రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుటుంబ సభ్యులు కనిపించకుండా వెళ్లడం చర్చనీయాంశమైంది. పేర్ని నానీని కూటమి నేతలే ఎవరూ కనుక్కోలేని ప్రాంతంలో దాచారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు ఖండించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ పేర్నిపై మండిపడ్డారు.
మాయమైన బియ్యానికి పేర్ని సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. డబ్బు కట్టినంత మాత్రాన కేసు లేకుండా పోదని ఆయన అన్నారు. బియ్యం దొంగతనం జరిగిందని పేర్ని ఒప్పుకున్నారని, దీంతో కేసు వుంటుందని ఆయన చెప్పుకొచ్చారు. పేర్ని నాని కుటుంబ సభ్యుల్ని కూటమి నేతలే దాచారనే ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు.
ఆ అవసరం తమకు లేదన్నారు. పేర్ని ఎప్పుడు దొరుకుతారా? అని తాము ఎదురు చూస్తున్నామన్నారు. పేర్ని నాని భార్య జయసుధ పేరుతో గోదాము వుండడం వల్ల ఆమెపై కేసు నమోదు చేశారన్నారు.
జోగి రమేశ్‌తో కలిసి గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడంపై తనను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ వివరణ అడగలేదన్నారు. హైదరాబాద్ నుంచి సీఎం చంద్రబాబు వచ్చిన వెంటనే తానే కలిసి వివరణ ఇస్తానన్నారు. జోగిని తాను ఉద్దేశ పూర్వకంగా కలిశానా? లేదా? అని అందరికీ తెలుసన్నారు.