జగన్ ను ఓడించడం తప్ప తన జీవితానికి వేరే పరమార్థం లేనేలేదని కల్లబొల్లి మాటలు చెబుతూ.. తెలుగుదేశంతో పొత్తులు పెట్టుకున్న పవన్ కల్యాణ్, చంద్రబాబునాయుడు ముష్టిగా విదిలించిన 21 సీట్లలోనే అభ్యర్థులను వెతుక్కోలేక ఇబ్బంది పడుతున్నారు. మరి ఆయన జనసైనికులు, పార్టీలోని కొందరు నాయకులు కోరుకుంటున్నట్టుగా.. ఏకంగా 60, 70 సీట్లు ఆ పార్టీకి చంద్రబాబు కేటాయించి ఉంటే పరిస్థితి ఏమిటి? పాపం.. అన్ని సీట్లకు సరిపడా అభ్యర్థులు తన వద్ద లేక, ఇతర పార్టీలనుంచి ఎప్పుడు ఎవరు వస్తారా? అని ఎదురుచూస్తూ పవన్ కల్యాణ్ ఎన్ని కష్టాలు పడి ఉండాలో కదా అనిపిస్తోంది.
21సీట్లలో కూడా అభ్యర్థులను సొంతంగా మోహరించలేక, ఇతర పార్టీలనుంచి వలస నాయకుల మీద ఆధారపడుతున్న పవన్ కల్యాణ్ గతిలేని తనానికి పరాకాష్ట, చిట్టచివరి ఎగ్జాంపుల్ గా అవనిగడ్డ నిలుస్తోంది.
పవన్ కల్యాణ్ దక్కించుకున్న 21 ఎమ్మెల్యే సీట్ల వాటాలో అవనిగడ్డ నుంచి ఎవరు పోటీ చేస్తారనే సంగతిని ఇప్పటిదాకా ప్రకటించలేదు. అలాగని మిగిలిన స్థానాల్లో ఆయనకు అభ్యర్థులు ముందే సిద్ధంగా ఉన్నారని కాదు. ఇతర పార్టీల నుంచి ముందే వలసలు వచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి వచ్చి చేరిన అరణి శ్రీనివాసులు వంటి వారితో పాటు, టీడీపీ నుంచి వచ్చి చేరిన పులపర్తి ఆంజనేయులు కు కూడా టికెట్ ఇచ్చారు.
అవనిగడ్డ విషయానికి వచ్చేసరికి ఆయన అభ్యర్థిని తేల్చలేదు. ఆ నియోజకవర్గంలో జనసేన నాయకుల మధ్య పోటీ చాలా ఎక్కువగా ఉన్నదని, అందువల్ల మళ్లీ సర్వేలు చేయిస్తున్నామని, విజయావకాశాలు ఎవరికి ఎక్కువగా ఉంటే వారిని అభ్యర్థిని చేస్తాం అని ప్రకటిస్తూ వచ్చారు.
అదే సమయంలో అటువైపు అవనిగడ్డ తెలుగుదేశం పార్టీలో ముసలం పుట్టింది. గత నాలుగు పర్యాయాలుగా అక్కడ పోటీచేస్తూ రెండుసార్లు విజయం సాధించిన మండలి బుద్ధప్రసాద్ కు తెలుగుదేశం టికెట్ ప్రకటించకుండా, ఆ సీటును జనసేనకు కేటాయించడంతో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. అక్కడ తెదేపా నాయకులు మూకుమ్మడి రాజీనామాలు చేయడం కూడా జరిగింది.
ట్విస్టు ఏంటంటే.. తన వాటాగా దక్కిన స్థానాలకు కూడా అభ్యర్థులు గతిలేక వలసలపై ఆధారపడిన పవన్ కల్యాణ్, తెలుగుదేశం నాయకుడు మండలి బుద్ధ ప్రసాద్ ను జనసేనలో చేర్చుకుని ఆ పార్టీ టికెట్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఆయన సర్వేల్లో అక్కడి జనసేన నాయకులు ఎవ్వరికీ అంత సీన్లేదని, తెలుగుదేశం నేత మండలి బెటర్ అని తేలడంతో.. ఆ సీటును తెలుగుదేశానికి ఇచ్చేస్తే పరువు ఇంకా పోతుందని భయపడి.. ఆయననే తన పార్టీలో చేర్చుకుని బరిలోకి దించబోతున్నారని సమాచారం. మండలి జనసేనలో చేరి టికెట్ దక్కించుకుంటే గనుక.. ఆ పార్టీ గతిలేని తనానికి అది చిట్టచివరి ఉదాహరణ అవుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.