పలనాడులో దారుణ హత్య. వీడియో చూడాలంటే భయమేసేలాంటి హత్య. అది పాత కక్షలు కావచ్చు.. ఒకే పార్టీ వారు కావచ్చు. లేదా ప్రత్యర్థి పార్టీల వారు కావచ్చు. మొత్తానికి మానవత్వానికే మచ్చలాంటి హత్య. దారుణాతి దారుణం. కానీ అది కాదు అసలు సిసలు దారుణం. మెయిన్ స్ట్రీమ్ మీడియా, సమాజాన్ని ఉద్దరించే మీడియా, ఆంధ్రను బాగు చేయడం కోసమే కంకణం కట్టుకున్న మీడియా, జగన్ ను ముమ్మాటికీ ద్వేషించేది ఈ ఆంధ్ర కోసం తప్ప, స్వలాభం కోసం కాదు అని చెప్పే మీడియాకు ఈ మర్డర్ వార్తే కనిపించినట్లు లేదు.
నిజంగా విలువలు వున్న మీడియా సంస్థలే అయితే, నిజంగా ఆంధ్ర కోసం పాటు పడే, తపన పడే మీడియా సంస్థలే అయితే వినుకొండ సంఘటనను సరైన విధంగా రిపోర్ట్ చేసి వుండాలి కదా. అలాంటి దారుణ సంఘటనను ఓ మీడియా కోణంలో అయినా రిపోర్ట్ చేయాల్సిన బాధ్యత వుంది కదా. ఏ మీడియా సంస్థ అయినా కనీసపు బాధ్యత కదా. ఆ కనీసపు బాధ్యతను కూడా నెరవేర్చకుండా మీడియా తన బాధ్యత ఎలా నిర్వర్తించినట్లు. పార్టీల వారీ ఎవరి భావజాలం వారికి వుండోచ్చు. కానీ ఓ దారుణ హత్యను రిపోర్ట్ చేయకుంటే ఎలా?
విశాఖలో ఎర్ర మట్టి దిబ్బలను పాడుచేస్తున్నారు. ఈ విషయాన్ని బయట బాహాటంగా చెప్పింది జనసేన నాయకుడు. కానీ ఇదే మీడియా సంస్థలు ఏమని ఎదురు దాడి చేస్తున్నాయి. తెలుగుదేశం పాలనలో వైకాపా జనాలు ఆ పని చేస్తున్నాయి అనా? ఇది మీడియా చేయాల్సిన నికార్సయిన పనేనా? జగన్ పాలనలో తప్పు జగన్ పార్టీ జనాలవే. తెలుగు దేశం పాలనలో తప్పు జగన్ పార్టీ జనాలవే. అంటే ఇక ఈ నికార్సయిన మెయిన్ స్ట్రీమ్ మీడియా తీరు ఇలాగే వుంటుందా ఎన్ని ఏళ్లు అయినా?
మరో ముచ్చట చూద్దాం. జగన్ పాలనలో చేపల అమ్మకాల కేంద్రాలు ప్రారంభించారు. నిరుద్యోగులకు ఉపాధి అంటూ. ఎవరైనా ఐటి సంస్థలు తెస్తారు. జగన్ చేపల కొట్లు పెట్టిస్తున్నారు అంటే ఇదే మెయిన్ స్ట్రీమ్ నికార్సు మీడియా ఎద్దేవా.
నిన్నటికి నిన్న కోడి గుడ్ల ఉత్పత్తి దారులు మంత్రి లోకేష్ కలిస్తే 2600 బల్లలు తయారు చేయించి ఇస్తాం. జిల్లాకో 100 మంది నిరుద్యోగులకు ఇవి, గుడ్ల తో కూడిన ఆహారం అమ్మకాలు సాగించి, ఉపాధి పొందమని చెప్పారు. ఇప్పుడు ఈ వార్తను ఎలా చూడాలి. గతంలో జగన్ పాలనలో చేపల అమ్మకాల మాదిరిగా వెటకారంగానా? లేదా ఇప్పుడు ఇదో అద్భుతంగానా?
ఇలా ఆంధ్ర కోసం కంకణం కట్టుకున్న మీడియా గత అయిదేళ్లలొ ఎలా ప్రవర్తించింది, ఇప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాయి అన్నది కళ్లకు కట్టినట్లు కనిపిస్తోనే వుంది. జగన్ ను ద్వేషించడం తప్పు కాదు. జగన్ ను దెయ్యంలా, భూతంలా, ఆంధ్రకు పట్టిన దరిద్రంలా, శనిలా ఎలా కావాలంటే అలా ప్రొజెక్ట్ చేసారు అయిదేళ్ల పాటు. అది మీ ఇష్టం.
కానీ ఇప్పుడు జరుగుతున్న తప్పులను కూడా ఎత్తి చూపడం మీడియాగా కనీసపు బాధ్యత. అది కూడా విస్మరిస్తే, తాము మెయిన్ స్ట్రీమ్ మీడియా అని చెప్పుకునే నైతిక హక్కు వుందో లేదో, సదరు మీడియా సంస్థలే ఆలోచించుకొవాలి.