అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి జగన్ వెంట నిలిచిన వారిలో ముఖ్యుడు కాపు రామచంద్రారెడ్డి. జగన్ వెంట ఆది నుంచి నిలిచిన ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. అనంతపురం జిల్లాలో సీనియర్ నేత అనంత వెంకట్రామిరెడ్డి, అనంతపురం, కర్నూలు జిల్లాలో జగన్ కు మొదటి నుంచి బాసటగా నిలిచిన వారిలో సోదరులు అయిన బాలనాగిరెడ్డి, వెంకట్రామిరెడ్డి, సాయి ప్రతాప్ రెడ్డి .. ముగ్గురు కోటాలో కనీసం ఒక్కరు మంత్రి కాలేకపోయారు!
వీరు మాత్రమే కాదు పరిటాల కంచుకోటను బద్దలు కొట్టిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, కొంత సీనియారిటీని పెట్టుకుని ప్రజల చుట్టూరానే తిరుగుతున్న కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ఇంకా కర్నూలు జిల్లాలో సీనియర్లు కాటసాని సోదరులు, మంత్రి కాగల అర్హతలున్న శిల్పా చక్రపాణి రెడ్డి వంటి వాళ్లు.. ఇలా ఈ జాబితాను తీస్తే పెద్దదే అవుతుంది.
రాయలసీమలోని యాభై రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పుడు దాదాపు తొంబై ఐదు శాతం సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే ఉన్నాయి. వీటిల్లో రిజర్వడ్ నియోజకవర్గాలు పోనూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచింది మెజారిటీ రెడ్డి నేతలే. వీరిలో ఎంతో రాజకీయ నేపథ్యం, రాజకీయ అనుభవం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విధేయత ఉన్న వారే మెజారిటీ మంది. అయితే వారిలో అవకాశాలు దక్కని వారి జాబితా అనంతంగా కనిపిస్తూ ఉంది.
కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రి పదవుల విషయంలో బీసీలకే అగ్రతాంబూలం ఇస్తున్నారు. కడప జిల్లా నుంచి ఒక మైనారిటీ, చిత్తూరు నుంచి మరో ఎస్సీకి అవకాశం తప్పదు.
సీనియారిటీతో పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి, క్లీన్ ట్రాక్ రికార్డులో బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డిలు మాత్రమే జగన్ కేబినెట్ లో అవకాశాన్ని కొనసాగింపు పొందుతున్నారు. మొదటి సారి జగన్ కేబినెట్ కూర్చినప్పుడే చాలా మంది రెడ్లు నిరాశవహులు అయ్యారు. రెండోసారి రోజాకు అవకాశం దక్కడమే తప్ప.. రెడ్లకు పెరిగిన ప్రాధాన్యత ఏమీ లేదు.
ఇప్పుడే కాదు.. రానున్న రోజుల్లో కూడా వైఎస్ జగన్ కేబినెట్లో రెడ్లకు ఎంత మేరకు చోటు దక్కుతుందనేది ప్రశ్నార్థకమే! వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో కూడా మెజారిటీ ఎమ్మెల్యే టికెట్లు రెడ్లకే దక్కుతాయి. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో సిట్టింగ్ రెడ్లలో టికెట్ పొందలేని వారు దాదాపు ఎవరూ ఉండకపోవచ్చు! వారిలో మళ్లీ కూడా చాలా మంది నెగ్గుకు రాగలరు. అలా నెగ్గినా వారికి మంత్రి పదవులు అయితే దక్కడం గగనంగానే కనిపిస్తూ ఉంది!
జగన్ ప్రస్తుతం తన కేబినెట్ లో పాతిక మందిని కొనసాగిస్తున్నారు. ఈ సంఖ్యను కాస్త పెంచుకునే అవకాశం అయితే ఉంది. అయినప్పటికీ అలాంటిదేమీ చేయలేదు. పాతిక బెర్తులనే సామాజికవర్గ సమీకరణాలకు అనుగుణంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు.ఇలాంటి నేపథ్యంలో నిరాశావహుల్లో రెడ్ల సంఖ్య గట్టిగా ఉంది.
గతంలో ఏం జరిగింది?
గత పర్యాయం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సీమ నుంచి రెడ్లకు దక్కిన ప్రాధాన్యత ఏమీ పెద్దగా లేదు. ఆది నుంచి చంద్రబాబును నమ్ముకుని ఉన్న పల్లెకు తొలి మూడేళ్లూ మంత్రి పదవి దక్కింది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెచ్చుకున్న భూమా అఖిలప్రియ, అమర్ నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డిలకు అవకాశం ఇచ్చారు.
అయితే అది కేవలం ఫిరాయింపులకు దక్కిన బహుమానం మాత్రమే! ఒకవేళ వారైనా మంత్రలుగా దక్కిన అవకాశంతో తమ పరపతిని పెంచుకున్నారా? అంటే.. సొంత నియోజకవర్గం జనాలే వారందరిని తిరస్కరించారు! రెడ్డి బెల్ట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నెగ్గిన ఆ ముగ్గురు ఫిరాయింపు మంత్రులు, తెలుగుదేశం పార్టీ తరఫున మాత్రం నెగ్గుకు రాలేకపోయారు!
వైఎస్ హయాంలో..?
వైఎస్ రాజశేఖర రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనంతపురం జిల్లా నుంచి జేసీ దివాకర్ రెడ్డికి అవకాశం దక్కింది. చిత్తూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అప్పుడు కూడా అవకాశం పొందారు. అయితే కాంగ్రెస్ కు నాడు బీసీ నేతలను మరీ పట్టించుకునే అవసరం ఉండేది కాదేమో!
బీసీలు సాలిడ్ గా తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచే పరిస్థితి. దీంతో సీమలో బీసీలకు కాంగ్రెస్ తరఫున కచ్చితంగా అవకాశం ఇవ్వాల్సిందే అని వాదించే వారు ఎవరూ ఉండేవారు. వైఎస్ కు ముందు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా బీసీలకే మంత్రి పదవులు దక్కేవి.
ఇక భవిష్యత్తులో?
రాయలసీమ మొత్తం మీద నుంచి జగన్ జిల్లాకు ఒకటి చొప్పున మహా అంటే నాలుగు మంత్రి పదవులు ఇవ్వగలడు భవిష్యత్తులో అయినా. అయితే పాతిక మందికిపైగా రెడ్డి ఎమ్మెల్యేలు భవిష్యత్తులో కూడా కొనసాగే అవకాశం ఉంది.
ఈ పాతిక, ముప్పై మందిలో ముగ్గురు నలుగురు అవకాశం పొందినా.. మిగతా వారు మాత్రం శాశ్వతంగా నిరాశావహుల జాబితాలో ఉండిపోవాల్సిందేనేమో!