లోకేష్ రూ.పదికోట్ల సవాలు ఓకే! కానీ..

ఎవరు ఏ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేశారో.. ఆ డేటా, సైబర్ నేరాలకు పాల్పడే వారికి తెలియాల్సిన అవసరం లేదు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, జగన్ మోహన్ రెడ్డితో కలిపి నారా లోకేష్ ఒక చాలా పెద్ద సవాలు విసిరారు. రూ. పదికోట్ల రూపాయల ఆఫర్ అంటే అది చిన్నవిషయమేం కాదు. పైగా ప్రభుత్వం నిధులు కాదు.. తానే తన వ్యక్తిగత ఖాతానుంచి పది కోట్ల రూపాయలు చెక్ ఇస్తానని నారా లోకేష్ సవాలు విసురుతున్నారు.

ఇంతకూ ఆయనకు అంతపెద్ద సవాలు విసిరేంత ఆవేశం ఎందుకొచ్చింది.. అనే సందేహం కలుగుతోంది కదా? లోకేష్ సారథ్యంలో ఏపీ ప్రభుత్వం వాట్సప్ గవర్నెన్స్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనివలన ప్రజల వివరాలను చౌర్యం చేయడం జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. దీనికి లోకేష్ ఇలా రిటార్టు ఇచ్చారు.

ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడిన సందర్భంలో.. ‘వైసీపీ నాయకులకు ఓపెన్ చాలెంజ్ చేస్తున్నా.. వాట్సప్ గవర్నెన్స్ కారణంగా ఎక్కడైనా డేటా చోరీ జరిగిందని నిరూపిస్తే రూ.10కోట్లు కానుకగా ఇస్తా’ అంటున్నారు. లోకేష్ సవాలు బాగానే ఉంది. దీనివలన డేటా చౌర్యం జరిగే అవకాశం లేదని ఆయన ఘనంగా చాటిచెప్పారు.

ఇదంతా బాగానే ఉంది. వాట్సప్ గవర్నెన్స్ స్మార్ట్ ఫోను ఉన్న సామాన్యులకు అందించే సేవలు కూడా బాగానే ఉన్నాయని అనుకోవచ్చు. అయితే.. మారుమూల గ్రామాల ప్రజలు కూడా స్మార్ట్ ఫోను ద్వారా వాట్సప్ గవర్నెన్స్ ను వినియోగించే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఆ ముసుగులో సైబర్ నేరాలకు పాల్పడే వారు చేయగల మోసాల మాటేమిటి? వాట్సప్ గవర్నెన్స్ పుణ్యమాని.. స్మార్ట్ ఫోను వినియోగం అంతంతగా తెలిసినా, సైబర్ క్రైంల గురించిన అవగాహన లేని సామాన్యులు మునిగిపోతే.. వారికి ఎలాంటి భరోసా కల్పిస్తారు? అనేవి కీలకమైన ప్రశ్నలు.

ఒక ఉదాహరణ పరిశీలిద్దాం.. ఒక వ్యక్తి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం, లేదా కులధ్రువీకరణ సర్టిఫికెట్ కోసం వాట్సప్ గవర్నెన్న్ ద్వారా దరఖాస్తు చేశాడని అనుకుందాం. మళ్లీ అదే నెంబరుద్వారా తన విజ్ఞప్తి ఏ దశలో ఉన్నదో చెక్ చేసుకోవడానికి వీలవుతుంది. అంతవరకు బాగానే ఉంది. కానీ.. నాలుగురోజుల తర్వాత.. ఏదో ఒక నెంబరు నుంచి.. ‘‘మీరు వాట్సప్ గవర్నెన్స్ ద్వారా దరఖాస్తు చేసిన సర్టిఫికెట్ మంజూరు అయింది. డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఈ కింది లింకును నొక్కండి’’ అని వాట్సప్ లో మెసేజీ వస్తుంది. మనం దరఖాస్తు చేసిన మాట నిజమే కదా అనే ఉద్దేశంతో ఆ వ్యక్తి లింక్ నొక్కగానే.. అతని బ్యాంకు అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోతుంది. ఇలాంటి నేరాలు జరిగే అవకాశం లేదు.. అని నారా లోకేష్ ప్రజలకు భరోసా ఇవ్వగలిగితే బాగుంటుంది.

ఎవరు ఏ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేశారో.. ఆ డేటా, సైబర్ నేరాలకు పాల్పడే వారికి తెలియాల్సిన అవసరం లేదు. ర్యాండమ్ గా ఓ లక్ష నెంబర్లకు అలాంటి మెసేజీ పంపుతారు. ఆ లక్ష మందిలో ఒకరో ఇద్దరో.. వాట్సప్ గవర్నెన్స్ ద్వారా దరఖాస్తు చేసుకుని ఉంటే.. ఆ బుట్టలో పడే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి ప్రమాదాలు కూడా జరగకుండా సాంకేతిక ఏర్పాట్లు గురించి నారా లోకేష్ పట్టించుకోవాలి. ప్రత్యర్థుల ఆరోపణలకు అతిగా స్పందించాల్సిన అవసరం లేదు.. ఇంత అతిశయమైన సవాళ్లు విసిరే పని కూడా లేదు. కానీ ప్రజల ఆర్థిక భద్రత, కొత్తరకం వంచనలకు గురికాకుండా చూడడం తన బాధ్యతే అని తెలుసుకోవాలి.

12 Replies to “లోకేష్ రూ.పదికోట్ల సవాలు ఓకే! కానీ..”

  1. సాంకేతిక పరిజ్ఞానం వాడకం, చౌర్యం విషయం లో వీళ్ళని అడ్డుకునే వాళ్ళు, పట్టుకునే వాళ్ళు లేరు..

    1. అవును పాపం .. .. కస్టపడి కాయకష్టం చేసి పెట్టేసారు సిమెంట్ ఫ్యాక్టరీలు ..మీడియా చానెల్స్ ..

      1. అవును, మీరు కష్టపడి పాలు, పెరుగు, etc అమ్మి హెరిటేజ్ పెట్టినట్టుగానే…..

Comments are closed.