శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో టీడీపీకి బిగ్ షాక్. టీడీపీ సీనియర్ మైనార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. ఈ పరిణామం టీడీపీకి కోలుకోలేని దెబ్బ. 2014లో అత్తార్ చాంద్‌బాషా వైసీపీ తరపున గెలుపొందారు. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరారు. అయితే మంత్రి చేస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయారు.
రాజీనామా సందర్భంగా చంద్రబాబుపై ఆయన ధ్వజమెత్తారు. వైసీపీ తరుపన గెలిచి, టీడీపీలో చేరానన్నారు. మంత్రి పదవి ఇస్తానని చెప్పి చంద్రబాబు మోసగించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా కదిరి టికెట్ ఇస్తానని చెప్పి మాట తప్పాడని ఆరోపించారు. జగన్ సమక్షంలో తనతో పాటు నియోజకవర్గం వ్యాప్తంగా తన వాళ్లంతా పెద్ద సంఖ్యలో వైసీపీ కండువా కప్పుకోనున్నట్టు ఆయన తెలిపారు.
కదిరి సీటును మరోసారి మైనార్టీకే వైసీపీ కేటాయించింది. ఈ దఫా మక్బూల్ అహ్మద్‌కు కదిరి టికెట్ ఇచ్చారు. అయితే మక్బూల్ అహ్మద్ వ్యవహార శైలి వైసీపీలో కొందరికి మింగుడు పడడం లేదు. అందర్నీ కలుపుకెళ్లలేదనే ఆరోపణలున్నాయి. కదిరిలో సిటింగ్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి హయాంలో వైసీపీ వర్గాలుగా చీలిపోయింది. అహ్మద్‌కు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించిన తర్వాత ఒక వర్గంతో కలిసి వెళుతున్నారనే ఆరోపణలున్నాయి.
కదిరిలో జగన్ పర్యటించనున్న నేపథ్యంలో వైసీపీలోని అంతర్గత విభేదాలను సర్దుబాటు చేయాల్సిన అవసరం వుందనే మాట వినిపిస్తోంది. ఆ పని చేస్తే కదిరిలో వైసీపీ విజయం నల్లేరుపై నడకే. తాజాగా మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా వైసీపీలో చేరిక, ఆ పార్టీకి బాగా కలిసొచ్చే అంశం. మైనార్టీల్లో టీడీపీకి చావు దెబ్బే అని చెప్పక తప్పదు.