తిరుపతి జిల్లా గూడూరు, అలాగే నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ వైసీపీ అభ్యర్థులు మేరిగ మురళీధర్, గంగుల బ్రిజేంద్రనాథ్‌రెడ్డి కీలకమైన ఎన్నికల సమయంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నట్టు ఐ ప్యాక్ టీమ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు నివేదిక సమర్పించినట్టు తెలిసింది. ఈ రెండు నియోజకవర్గాలు వైసీసీకి కంచుకోటలని, తాము జనంలో తిరగకపోయినా జనం ఓట్లు వేసి గెలిపిస్తారనే అహంకార ధోరణిలో వున్నట్టు సీఎంకు సమర్పించిన నివేదికలో పొందుపరిచారని సమాచారం.
గూడూరులో సిటింగ్ ఎమ్మెల్యే వరప్రసాద్‌ను కాదని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్‌కు ఈ దఫా సీఎం జగన్ టికెట్ ఇచ్చారు. అవకాశాన్ని కళ్లకద్దుకుని సద్వినియోగం చేసుకోవాల్సిన మేరిగ… ఎన్నికల ప్రచారంలో పూడు పామును తలపించేలా నడుచుకుంటున్నారని ఐ ప్యాక్ నివేదిక సారాంశం. ఎన్నికల ప్రచారం నిమిత్తం తగిన వనరుల్ని జగన్ సమకూర్చినా… మేరిగ మురళీధర్ మాత్రం, ఇంకా సమయం వుంది కదా, చూద్దాం, చేద్దాం అనే నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారనేది సొంత పార్టీ శ్రేణుల విమర్శ.
గత ఎన్నికల్లో 50 వేలకు పైగా మెజార్టీతో వైసీపీ అభ్యర్థి ఇక్కడి నుంచి గెలుపొందారు. ఇది వైసీపీకి కంచుకోట. అయితే మేరిగ మురళీ మాత్రం జేబులో నుంచి పైసా కూడా డబ్బు బయటకు తీయకపోవడం, కార్యకర్తలు, నాయకుల్ని కలుపుకెళ్లడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండడం టీడీపీకి సానుకూలంగా మారే ప్రమాదం వుందని సొంత పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. గూడూరు వైసీపీ అభ్యర్థి మురళీధర్ ఇప్పటికైనా తన తీరు మార్చుకోకపోతే వైసీపీకి కష్టకాలమే. లేదంటే ఆయన్నే మార్చేస్తే ఒక పనై పోతుందనే వాళ్లు లేకపోలేదు.
ఇక ఆళ్లగడ్డ విషయానికి వస్తే… టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియపై ప్రజల్లో వ్యతిరేకత వైసీపీకి కలిసొచ్చే అంశం. అయితే అఖిలపై వ్యతిరేకతను రాజకీయంగా సొమ్ము చేసుకోవడంలో వైసీపీ సిటింగ్ ఎమ్మెల్యే, అభ్యర్థి బ్రిజేంద్రనాథ్‌రెడ్డి తగిన చొరవ చూపడం లేదని సీఎంకు ఐ ప్యాక్ టీమ్ నివేదిక సమర్పించింది. బీజేపీ ఇన్‌చార్జ్ భూమా కిశోర్‌రెడ్డి నేతృత్వంలో కొద్దోగొప్పో వైసీపీలో చేరికలు జరుగుతున్నాయి. కిశోర్ ఆధ్వర్యంలో పది చేరికలు జరిగితే, వైసీపీ అభ్యర్థి బ్రిజేంద్ర నేతృత్వంలో రెండు చేరికలు జరుగుతున్నాయి.
కీలక ఎన్నికల సమయంలో బ్రిజేంద్ర పిసినారితనాన్ని ప్రదర్శించడంపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. బ్రిజేంద్రకు టికెట్ కావాలి, ఎమ్మెల్యే కావాలనే ఆశ తప్ప, అందుకు చేయాల్సిన పనులు చేయడం లేదనే ఆగ్రహం వైసీపీలో ఉంది. వైసీపీ పెద్దలు ఇప్పటికైనా ఆళ్లగడ్డపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం వుందని ఐ ప్యాక్ టీమ్ నివేదించినట్టు తెలిసింది. ఇదే రీతిలో బ్రిజేంద్రనాథ్‌రెడ్డి వ్యవహరిస్తే మాత్రం, చేజేతులా వైసీపీ ఒక సీటును కోల్పోవడానికి రెడీగా వుండాలి.