ఈ కాలంలో రాజకీయ నాయకులు విమర్శించుకోవడం అంటే బూతులు తిట్టుకోవడమే. అధికార పార్టీలో ఉన్నవారు ప్రతిపక్ష నాయకులను తిడతారు. ప్రతిపక్షాలవారు అధికారంలో ఉన్నవారిని తిడతారు. జనం కూడా నాయకుల తిట్లను ఎంజాయ్ చేస్తున్నారు. పత్రికల్లో నాయకుల తిట్లను యథాతథంగా ప్రచురిస్తున్నారు. టీవీ చానెళ్లలో నేరుగా ప్రసారమైపోతాయి.
నాయకులు లైవ్ లో కూడా నోరు జారుతుంటారు. కొందరు నాయకులు బూతులు మాట్లాడాక లేదా అనుచిత వ్యాఖ్యలు చేశాక, తాము అలా మాట్లాడలేదని, మీడియా వక్రీకరించిందని అంటుంటారు. కానీ టీవీ ఛానెల్స్ లో వక్రీకరించడం సాధ్యం కాదు. నాయకులు ఎవరైనా ఖండించినప్పుడు టీవీ ఛానెల్స్ వాళ్ళు ఆ కామెంట్స్ ను రిపీట్ చేస్తుంటారు.
ఒకానొక కాలంలో నాయకులు బూతులు మాట్లాడితే పత్రికల్లో వాటిని యథాతథంగా ప్రచురించకూడదనే నియమం ఉండేది. రాయడానికి వీల్లేని భాషలో మాట్లాడారు అనే రాసేవారు. ఆ బూతులు ప్రచురించడం సభ్యత కాదనుకునేవారు. కానీ ఇప్పుడు నాయకులు మాట్లాడినదాన్ని అలాగే ప్రచురిస్తున్నారు.
సామాన్య జనం కొందరు నాయకులను బూతుల నాయకులు అంటుంటారు. చాలా డిగ్నిఫైడ్ గా ఉన్నారని భావించే కొందరు నాయకులు కూడా అప్పుడప్పుడు బూతులు మాట్లాడుతుంటారు. చట్ట సభల్లోనే మాట్లాడుతుంటే దిక్కులేదుగానీ సభల్లోనో, ప్రెస్ మీట్లలోనో మాట్లాడుతుంటే ఎవడు పట్టించుకుంటాడు? సౌమ్యంగా కనిపించే కొందరు నాయకులు కూడా నిరాశ నిస్పృహల్లో బూతులు మాట్లాడుతుంటారు.
తెలంగాణలో అధికారం పోయాక గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ సహా ఆ పార్టీ నాయకులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అందులోనూ చిన్నా చితక నాయకులతో పాటు కేసీఆర్ అందలం ఎక్కించిన పెద్ద నాయకులు కూడా పార్టీని వదిలిపోతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చినవారు కూడా ఉండలేమని వెళ్లిపోతున్నారు. ఇదంతా బీఆర్ఎస్ నాయకులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
మరోవైపు కవిత జైలుకు వెళ్లడం, ఫోన్ ట్యాపింగ్ సంచలనంగా మారడం, ఇంకా కొన్ని కుంభకోణాలు ఊపిరి సలపనివ్వడంలేదు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి బూతులు వస్తున్నాయి. తెలంగాణ నాయకులకు బూతులు మాట్లాడటం అలవాటు చేసింది కేసీఆర్ అనే అభిప్రాయం ఉంది.
తెలంగాణ ఉద్యమ సమయంలో, రాష్ట్రం ఏర్పడి అధికారం చేపట్టాక కూడా ఆయన బూతులు మాట్లాడటం తగ్గలేదు. ఓడిపోయాక కూడా అదే ధోరణి. కానీ అధికారంలో ఉన్నప్పుడు తాను సంస్కారవంతంగా, మర్యాదగా మాట్లాడానని చెప్పుకున్నాడు. కాంగ్రెస్ నాయకులే అధికారంలోకి రాగానే బూతులు మాట్లాడుతున్నారని అన్నాడు. ఆయన ఎలాంటి మాటలు మాట్లాడాడో చెప్పుకుంటే పెద్ద కథ అవుతుంది.
అయితే కేసీఆర్ తో కంపేర్ చేసుకుంటే ఆయన కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు నోరు జారడం తక్కువేనని చెప్పాలి. కానీ వాళ్ళు కూడా పార్టీ దుస్థితి నేపథ్యంలో కుతకుత ఉడికిపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులే అయింది. కానీ అది రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందన్నట్టుగా మాట్లాడుతున్నారు.
సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఫోన్ ట్యాపింగ్ ను తెరపైకి తెచ్చారన్న కేటీఆర్ ఆ కుంభకోణం తన మెడకే చుట్టుకునేలా ఉండటంతో అసహనంతో అవును.. ఇద్దరు ముగ్గురి ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు. దొంగలవి, లంగలవి ట్యాప్ చేసినం అన్నాడు. దానికే ఇంత పెద్ద రాద్ధాంతం చేస్తున్నారని మండి పడ్డాడు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఒప్పుకున్నట్లే కదా. లంగలు (లంగాలు) అనేది బూతే.
హరీష్ రావు ఇంకా దారుణంగా మాట్లాడాడు. మక్కలకు, వడ్లకు ఐదొందల రూపాయల బోనస్ ఇస్తానన్నకుక్కల కొడకా … ఏడున్నవురా? అనే రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. హరీష్ రావు కూడా ఇంత దారుణంగా మాట్లాడటమా అనే విమర్శలు వస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో గులాబీ పార్టీకి నామమాత్రంగా సీట్లు వస్తే ఇంకెన్ని బూతులు తిడతారో.