వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంచలన ప్రకటన చేశారు. తన నియోజకవర్గంలోని సిమెంట్ పరిశ్రమల్లో ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకు వెళ్లకుండా అడ్డుకున్నానని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన తేల్చి చెప్పారు. ఒకవేళ పరిశ్రమల యజమానులే తప్పు చేశాయని నిరూపణ అయితే, ఏం చేస్తారో చెప్పాలని ఉన్నతాధికారుల్ని ఆయన డిమాండ్ చేయడం గమనార్హం.
తనపై వచ్చిన ఆరోపణలపై ఆయన ఇవాళ వివరణ ఇచ్చారు. ప్రజల కోసం పనిచేసే తనను అరాచకవాదిగా చిత్రీకరించడం మనస్తాపం కలిగించిందన్నారు. పరిశ్రమల యజమానులతో లాలూచి పడి తమ యాజమాన్యాలకు తెలియకుండా పరిశ్రమలపై జులుం ప్రదర్శించానని కొందరు రాస్తే, మరికొందరు తమ అధిష్టానాల ఆదేశాల మేరకు రాశారని ఆదినారాయణరెడ్డి ఆరోపించడం గమనార్హం. ఈ విషయమై సంబంధిత పత్రికా యాజమాన్యాలకు కూడా ఫిర్యాదు చేస్తానన్నారు.
పరిశ్రమల యాజమాన్యాలు వాతావరణ కాలుష్యాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. అలాగే విద్య, వైద్యంపై దృష్టి సారించలేదని తూర్పారపట్టారు. ఉద్యోగులకు కనీస వేతనం పెంచలేదని ఆయన ఆరోపించారు. ఈ విషయాలపై తమ పార్టీ అధిష్టానానికి నివేదిక సమర్పించినట్టు ఆయన వివరించారు. రాజకీయాలంటే అందరికీ ఉపయోగపడాలన్నారు.
పరిశ్రమల యజమానులు ఇష్టానుసారం వైసీపీ వాళ్లకు లొంగిపోయాయని ఆరోపించారు. సిమెంట్ పరిశ్రమలు దుష్టపన్నాగంతో వ్యవహరిస్తుంటే ఖండించడమే నేరమా? అని ఆయన ప్రశ్నించారు. జిల్లా అధికారులు మొదలుకుని సీఎంవో వరకూ అధికారులు తనపై వచ్చిన ఆరోపణలపై విచారించాలని డిమాండ్ చేశారు. తనది తప్పైతే రాజకీయాల నుంచి విరమించుకుంటానని స్పష్టం చేశారు. తనపైన, తన వాళ్లపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.
కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, మాజీ మంత్రి మైసూరారెడ్డి తమ్ముడు రమణారెడ్డి చెప్పిన వాళ్లకే ఆ పరిశ్రమల్లో పనులు జరుగుతున్నాయన్నారు. తమ వాళ్లకు పనులు చేయాలని అడగడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. కార్యకర్తల్ని కాపాడుకోవడం తప్పా? అని నిలదీశారు. ఎక్కడి నుంచో వచ్చి కథ నడుపుతున్నారని మండిపడ్డారు. బ్రిటీష్ వాళ్లను పారదోలినట్టు తరుముతామని ఆయన హెచ్చరించారు, తాను తప్పు చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఆ సిమెంట్ పరిశ్రమల లోపాయికారి విధానాలను అడ్డుకుంటామని ఆయన తేల్చి చెప్పారు.