లోకేష్‌ టీమ్‌కు డిమాండు

లోకేష్‌ టీమ్‌లో ఉంటే తమ వారసుల రాజకీయం సెట్‌ అయినట్లే అని సీనియర్లు భావిస్తున్నారు.

ఉత్తరాంధ్రలోని తెలుగుదేశం పార్టీలో సీనియర్‌ నేతల శకం దాదాపుగా ముగిసింది అని అంటున్నారు. శ్రీకాకుళం నుంచి మొదలుపెడితే విశాఖ జిల్లా వరకూ చాలా మంది సీనియర్‌ నేతలు ఉన్నారు. వారంతా పార్టీకి నాలుగు దశాబ్దాలుగా సేవలు అందిస్తూ వచ్చారు. తెలుగుదేశం పుట్టుక నుంచి వారు ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే చాలామంది సీనియర్లకు రాజకీయ జన్మ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. పాతికేళ్ల ప్రాయంలో తెలుగుదేశం పార్టీ వేదికగా రాజకీయ అరంగేట్రం చేసిన వారు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా, ఎంపీలుగా ఎన్నో కీలకమైన పదవులు అందుకున్నారు. రాజకీయాల పట్ల ఆసక్తితో వచ్చిన వీరంతా ఎలాంటి నేపధ్యం కానీ కుటుంబ వారసత్వం కానీ లేని వారు కావడం విశేషం.

ఎన్టీఆర్‌ రాజకీయంగా కొత్త ముఖాలను తీసుకోవాలని భావించి ఆనాటి యువతను పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. ఆ విధంగా ఎంతో మంది బీసీలు బడుగు వర్గాలు రాజకీయంగా అందలాలు ఎక్కారు. వారి ప్రాభవం అలా 2019 దాకా కొనసాగింది. అయితే 2024 ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం టీడీపీ అధినాయకత్వం ఆలోచనలు మారిపోయాయి. కొత్త వారికి ప్రాధాన్యత ఇస్తూ టిక్కెట్ల పంపిణీ చేశారు. అవసరమైన చోట మాత్రమే సీనియర్లకు టిక్కెట్లు దక్కాయి. ఇక మంత్రి పదవుల విషయం తీసుకుంటే తొలిసారి గెలిచినవారికే అమాత్య కిరీటాలు అందాయి. దీంతో సీనియర్లు అంతా ఒకింత అసంతృప్తికి లోను అవుతూ వస్తున్నారు. అయితే అదే సమయంలో రేపటి రాజకీయానికి కూడా ఏ విధంగా వ్యూహరచన చేయాలన్నది నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.

తాను సీనియర్లు అయితే తమ వారసులను ముందు పెట్టాలని తెలివైన ఎత్తుగడతో ముందుకు వస్తున్నారు. ఆ విధంగా చూస్తే ఉత్తరాంధరా నిండా ఇపుడు వారసుల హవా టీడీపీలో ఎక్కువగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీలో అంతా మంత్రి నారా లోకేష్‌దే ఆధిపత్యం అని భావించిన వారు తమ వారసులను ఆయన టీమ్‌లో చేర్పించడం ద్వారా తమ కుటుంబ రాజకీయం ఇంటి గడప దాటకుండా ఉండేలా చూసుకుంటున్నారు.

లోకేష్‌ టీమ్‌లో ఉంటే వారికి వచ్చే ఎన్నికలలో కచ్చితంగా టిక్కెట్లు వస్తాయని ఆ విధంగా వారి రాజకీయ జీవితం సాఫీగా సాగిపోతుందని అంచనా వేసుకుంటున్నారు. ఆ విధంగా చూస్తే లోకేష్‌ టీమ్‌లో చేరేందుకు ఉత్సాహపడే వారసుల జాబితా అంతకంతకు పెరిగిపోతోంది. అదే సమయంలో లోకేష్‌ను ప్రసన్నం చేసుకునేందుకు సీనియర్‌ నేతలు సైతం తాపత్రయపడడమూ కనిపిస్తోంది. లోకేష్‌తో భేటీలు వేస్తూ ఆయనకు వారసులను పరిచయం చేస్తూ భవిష్యత్తు రాజకీయాన్ని పదిలం చేసుకునే వ్యూహాలకు తెరతీస్తున్నారు.

ఉమ్మడి విశాఖ జిల్లాలో చూసుకుంటే సీనియర్‌ నేతగా స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ఉన్నారు. ఆయన అనేకసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రి పదవులు కూడా దక్కించుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఆయనకు పదిసార్లు ఎమ్మెల్యే టిక్కెట్‌ను, ఒకసారి ఎంపీ టిక్కెట్‌ను ఇచ్చి ప్రోత్సహించింది. ఇంతలా ఆయనను ముందుకు తెచ్చిన టీడీపీలో తన వారసుడికీ చోటు కావాలని అయ్యన్న గట్టిగా భావిస్తున్నారు. ఆయన కుమారుడు విజయ్‌ను వచ్చే ఎన్నికలలో నర్శీపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారు.విజయ్‌ కూడా లోకేష్‌ కనుసన్నలలో పనిచేస్తూ ఆయన మెప్పు పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు 2029 నాటికి భీమునిపట్నం నియోజకవర్గాన్ని తన కుమారుడు గంటా రవితేజకు దక్కేలా పావులు కదుపుతున్నారు. రాజకీయంగా తన కుమారుడునే ముందుకు పెట్టి పార్టీ వ్యవహారాలను నడిపిస్తున్నారు. ఆయన లోకేష్‌ను ఇటీవల కలసివచ్చారు. ఈ మధ్యనే రవితేజ పుట్టినరోజు వేడుకలను కూడా పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. రేపటి రాజకీయం ఆయనదే అని చాటిచెప్పే ప్రయత్నం సాగుతోంది. అయితే రవితేజను లోకేష్‌ టీమ్‌లోకి తీసుకుంటారా అంటే చూడాల్సి ఉంది అంటున్నారు. జిల్లా రాజకీయాలలో అయ్యన్నకు గంటాకు పడదు అని అంటారు. దాంతో లోకేష్‌కు అయ్యన్న కుటుంబం దగ్గర అయినంతగా గంటా దగ్గర కాలేదని చెబుతారు. అయినా సరే గంటా రాజకీయ వ్యూహాలూ ఆయనకూ ఉన్నాయని ప్రచారం సాగుతోంది.

మరో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి తన రాజకీయ వారసుడు బండారు అప్పలనాయుడును లోకేష్‌ టీమ్‌లో చేర్పించేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. కుదిరితే పెందుర్తి లేకపోతే మాడుగుల సీటును తన వారసుడికి ఇప్పించుకునే పనిలో ఆయన ఉన్నారని అంటున్నారు.

విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన గణబాబు తన కుమారుడిని కూడా లోకేష్‌ టీమ్‌లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తన రెండవ కుమారుడిని రాజకీయాలలోకి తెస్తున్నారంటే చినబాబు ఆశీస్సులు ఉన్నాయనే అంటున్నారు. అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే గోవింద సత్యనారాయణ తన వారసుడిని వచ్చే ఎన్నికలలో దించడానికి చినబాబు ప్రాపకం కోసం చూస్తున్నారని అంటున్నారు.

ఇక మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తన కుమారుడు దాడి రత్నాకర్‌ను లోకేష్‌ గుడ్‌లుక్స్‌లో ఉండేలా చేసుకుంటున్నారు. విజయనగరం జిల్లాలో చూస్తే కేంద్ర మాజీమంత్రి అశోక్‌గజపతిరాజు కుమార్తె విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు లోకేష్‌ టీమ్‌లోనే ఉన్నారని అంటున్నారు. చీపురుపల్లి ఎమ్మెల్యే, సీనియర్‌ నేత కళా వెంకటరావు తన కుమారుడు రామ్‌ మల్లిక్‌ కోసం చినబాబుకు టచ్‌లో ఉంటున్నారని ప్రచారంలో ఉంది.

శ్రీకాకుళంలో మాజీ స్పీకర్‌ ప్రతిభాభారతి కుమార్తె గ్రీష్మ సైతం లోకేష్‌ టీమ్‌లోనే అంటున్నారు. ఇంకా చాలామంది సీనియర్‌ నేతలు తరచుగా లోకేష్‌తోనే భేటీలు వేస్తున్నారు. మొత్తానికి లోకేష్‌ టీమ్‌లో ఉంటే తమ వారసుల రాజకీయం సెట్‌ అయినట్లే అని సీనియర్లు భావిస్తున్నారు.

10 Replies to “లోకేష్‌ టీమ్‌కు డిమాండు”

  1. వాళ్ళు పార్టీకి సేవ చేసి అభివృద్ధి పర్చేరు వాళ్ళు వాళ్ళ వారసులను కూడా పార్టీలోకి ప్రవేశపెట్టాలని చూస్తున్నారు తప్పేముంది వాళ్ళను ప్రజలు ఆశీర్వదించినప్పుడే వారసులు గ వుంటారు

Comments are closed.