జనసేనాని పవన్‌కల్యాణ్ మాటలు కోటలు దాటుతాయి. కానీ చేతలు మాత్రం ఏమీ వుండవు. కాకినాడ జిల్లా పిఠాపురం బరిలో ఆయన నిలవనున్న సంగతి తెలిసిందే. నాలుగు రోజుల ఎన్నికల ప్రచారం నిమిత్తం గత శనివారం ఆయన పిఠాపురం వెళ్లారు. వెళ్లిన రోజు టీడీపీ ఇన్చార్జ్ వర్మతో కలిసి ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ మరుసటి రోజు నియోజకవర్గంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలను ఆయన సందర్శించారు.
వర్మతో కలిసి సమావేశం నిర్వహించారు. ఇంతకు మించి ఆయన చేసిందేమీ లేదు. అనారోగ్యమంటూ ఆయన హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. ఒకట్రెండు రోజులు జనంతో గడిపితే చాలు.. పవన్‌కల్యాణ్ అనారోగ్యానికి గురి కావడం ఇదేమీ కొత్త కాదు. గతంలో వారాహియాత్రలో కూడా ఇదే జరిగింది. దీంతో షెడ్యూల్ మరుగున పడుతోంది.
పవన్‌కల్యాణ్ ఎంత సున్నితంగా పెరిగారో దీన్ని బట్టే అర్థమవుతోందనే చర్చ జరుగుతోంది. ఇలాగైతే పవన్‌కల్యాణ్ ఇంకా 40 రోజుల పాటు ఎన్నికల ప్రచారం ఎలా చేస్తారనే ప్రశ్న ఉదయిస్తోంది. హైదరాబాద్ నుంచి తిరిగి సోమవారం పిఠాపురం చేరకుంటారని ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. జ్వరం, దగ్గు, ఇతరత్రా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే, పిఠాపురం వెళా వెళ్తారనేది ప్రశ్న.
చంద్రబాబునాయుడు ఏడు పదులు పైబడిన వయసులోనూ ఇలా అనారోగ్యం కారణంతో విశ్రమించిన దాఖలాలు లేవు. అలాగే జగన్, లోకేశ్ ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదు. పవన్‌కల్యాణ్ రాజకీయాలకు అన్‌ఫిట్ అని ఆయన రాజకీయ గమనాన్ని చూస్తున్న వారు చెప్పే మాట. పిఠాపురంలో కేవలం చెప్పుకోడానికే ఆయన నాలుగైదు రోజులు గడుపుతారే తప్ప, సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడ్తారని ఎవరూ అనుకోవడం లేదు. దీని వల్ల పవన్‌కు లాభం కంటే నష్టమే ఎక్కువ. ఎందుకంటే, పిఠాపురంలో నాలుగు రోజులు ఉన్నా, ఒక్కరితో కూడా మాట్లాడలేదనే అసంతృప్తి సొంత పార్టీ నుంచి తెచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.