వెయ్యేళ్లకు పైగా చరిత్ర కలిగిన తిరుపతి గంగమ్మ పురాతన ఆలయాన్ని సందర్శించిన తొలి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ రికార్డుకెక్కారు. తిరుమల శ్రీవారి చెల్లెలైన తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి విశిష్ట చరిత్ర వుంది. పురాతన కాలం నుంచి తాతయ్యగుంట గంగమ్మ ఆలయాన్ని సందర్శించిన తర్వాతే తిరుమలేశుని దర్శనానికి భక్తులు వెళ్లడం ఆనవాయితీ. సుమారు 400 ఏళ్ల పూర్వం నుంచే ఈ సంప్రదాయం వుంది. అయితే మారిన కాలమాన పరిస్థితుల్లో సంప్రదాయం అమలుకు నోచుకోలేదు.
కానీ సంప్రదాయానికి సంబంధించిన ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తీసుకెళ్లారు. ఆ సంస్కృతి, సంప్రదాయాన్ని ఆచరించేందుకు జగన్ మొగ్గు చూపారు. తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా పట్టువస్త్రాలు సమర్పిం చేందుకు ఇవాళ సీఎం జగన్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన మంగళవారం సాయంత్రం మొదట తాతయ్య గుంట గంగమ్మ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి తన భక్తిని చాటుకున్నారు. గంగమ్మ ఆలయానికి వెళ్లిన సీఎం జగన్‌కు ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలో ఘన స్వాగతం పలికారు. పురాతన గంగమ్మ ఆలయ విశిష్టతను సీఎంకు ఎమ్మెల్యే భూమన వివరించారు.
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి ప్రియ భక్తుడు అనంతాచార్యులు 900 ఏళ్ల క్రితం తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ ఆలయాన్ని నిర్మించారు. తిరుపతి నగరంతో పాటు ఈ ఆలయానికి కూడా అంతే ఘన చరిత్ర వుంది. ఇదిలా వుండగా ప్రాచీన సంప్రదాయం కొనసాగించిన తొలి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ చరిత్రలో నిలవనున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఓ ప్రముఖ వ్యక్తి గంగమ్మ ఆలయానికి రావడం ఇదే మొదలు. జగన్ చేతుల మీదుగా తిరిగి సంప్రదాయాన్ని పునరుద్ధరించిన ఘనత ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డికి దక్కుతుంది.
ఎందుకంటే రాజకీయాలు సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. ఇదే ఆధ్యాత్మిక అంశాలు సమాజాన్ని ఏకం చేస్తాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి, తిరుమలలో రాజకీయాలకు అతీతంగా అందరూ ఐకమత్యంతో కలిసి ఉండాలనే సదాశయంతో తాతయ్యగుంట గంగమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించినట్టు ఎమ్మెల్యే భూమన తెలిపారు. ఆలయానికి సీఎం హోదాలో జగన్ వచ్చి మరుగున పడిన సంప్రదాయాన్ని తిరిగి పునఃప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.