తెలుగుదేశం, జ‌న‌సేన‌.. ఎవ‌రి డ్రీమ్ ప్రాజెక్టుల్లో వారు!

రియాలిటీలోకి వ‌స్తే.. కూట‌మిగా పోటీ చేయ‌క‌పోతే రెండు పార్టీలకూ స్వ‌ప్న‌భంగం కలుగుతుంద‌నే ఆందోళ‌న కూడా లేక‌పోలేదు!

తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మిగా ఎన్నిక‌ల‌కు వెళ్తామ‌ని 2024 ఎన్నిక‌ల‌కు కొంత‌కాలం కింద‌ట ప్ర‌క‌టించిన‌ప్పుడు.. స్వ‌ల్ప కాలికంగా ఆ పొత్తు తెలుగుదేశం పార్టీకి లాభించినా, దీర్ఘ‌కాలంలో జ‌న‌సేనతో తెలుగుదేశం పార్టీకి ప్ర‌మాద‌క‌ర‌మే అని తెలుగుదేశం పార్టీ సానుకూలురు కూడా వ్యాక్యానించారు. జ‌న‌సేన అనే పార్టీ ఎన్నిక‌ల ర‌ణ‌రంగంలో ఒంట‌రిగా పోటీ చేస్తూ ఉన్న‌ట్టుగా అయితే, దాని పాత్ర చాలా చిన్న‌ది. అందులో అప్పుడు, ఎప్పుడూ ఎలాంటి సందేహం లేదు.

అయితే ఆ పార్టీకి పొత్తు ద్వారా సీట్ల‌ను కేటాయించి తెలుగుదేశం అసెంబ్లీలో ఉనికిని ఇస్తే అది ఏనాటికైనా తెలుగుదేశం పార్టీకే ప్ర‌మాదం అవుతుంద‌ని, టీడీపీ త‌న పాత్ర‌ను త‌గ్గించుకున్న‌ట్టుగా అవుతుంద‌నేది నాడు ఆ తెలుగుదేశం అనుకూలురు వేసిన అంచ‌నా. ఆ అంచ‌నాల‌కు అనుగుణంగానే ఇప్పుడు ఏపీ రాజ‌కీయంలో తెలుగుదేశం పార్టీ పాత్ర త‌గ్గింది!

చంద్ర‌బాబునాయుడు సీఎం హోదాలో ఉన్నా, ఆయ‌న త‌న‌యుడు మంత్రి హోదాలో ఉన్నా.. దాని ప్ర‌ధాన వైరిప‌క్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవ‌లం 11 సీట్ల‌కు ప‌రిమితం అయినా, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారం చ‌లాయించ‌డంలో అంతా తానే అనే ప‌రిస్థితి లేదు! అలాగే జ‌న‌సేన ఎమ్మెల్యేల బ‌లంపై తెలుగుదేశం ప్ర‌భుత్వం మ‌నుగ‌డ ఆధార‌ప‌డి లేకపోయినా, కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు తెలుగుదేశం పార్టీ ఎంపీల బ‌లంపైనే ఆధార‌ప‌డి ఉన్నా, చంద్ర‌బాబు తుమ్మితే కేంద్రంలో స‌ర్కారు ప‌డిపోయే ప‌రిస్థితి ఉన్నా.. ఏపీలోనే తెలుగుదేశం పార్టీ అంతా తానై న‌డిపే ప‌రిస్థితి లేదు!

అంటే ప్ర‌త్య‌ర్థుల‌ను వేధించ‌డానికి, కేసుల‌ను పెట్టించ‌డానికి చంద్ర‌బాబు రాజ‌కీయ శ‌క్తి ఇప్పుడు స‌రిపోతోందో ఏమో కానీ.. మునుప‌టిలా ఏక‌ఛ‌త్రాధిప‌త్యం మాత్రం ఇప్పుడు లేన‌ట్టే. ప్ర‌తిదానికీ ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ అడ్డుపుల్ల అవుతున్నార‌ని తెలుగుదేశం పార్టీ వీరాభిమానులే వాపోతున్న ప‌రిస్థితి. కూట‌మి ప్ర‌భుత్వం పాల‌న‌లో వ‌చ్చే వ్య‌తిరేక‌త‌ను దేన్నీ ప‌వ‌న్ త‌న ఖాతాలో ప‌డకుండా జాగ్ర‌త్త వ‌హిస్తున్నార‌ని స్ప‌ష్టం అవుతోంది. కూట‌మి పాల‌న అంటే జ‌రిగిన‌దానికి, జ‌రుగుతున్న దానికి, ఐదేళ్ల‌లో జ‌ర‌గ‌బోయే దానికి మూడు పార్టీల‌దీ బాధ్య‌త అవుతుంది. మంచి చెడులకు కూట‌మిలోని పార్టీలు స‌మాన బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంది.

అయితే కూట‌ముల‌ను న‌డిపించ‌డం, తేడా కొడుతోంద‌నే స‌మ‌యంలో ప్యారాచూట్లు ధ‌రించి ఆ కూట‌ముల నుంచి త‌న అవ‌స‌రార్థం బ‌య‌ట ప‌డ‌టం చంద్ర‌బాబు గ‌తంలో అనుస‌రించిన రాజ‌కీయ వ్యూహాలే. త‌న అవ‌స‌రార్థం ఆయ‌న అనేక కూట‌ముల్లో భాగ‌స్వామి, అనేక కూట‌ముల్లోంచి అర్ధాంత‌రంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది కూడా ఆయ‌నే! విశేషం ఏమిటంటే.. చంద్ర‌బాబును చూసే రాజ‌కీయాన్ని నేర్చుకున్నాడో ఏమో కానీ, ప‌వ‌న్ క‌ల్యాణ్ మరో చంద్ర‌బాబు అని చెప్ప‌క‌తప్ప‌దు!

చంద్ర‌బాబు నాయుడు త‌న న‌ల‌భై యేళ్ల రాజ‌కీయంలో ఎన్ని కూట‌ముల‌ను మార్చి ఉంటారో, నాలుగు సార్ల ఎన్నిక‌ల‌కే ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్ని కూట‌ముల‌ను మార్చిన ఘ‌న‌త‌ను వ‌హించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల‌తో మొద‌లుపెట్టి చంద్ర‌బాబు నాయుడు అవ‌స‌రార్థం బీజేపీతోనూ, ఆ త‌ర్వాత క‌మ్యూనిస్టుల‌తోనూ, మ‌ళ్లీ బీజేపీతో, ఆ పై కాంగ్రెస్ తో, ఆత‌ర్వాత మ‌ళ్లీ బీజేపీతో పొత్తుల ఎత్తులు గ‌ట్టారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌క్కువేమీ కాదు. ప్ర‌జారాజ్యం, బీజేపీ, క‌మ్యూనిస్టులు, మ‌ళ్లీ తెలుగుదేశం-బీజేపీ ఇలా ఆయ‌న ట్రాక్ రికార్డులో కూడా చాలా మార్పులున్నాయి. త‌న అవ‌స‌రం మేర‌కు చేగువేరా, భ‌గ‌త్ సింగ్ ల పేర్ల‌ను చెప్పినా, మ‌తం అనేది విష‌మ‌ని వారు చెప్పిన దానికి భిన్నంగా త‌నో స‌నాత‌న హిందువునంటూ హిందూ ప్ర‌యోజ‌నాలు అంటూ మాట్లాడినా అది ప‌వ‌న్ కే చెల్లుతోంది!

ఏతావాతా.. రాజ‌కీయ వ్యూహాల‌ను , వాదాల‌ను మార్చేసుకోవ‌డంలో చంద్ర‌బాబు ఎంత‌టి పండితుడో, ఆ పండితుడికి త‌గ్గ శిష్యుడు ప‌వ‌న్ కల్యాణ్. గ‌తంలో బీజేపీతో స‌హ‌వాసం చేసిన‌న్ని రోజులూ చేసి, ఆపై ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆ పార్టీని తిడుతూ కూటమి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు చంద్ర‌బాబు. రేప‌టి ఎన్నిక‌ల నాటికి చంద్ర‌బాబు మ‌రోసారి అలాంటి వ్యూహాల‌నే అవ‌లంభించినా, ఐదేళ్ల ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌కు ఎవ‌రో ఒక‌రిని బూచిగా చూపించినా పెద్ద ఆశ్చ‌ర్యం లేదు! అదే పనిని ప‌వ‌న్ చేప‌ట్టినా ఆశ్చ‌ర్యం లేదు!

ఈ ప‌ర్యాయంలోనే లోకేష్ ను డిప్యూటీ సీఎంగానే కాదు, సీఎంగా చూసుకోవాల‌ని కూడా స‌గ‌టు తెలుగుదేశం కార్య‌క‌ర్త ఆశిస్తున్నాడు. చంద్ర‌బాబు అర్జెంటుగా సీఎం సీటు దిగిపోయి ప‌వ‌న్ ను అందులో కూర్చోబెట్టాల‌ని, ఈ పర్యాయంలో ప‌వ‌న్ సీఎం అయితే, వచ్చే ఎన్నిక‌ల నాటికి ప‌వ‌న్ పీఎం అవుతాడ‌ని స‌గ‌టు ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమాని ఆశిస్తున్నాడు. ఇలా ఎవ‌రి డ్రీమ్ ప్రాజెక్టుల్లో వారున్నారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో కామెంట్ల‌తో త‌మ ఆకాంక్ష‌ల‌ను వ్య‌క్తం చేస్తూ ఉన్నారు. అయితే రియాలిటీలోకి వ‌స్తే.. కూట‌మిగా పోటీ చేయ‌క‌పోతే రెండు పార్టీలకూ స్వ‌ప్న‌భంగం కలుగుతుంద‌నే ఆందోళ‌న కూడా లేక‌పోలేదు!

5 Replies to “తెలుగుదేశం, జ‌న‌సేన‌.. ఎవ‌రి డ్రీమ్ ప్రాజెక్టుల్లో వారు!”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  2. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  3. పని లేని సంత ఇదంతా . రాష్ట్రం ఆర్థికంగా అట్టడుగున ఉంది ముందు దాని సంగతి ఏంటి

  4. రాష్ట్ర పరిస్థితి బాగోలేదు ఒక పక్క దాని సంగతి చూడండి. సిఎం. పి ఎం. తరువాత అవిధురు

Comments are closed.