చీటికి మాటికి అయ్యన్న రాజీనామా ప్రకటనలు

ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన స్పీకర్ సీనియర్ టీడీపీ నేత అయిన చింతకాయల అయ్యన్నపాత్రుడు మాటకు వస్తే చాలు రాజీనామా అంటున్నారు. ఆయన జూన్ లో స్పీకర్ అయ్యారు. రెండున్నర నెలలు మాత్రమే ఆ…

ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన స్పీకర్ సీనియర్ టీడీపీ నేత అయిన చింతకాయల అయ్యన్నపాత్రుడు మాటకు వస్తే చాలు రాజీనామా అంటున్నారు. ఆయన జూన్ లో స్పీకర్ అయ్యారు. రెండున్నర నెలలు మాత్రమే ఆ రాజ్యాంగ బద్ధ పదవిలో ఆయన ఉన్నది.

అయితే ఎందుకో తెలియదు కానీ ఆయన నాలుక చివర రాజీనామా అన్న మాట వినిపిస్తోంది. వన మహోత్సవం వేళ కూడా అయ్యన్న ఇదే మాట అన్నారు. ఆయన అటవీ శాఖ అధికారుల మీద మండిపడుతూ ఈ హాట్ కామెంట్స్ చేశారు.

గత అయిదు నెలలలో అటవీ శాఖ ఆధ్వర్యంలో అరవై లక్షల మొక్కలు నాటామని అటవీ శాఖ అధికారులు చెప్పడం మీద అయ్యన్న మండిపడ్డారు. ఆ వివరాలు చెప్పాలని అవి సరైనవి అయితే తన పదవికి రాజీనామా చేస్తాను అని అయ్యన్న అక్కడికక్కడే రాజీనామా సవాల్ చేశారు. దాంతో విస్తుపోవడం అధికారుల వంతు అయింది. తాను అటవీ శాఖ మంత్రిగా ఉన్నపుడు పెద్ద ఎత్తున మొక్కలు నాటించాను అని అయ్యన్న చెప్పారు.

ఇదిలా ఉండగా అయ్యన్న ఇటీవల నర్శీపట్నంలో ఆర్టీసీ స్థలం ప్రైవేట్ వారికి లీజుకు ఇస్తున్నారు అన్న వార్తల మీద కూడా ఫైర్ అయ్యారు. ఇదే విధంగా కొనసాగిస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తాను అని అపుడు కూడా హెచ్చరించారు. దీనిని చూసిన వారు అంతా అయ్యన్న ఎందుకు ఇలా పదే పదే తన పదవికి రాజీనామా అంటున్నారు అన్న చర్చకు తెర తీస్తున్నారు.

అయ్యన్న మాట్లాడే మనిషి. ఫక్తు రాజకీయ నేత. ఆయనను స్పీకర్ పదవిలో కూర్చోబెడితే రాజ్యాంగబద్ధమైన పదవి కావడం వల్ల ఆయన ఇబ్బంది పడుతున్నారా అన్న చర్చ వస్తోంది.

అయ్యన్న మనసులో ఏముందో తెలియదు కానీ రాజీనామా అని ఆయన అంటూంటే మాత్రం అంతా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. స్పీకర్ అన్నది ఉన్నతమైన పదవి. అయితే ఆ పదవిలో ఉన్న వారు రాజకీయాలు చేయకూడదు, మాట్లాడకూదదు అన్న నియమం ఉంది.

ఇటీవల కాలంలో చాలా మంది ఆ కట్టు తప్పారు. అయ్యన్న మాత్రం స్పీకర్ అయిన దగ్గర నుంచి హుందాగానే ఉంటున్నారు. మరి ఆయనలోని రాజకీయ నాయకుడు మాత్రం సంతృప్తి చెందినట్లుగా లేదు అని అంటున్నారు.

4 Replies to “చీటికి మాటికి అయ్యన్న రాజీనామా ప్రకటనలు”

Comments are closed.