ఈ మధ్యనే తెలుగుదేశం పార్టీ అతి సన్నిహిత దర్శకుడు, గోదావరి పుష్కరాలను డైరెక్ట్ చేయబోయిన దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ తీసిన స్కందా సినిమాలో బూమ్ బూమ్ బీర్లతో కిక్కు భలే ఎక్కుతుందని చెప్పారు! విచిత్రం ఏమిటంటే.. ఆ బూమ్ బూమ్ బీర్లతో సహాలో.. పలు మద్యం కంపెనీలకు చంద్రబాబు సర్కారు అనుమతి ఇచ్చిన వైనంపై కేసు నమోదైంది. ఈ మేరకు ఏపీబీసీఎల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది.
డిస్ట్రిలరీలకు అనుమతులు ఇవ్వడంతో అక్రమాలు చోటు చేసుకున్నాయనేది ఈ కేసు సారాంశం. ఈ కేసులో చంద్రబాబు పేరును ఏ-3 గా నమోదు చేసింది ఏపీ సీఐడీ. ఏపీలో మద్యం బ్రాండ్ల గురించి తెలుగుదేశం పార్టీ గత మూడేళ్లలో చాలా సార్లు గగ్గోలు పెట్టింది. అయితే అవన్నీ చంద్రబాబు హయాంలో అనుమతులు పొందిన మద్యం కంపెనీలే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెబుతోంది. ఆ కంపెనీలను ప్రస్తుతం తెలుగుదేశం నేతలు అమ్ముకున్నారేమో కానీ, వాటిని స్థాపించింది తెలుగుదేశం నేతలు, వారి సన్నిహితులే అని వైసీపీ అంటోంది.
అంతే కాదు.. ఆ అనుమతులను ఇవ్వడంలో అక్రమాలు కూడా చోటు చేసుకున్నాయనే వాదనను వినిపిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన అక్రమ అనుమతుల వల్ల ప్రభుత్వానికి దక్కాల్సిన పన్నుకు కూడా కన్నం పడిందని, ఇష్టానుసారం అనుమతులు ఇచ్చి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారనేది ఆరోపణ. ఈ నేపథ్యంలో ఏపీసీఐడీ కేసును నమోదు చేసి కోర్టుకు నివేదించింది.
ఇప్పటికే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రివెన్షాఫ్ కరప్షన్ యాక్ట్ కింద చంద్రబాబుపై మరో కేసు నమోదైంది. మరి ఈ కేసులో కూడా చంద్రబాబు పై సీఐడీ పీటీ వారెంట్ ను వేసే అవకాశాలు ఉండవచ్చు!