ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె టీడీపీ అభ్యర్థి దాసరిపల్లె జయచంద్రారెడ్డిని మార్చాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం. టీడీపీ ఇన్‌చార్జ్, బీసీ నాయకుడు శంకర్‌యాదవ్‌ను కాదని జయచంద్రారెడ్డికి ఇవ్వడం తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. కేవలం కాంట్రాక్టర్ కావడం, బాగా డబ్బు ఖర్చు పెడతారనే ఉద్దేశంతోనే జయచంద్రారెడ్డి వైపు చంద్రబాబు మొగ్గు చూపారనేది వాస్తవం.
కనీసం టీడీపీతో ఎలాంటి అనుబంధం లేని జయచంద్రారెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని తంబళ్లపల్లె పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయి. శంకర్‌యాదవ్‌కే టికెట్ ఇవ్వాలంటూ ఆయన అనుచరులు విజయవాడకు వెళ్లి టీడీపీ కేంద్ర కార్యాలయం ఎదుట పెట్రోల్ మీద పోసుకుని నిప్పు పెట్టుకుంటామని హెచ్చరించారు. అయినప్పటికీ చంద్రబాబు వెనక్కి తగ్గలేదు. అయితే టికెట్ ఖరారు చేయడానికి ముందు జయచంద్రారెడ్డి పెద్ద మొత్తంలో డబ్బు చూపి, ఇప్పుడు మాత్రం ఉత్త చేతులు చూపుతున్నారని తెలిసింది.
దీంతో జయచంద్రారెడ్డి డబ్బు విషయంలో తమను మోసం చేశారని చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. మరెవరైనా బాగా డబ్బున్న వ్యక్తిని అభ్యర్థిగా నిలబెట్టేందుకు వెతుకుతున్నారని తెలిసింది. ఇప్పటికే కొందరితో టీడీపీ ముఖ్య నేతలు టచ్‌లోకి వెళ్లారు. అయితే చంద్రబాబును డబ్బు విషయంలో నమ్మలేమని, చివరికి తమను అప్పులపాలు చేస్తారని ఆసక్తి చూపలేదని సమాచారం.
తంబళ్లపల్లెలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు ద్వారకనాథరెడ్డి పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. ఎలాగైనా ద్వారకనాథరెడ్డిని ఓడించాలనేది బాబు పట్టుదల. అయితే జయచంద్రారెడ్డి విషయంలో అనుకున్నదొకటి, అయ్యిందొకటి అనే చందంగా తయారైంది. కనీసం రూ.50 కోట్లు ఖర్చు పెట్టుకునే వారెవరైనా బాబును సంప్రదిస్తే, ఎవరు? ఏమిటి? అని విచారించకుండానే కళ్లు మూసుకుని టికెట్ ఇవ్వడానికి సిద్ధం. అంత మొత్తంలో ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి ఎవరైనా రెడీగా వుంటే , బాబును సంప్రదిస్తే, వెంటనే తంబళ్లపల్లె అభ్కర్థి కావచ్చు.