బాబు మాటలకు ఫీల్డ్ లెవెల్ కు సంబంధం లేదే!

దీపం పథకాన్ని ప్రారంభించిన సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనేక విషయాలను ప్రస్తావించారు. ఎన్నికలు జరగడానికి ఏడాదికంటె ముందే ప్రకటించిన హామీలను కార్యరూపంలోకి తేవడానికి ఆయనకు అయిదు నెలల సమయం పట్టింది. అదికూడా ఆరింటిలో ఒక్క…

దీపం పథకాన్ని ప్రారంభించిన సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనేక విషయాలను ప్రస్తావించారు. ఎన్నికలు జరగడానికి ఏడాదికంటె ముందే ప్రకటించిన హామీలను కార్యరూపంలోకి తేవడానికి ఆయనకు అయిదు నెలల సమయం పట్టింది. అదికూడా ఆరింటిలో ఒక్క హామీ అమల్లోకి వచ్చింది. అది ప్రభుత్వం యొక్క అతి గొప్ప విజయం అన్నట్టుగా బూస్ట్ చేసుకుంటూ చంద్రబాబునాయుడు చాటుకున్నారు. ఈ సందర్భంగా ఇతరత్రా అనేక విషయాలను ప్రస్తావించారు. కానీ, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకు- ఆయన చెబుతున్న మాటలకు ఏమాత్రం పొంతన కుదరడం లేదని ప్రజలు వాపోతున్నారు.

ప్రధానంగా పెన్షనర్ల సంగతే తీసుకుందాం. వితంతు మహిళలు, వృద్ధులకు అందించే పెన్షనును ఒకేసారి నాలుగువేలకు పెంచి ఇస్తానని అన్నారు చంద్రబాబు. అన్నట్టుగానే ఏప్రిల్ నుంచి పెంచి, అధికారంలోకి రాగానే వారికి అరియర్స్ సహా చెల్లించారు. ఆ రకంగా మాట నిలబెట్టుకున్నారు. కానీ పెన్షనర్లకు ఇచ్చిన వరంలోనే మరొక చిన్న పాయింట్ ఉంది.

వృద్ధులైన పెన్షనర్లు తమ వయోరీత్యా ఇతర ప్రాంతాల్లోని పిల్లల వద్ద కూడా ఉంటుండడం కద్దు. వారు ఒక్క నెల పెన్షను తీసుకోకపోయినా వారి పెన్షను కట్ అయిపోయేలా గతంలో విధానం ఉండేది. అలా కాకుండా.. మూడు నెలలకు ఒకసారి వచ్చినా సరే.. మొత్తం మూడు నెలల పెన్షను తీసుకోవచ్చునని చంద్రబాబు హామీ ఇచ్చారు. లక్షలాది మందికి ఇది సౌకర్యవంతమైన ఏర్పాటు. ప్రతినెలా ఆధార్ కార్డున్న గ్రామాలకు పరుగులుతీసేపని వృద్ధులకు తప్పుతుంది.

బాబు మాటలను నమ్మి అందరూ ఓట్లు వేశారు. ఇప్పుడు ఆయన ఆ విషయాన్ని మళ్లీ ప్రస్తావిస్తున్నారు. మూడు నెలలకు ఓసారి మొత్తం 3నెలల అమౌంట్ తీసుకోవచ్చునంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో అలా అమలు కావడం లేదు. ఇతర ప్రాంతాల్లో ఉండేవారు ఒకటోతేదీ నాటికి రాకుంటే పెన్షను పోతుందని సిబ్బంది బెదిరిస్తున్నారు.

ఇసుక అనేది ఇంకో పెద్ద ప్రహసనంలాగా తయారైంది. చంద్రబాబునాయుడు ఎంత సునాయాసంగా చెబుతున్నారంటే.. మీకు కావలిస్తే మీరు ఎంచక్కా ఓ ట్రాక్టరు తోలుకుంటూ నది వద్దకు వెళ్లి.. అక్కడ వీరే స్వయంగా తవ్వి ఇసుకను ట్రాక్టరులో పోసుకుని ఎవ్వరికీ రూపాయి ఇవ్వకుండా వెళ్లిపోవచ్చు.. అంటున్నారు. కానీ వాస్తవం అది కాదు.

ఇసుక తవ్వుకునే చోట్ల మాఫియా ముఠాలు ఏర్పడ్డాయి. స్థానిక ఎమ్మెల్యేలు ట్రాక్టరుకు రూ. వెయ్యి వంతున వసూలు చేస్తున్నారు. తవ్వకమూ, ఇసుక ట్రాక్టరుకు నింపడమూ తదితర ఖర్చుల పేరిట మరో వెయ్యి వడ్డిస్తున్నారు. ఇతర చిల్లర ఖర్చులు, దోపిడీలు కలుపుకుంటే.. ఇప్పుడు కూడా ట్రాక్టరు ఇసుక సుమారు నాలుగువేల రూపాయలకే వస్తోంది. గతంలో వైసీపీ పాలనలో కూడా అదే ధరకు వచ్చేది. కాపోతే అప్పట్లో కొంత డబ్బు ప్రభుత్వ ఖజానాకు చేరేది. ఇప్పుడు మొత్తం డబ్బు దళారీలు, ఎమ్మెల్యేల స్వాహాలకే సరిపోతోంది.

చంద్రబాబునాయుడు తోలుతీస్తా అని హూంకరిస్తున్నారు గానీ.. క్షేత్రస్థాయిలో ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆయన హూంకరింపులు పేపర్లలో మాత్రమే వస్తున్నాయి. ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి.

4 Replies to “బాబు మాటలకు ఫీల్డ్ లెవెల్ కు సంబంధం లేదే!”

  1. పాపం కడప లొ ఇప్పటి వరకూ మొహం కూడా చూడని భందువుల ఇంటికి కూడా జగన్ వీళ్ళి విజయమ్మా, షర్మిల కి వ్యతిరెకంగా చిల్లర రాజకీయలు మొదలు పెట్టాడు. మేము ఇప్పుడు నీకు గుర్తుకు వచ్చామా ఉంటున్న బందువులు???

Comments are closed.