తెలంగాణను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి పాత్రధారులైన పోలీసు అధికారులు దాదాపుగా అందరూ ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నారు. కస్టడీలో విచారణను ఎదుర్కొంటున్నారు. అనివార్యమైన పరిస్థితుల్లో వారు అనేక మంది సూత్రధారుల పేర్లను కూడా వెల్లడించినట్టుగా తెలుస్తోంది.
అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించిన ప్రభాకర్ రావు ఇప్పుడు అమెరికా నుంచి తెలంగాణకు వస్తున్నారు. ఆయన కూడా పోలీసుల విచారణకు హాజరైతే.. ఇంకా అనేకమంది అసలు సూత్రధారులు, తెరవెనుక నుంచి ట్యాపింగ్ వ్యవహారాన్ని మొత్తం నడిపించిన వారి పేర్లు బయటకు వస్తాయని అంచనాలు సాగుతున్నాయి.
ప్రణీత్ రావు దగ్గరి నుంచి భుజంగరావు, తిరుపతన్న ఇలా ప్రతి ఒక్కరూ కూడా.. ప్రభాకర్ రావు చెప్పినట్టుగా ఆయన ఆదేశాల మేరకే చేశాం అని పోలీసులకు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే.. ఇలాంటి పరిణామాలను ఊహించిన ప్రభాకర్ రావు ముందే అమెరికా పారిపోయినట్లుగా కూడా పుకార్లు వచ్చాయి. అయితే ఆయన మాత్రం తాను క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్లినట్టు చెప్పుకుంటూ వచ్చారు.
ఇక్కడి పోలీసు అధికారులు కాంటాక్ట్ చేసినప్పుడు.. ‘మీరు ఇప్పుడు నాయకులు చెప్పినట్టు ఎలా చేస్తున్నారో.. మేం కూడా అప్పుడు అలాగే అధికారంలో ఉన్నవారు చెప్పినట్టు చేశాం’ అని వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఆ విషయం అధికారిక పోలీసు మెయిల్ కు పంపాలని కోరగా కాల్ కట్ చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి.
అయితే ప్రభాకర్ రావుకు సన్నిహితులైన కొందరు ఇతర అధికారులు మధ్యవర్తిత్వం నడిపిన తర్వాత, విచారణకు హాజరు కాకుండా అమెరికాలోనే ఉండిపోతే రాగల తీవ్ర పరిణామాల గురించి హెచ్చరించిన తరవాత.. ఆయన తిరిగివస్తున్నట్టు తెలుస్తోంది.
ఇప్పుడు విచారణను ఎదుర్కొన్న అధికార్ల ద్వారానే కొందరు నాయకుల పేర్లు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే.. ప్రభాకర్ రావు వచ్చి పోలీసుల విచారణకు హాజరైతే.. అసలు కీలక సూత్రధారులు వెలుగులోకి వస్తారు. ఒకవైపు కేటీఆర్ పాత్ర గురించి, ఆయన కూడా శిక్ష ఎదుర్కోక తప్పదు అనే సోషల్ మీడియా ప్రచారం ఊపందుకుంటోంది. అలాంటి సోషల్ మీడియా ప్రచారాల మీద కేటీఆర్ నోటీసులు కూడా ఇచ్చారు.
ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత వెల్లడించే పేర్ల గురించి చాలా చర్చ జరుగుతోంది. అదే సమయంలో.. ప్రభాకరరావు విచారణకు హాజరైతే.. ఎవరెవరి పేర్లను వెల్లడించాలి, ఎవరి పేర్లను వెల్లడించకూడదు అనే విషయంలో కూడా ముందే మంతనాలు పూర్తయ్యాయని, ఒక పర్ఫెక్ట్ స్క్రిప్ట్ తయారు అయిందని, దాని ప్రకారం.. అసలు సూత్రధారులను కాపాడేలా కొన్ని పేర్లను మాత్రం వెల్లడిస్తారని కూడా కొందరు అంటున్నారు. మరి ఈ ట్యాపింగ్ వ్యవహారం ఇంకా ఎన్నెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.