోజు కూలిపోతుంది. రేష‌న్ స‌రుకుల వ‌ల్ల వెయ్యి రూపాయ‌ల లాభం అనుకుంటే దాన్ని తెచ్చుకోడానికి 300 నుంచి 500 కూలి డ‌బ్బులు లాస్‌. హైకోర్టు మొటిక్కాయ‌లు వేయ‌మంటే వేయ‌దా?