ఇలాంటి ప్రేమలు అవసరమా?

ప్రేమిస్తే ఓకే, నో చెబితే చంపేస్తామనే సంస్కృతి చాన్నాళ్ల కిందటే సమాజంలో పాతుకుపోయింది.

ప్రేమకు అర్థాలు మారిపోయి చాలా ఏళ్లయింది. ప్రేమిస్తే ఓకే, నో చెబితే చంపేస్తామనే సంస్కృతి చాన్నాళ్ల కిందటే సమాజంలో పాతుకుపోయింది. ఇది కూడా అలాంటిదే. ప్రేమకు అంగీకరించలేదని, అమ్మాయి తల్లిని అత్యంత దారుణంగా హత్య చేశాడు ఓ ప్రేమోన్మాది.

విశాఖపట్నం శివార్లలోని మధురవాడలో తల్లితో కలిసి ఉంటోంది దీపిక. డిగ్రీ పూర్తిచేసి ఇంట్లోనే ఉంటున్న దీపికను స్థానికంగా నివశిస్తున్న నవీన్ అనే వ్యక్తి ప్రేమించాడు. విషయం దీపిక ఇంట్లో వాళ్లు కూడా సానుకూలంగానే స్పందించినట్టు తెలుస్తోంది.

అయితే అంతలోనే ఏమైందో ఏమో, ఈరోజు మధ్యాహ్నం ఓ కత్తి తీసుకొని దీపిక ఇంట్లో చొరబడ్డాడు నవీన్. దీపికపై, ఆమె తల్లి లక్ష్మిపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో దీపిక తల్లి అక్కడికక్కడే మృతి చెందగా, దీపికకు తీవ్ర గాయాలయ్యాయి.

వెంటనే స్పందించిన స్థానికులు దీపికను సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.

మరోవైపు నవీన్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. హైవేపైకి వచ్చి కనిపించిన బస్సు ఎక్కాడు. నేరుగా శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్నాడు. అట్నుంచి అటు బూర్జ అనే ఊరుకు చేరుకున్నాడు. అయితే గంటల వ్యవథిలోనే పోలీసులు అతడ్ని పట్టుకున్నారు.

జరిగిన ఘటనపై మృతురాలి చెల్లెలు స్పందించారు. దీపికను నవీన్ కిచ్చి పెళ్లి చేయడానికి దీపిక తల్లి అంగీకరించిందని, అంతలోనే ఇలా ఎందుకు జరిగిందో అర్థంకావడం లేదని అంటోంది. నవీన్ ను నడిరోడ్డుపై ఉరి తీయాలంటూ ఆమె తన కోపాన్ని వ్యక్తం చేసింది.

2 Replies to “ఇలాంటి ప్రేమలు అవసరమా?”

Comments are closed.