అమరావతే ఏకైక రాజధానిగా వుండాలని కోరుతూ ఆ ప్రాంతానికి చెందిన కొంత మంది ఈ నెల 12న పాదయాత్ర తలపెట్టారు. ఇందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. రాజధాని పోరాటం ప్రారంభించి ఈ నెల 12 నాటికి వెయ్యి రోజులు పూర్తి కానున్నాయి. ఈ సందర్భంగా అమరావతి నుంచి అరసవల్లి వరకూ పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు.
ఈ పాదయాత్రపై రాజధాని ప్రాంత వాసుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. చాలా మంది ప్రభుత్వాన్ని రెచ్చగొట్టేలా చేయడం ఎందుకనే అభిప్రాయంలో ఉన్నారు. కానీ రాజధాని అనుకూల రాజకీయ పార్టీలు వెన్నుదన్నుగా పాదయాత్ర చేపట్టాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో పాదయాత్రకు అనుమతి కోరుతూ అమరావతి రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు ప్రభుత్వం ససేమిరా అంది.
దీంతో పాదయాత్రకు రోజులు దగ్గర పడుతున్నాయని, అనుమతి ఇప్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇందుకు కొంత సమయం కావాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోరారు. దీంతో రెండు రోజులు గడువు ఇచ్చిన హైకోర్టు విచారణను వాయిదా వేసింది.
పాదయాత్రకు అనుమతి ఇస్తే తలెత్తే ఇబ్బందులను హైకోర్టు దృష్టికి ప్రభుత్వం తీసుకెళ్లే అవకాశం ఉంది. గతంలో ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరుతో తిరుపతికి పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇది రెండో పాదయాత్ర. అమరావతి రైతుల విజ్ఞప్తికి కోర్టు ఎలా స్పందిస్తుందోననే ఉత్కంఠ నెలకుంది.