మంత్రులు సుద్ద‌పూస‌లు.. ఓఎస్డీలు పాపాత్ములా?

చేత‌నైతే, త‌మ నుంచే అవినీతిని పార‌దోలితే, కిందిస్థాయిలో వాటిక‌వే అన్నీ స‌ర్దుకుంటాయి.

చంద్ర‌బాబు కేబినెట్‌లో మంత్రులంతా సుద్ద‌పూస‌ల‌ట‌! మంత్రుల ద‌గ్గ‌ర ప‌నిచేసే ఓఎస్డీలు అవినీతిప‌రుల‌ట‌! మంత్రుల ద‌గ్గ‌ర ప‌నిచేసే ఓఎస్డీల అవినీతితో ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు వ‌చ్చే ప్ర‌మాదం వుంద‌ని, అలాంటి వాళ్ల‌పై ప్ర‌భుత్వం ఆగ్ర‌హంగా వుంద‌నే వార్త‌లు ఆశ్చ‌ర్యం క‌లిగిస్తున్నాయి.

మంత్రుల ఆదేశాలు లేనిదే ఓఎస్డీలు ప‌నులు చేసే ప‌రిస్థితి వుందా? కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత ఎమ్మెల్యేలు, మంత్రులు, చిన్నాచిత‌కా నాయ‌కులంతా సంపాద‌న‌పై ప‌డ్డార‌నేది అంద‌రికీ తెలిసిన వాస్త‌వం. ఎన్నిక‌ల్లో కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టిన నాయ‌కులు, తిరిగి ఆ సొమ్మును రాబ‌ట్టుకోవాల‌నే వుంటారు. రాజ‌కీయాల్లోకి సంపాదించుకోడానికే త‌ప్ప‌, పోగొట్టుకోడానికి ఎవ‌రూ రావ‌డం లేద‌ని మొద‌ట గ్ర‌హించాలి.

ఎవ‌రైతే ఆదాయ వ‌న‌రుల గురించి బాగా తెలిసిన అధికారులు వుంటారో, వాళ్ల‌ను స‌మ‌ర్థులుగా భావించి ఓఎస్డీలుగా నియ‌మించుకుంటుందారు. ఇందుకు చంద్ర‌బాబు కేబినెట్‌లోని మంత్రులు మిన‌హాయింపు కాదు. మంత్రుల ద‌గ్గ‌ర ప‌ని చేస్తూ, అంతా వాళ్ల‌కే దోచిపెడ‌తార‌ని అనుకోవ‌డం అవివేకం, మంత్రుల‌కు 70, త‌మ‌కు 30 శాతం ఆదాయం లెక్క‌తో ఓఎస్డీలు వ్య‌వ‌హారాలు న‌డుపుతుంటారనే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఇప్పుడు 10 మంది మంత్రుల ద‌గ్గ‌ర ప‌ని చేసే ఓఎస్డీలు తీవ్ర అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని, వాళ్ల‌పై ప్ర‌భుత్వానికి నివేదిక అందింద‌ని చెప్ప‌డం హాస్యాస్ప‌దం. అవినీతికి పాల్ప‌డ‌ని నాయ‌కుడెవ‌రైనా ఉన్నారేమో నిఘా వ‌ర్గాల నివేదిక‌లు బ‌య‌ట‌పెడితే జ‌నం తెలుసుకుంటారు. పిండికొద్ది రొట్టె అనే సామెత చందంగా… ప్ర‌భుత్వంలో ప‌లుకుబ‌డి ఆధారంగా ఆదాయం వ‌స్తుంటుంద‌న్న‌ది నిజం. కీల‌క శాఖ‌ల‌కు నేతృత్వం వ‌హించే మంత్రుల‌కు ఆదాయం కూడా అదే స్థాయిలో వుంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు దేవాదాయ‌శాఖ‌ను తీసుకుందాం.

అందులో ఆదాయం అంతంత మాత్ర‌మే. రెవెన్యూ, ఆర్థిక‌, మైన్స్‌, హోం, విద్యా, వైద్య త‌దిత‌ర శాఖ‌ల్లో ఆదాయం బాగుంటుంద‌నే ప్ర‌చారం వుంది. గొంగట్లో అన్నం తింటూ, వెంట్రుకలు ఏరిన చందంగా… మంత్రుల ఓఎస్డీల‌ను ఏరివేస్తామ‌ని ప్ర‌భుత్వం చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌ని ప్ర‌జ‌లు అనుకుంటున్నారు. చేత‌నైతే, త‌మ నుంచే అవినీతిని పార‌దోలితే, కిందిస్థాయిలో వాటిక‌వే అన్నీ స‌ర్దుకుంటాయి.

One Reply to “మంత్రులు సుద్ద‌పూస‌లు.. ఓఎస్డీలు పాపాత్ములా?”

  1. తో–కే కాల-భైరవాన్ని ఊపుతోంది అంటే నమ్మాలి అదే “కూ”ట”-నీతి, ప్రజాతి

Comments are closed.