ఇండియాలో ప్లాస్టిక్ ప‌ర్వ‌తాలు, ఇవి క‌రిగేదెలా!

గ‌త ఐదు సంవ‌త్స‌రాల్లో ఇండియాలో ప్లాస్టిక్ వేస్ట్ ప‌రిమాణం రెట్టింపు అయ్యింద‌ని గ‌ణాంకాలు చెబుతూ ఉన్నాయి. దేశంలో ప్లాస్టిక్ వినియోగం విప‌రీతంగా పెరిగిపోవ‌డం గ‌త 25 యేళ్ల నుంచి ఆందోళ‌న‌క‌ర‌మైన వార్త‌ల్లో నిలుస్తూ ఉన్న‌దే!…

గ‌త ఐదు సంవ‌త్స‌రాల్లో ఇండియాలో ప్లాస్టిక్ వేస్ట్ ప‌రిమాణం రెట్టింపు అయ్యింద‌ని గ‌ణాంకాలు చెబుతూ ఉన్నాయి. దేశంలో ప్లాస్టిక్ వినియోగం విప‌రీతంగా పెరిగిపోవ‌డం గ‌త 25 యేళ్ల నుంచి ఆందోళ‌న‌క‌ర‌మైన వార్త‌ల్లో నిలుస్తూ ఉన్న‌దే!

ముప్పై సంవ‌త్స‌రాల కింద‌ట దేశంలో ఎడాపెడా ప్లాస్టిక్ వినియోగం పెరగ‌డం మొద‌లైంది. టీ గ్లాస్ లు, ప్లాస్టిక్ క‌వ‌ర్లు.. అప్పుడు భ‌లే సౌల‌భ్యంగా అనిపించాయి భార‌తీయుల‌కు. అయితే అతి వేగంగానే ప్లాస్టిక్ ఇండియా భారంగా మార‌డం మొద‌లైంది. 1995 నుంచి 2000 ల మ‌ధ్య‌న ప్లాస్టిక్ టీ గ్లాస్ లు, ప్లాస్టిక్ క‌వ‌ర్లు మ‌న వాళ్ల‌కు భ‌లే సౌక‌ర్య‌వంతం అనిపించాయి. అక్క‌డ నుంచి వాట‌ర్ గ్లాస్ లు, వాట‌ర్ బాటిళ్లు ప్లాస్టిక్ మ‌యం కావ‌డం పెరిగిపోయింది.

అంత‌టా ప్లాస్టిక్ విస్త‌రించింది. అయితే 2000 సంవ‌త్స‌రం స‌మ‌యంలోనే డేంజ‌ర్ బెల్స్ మోగ‌డం మొద‌లైంది. ప్లాస్టిక్ తో జాగ్ర‌త్త అనే హెచ్చ‌రిక‌లు జారీ అయ్యాయి. అయితే ఆ త‌ర్వాత ఐదారేళ్ల పాటు ప్లాస్టిక్ వినియోగం మ‌రింత ఎక్కువే అయ్యింది త‌ప్ప త‌గ్గ‌లేదు. ఆ స‌మ‌యంలోనే ఒకేసారి వాడ‌ద‌గిన ప్లాస్టిక్ పై నిషేధం అంటూ ప్ర‌క‌ట‌న‌లు మొద‌ల‌య్యాయి. అలాగే నేల‌లో క‌రిగిపోయే స్వ‌భావం ఉన్న ప్లాస్టిక్ నే వాడాల‌నే నినాదాలు, రీసైక్లింగ్ ప్లాస్టిక్ అంటూ ఇలా ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌చ్చాయి.

అయితే.. ప్ర‌స్తుతం ఇండియా ప్లాస్టిక్ పొల్యూష‌న్ విష‌యంలో ప్ర‌మాద‌క‌ర‌మైన స్థితికి చేరుకుంది. మ‌నం ఒప్పుకున్నా ఒప్పుకోక‌పోయినా.. ఇప్పుడు ప్లాస్టిక్ పొల్యూష‌న్ ను క్రియేట్ చేయ‌డంలో ప్ర‌పంచంలోనే మొద‌టి స్థానంలో ఉన్నామ‌ట‌! ఇండియా ఇప్పుడు ప్ర‌తి యేటా 3.5 మిలియ‌న్ ట‌న్నుల ప్లాస్టిక్ వేస్ట్ ను ప్రొడ్యూస్ చేస్తోంద‌ని ప్ర‌భుత్వ గ‌ణాంకాలే చెబుతూ ఉన్నాయి. అంత‌ర్జాతీయ సంస్థ‌ల లెక్క‌ల ప్ర‌కారం ఈ నంబ‌ర్ మ‌రింత పెద్ద‌ది.

అన్నింటికీ మించి ఇండియాలో రీ సైక్లింగ్ స్వ‌భావం ఉన్న ప్లాస్టిక్ ను వాడినా.. రీ కలెక్ట్ చేసే సిస్ట‌మ్ లేక‌పోవ‌డం ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితుల‌ను పెంచుతోంద‌ని ప‌రిశీల‌కులు చెబుతూ ఉన్నారు. ఇండియాలో ప్లాస్టిక్ వ్య‌ర్థాల‌ను కాల్చి వేసే అల‌వాట్లు గ‌ట్టిగా ఉన్నాయి.

న‌గ‌రాల శివార్ల‌లో, ప‌ట్ట‌ణాల్లో అయితే ఇది మ‌రింత ఎక్కువ‌! ప్లాస్టిక్ వ్య‌ర్థాలను ఎక్క‌డిక్క‌డ దార్ల ప‌క్క‌న చిన్న చిన్న గుట్ట‌లుగా క‌నిపించినా స‌రే, వాటిని ఏం చేయాలో తెలియ‌ద‌న్న‌ట్టుగా వాటికి అగ్గి పెడుతుంటారు చాలా మంది. అలాంటి మంట‌ల నుంచి భ‌యంక‌ర‌మైన కాలుష్యం జ‌న‌న‌రేట్ అవుతోంది. రీ సైకిల్ అయ్యే ప్లాస్టిక్ శాతం ఇప్ప‌టికీ ఇండియాలో త‌క్కువ‌గానే ఉంది. దీనికి కార‌ణాలు అనేకం. అవ‌గాహన లేక‌పోవ‌డం, అవ‌గాహ‌న ఉన్నా లెక్క‌లేని త‌నం, నిర్ల‌క్ష్యం , అవ‌స‌రం ఉన్నా లేక‌పోయినా ప్లాస్టిక్ వినియోగం, రీసైకిల్ కాని ప్లాస్టిక్ పై నిషేధం మాట‌ల వ‌ర‌కే ప‌రిమితం కావ‌డం ఇలాంటి కార‌ణాలు ఎన్నో ఉన్నాయి.

వీటి ఫ‌లితంగా ప్లాస్టిక్ వ్య‌ర్థాలు ఇండియాలో ప‌ర్వ‌తాలుగా పేరుకుంటూ ఉన్నాయి. వాటిని కాల్చి కొంత‌మంది మ‌రింత వాతావ‌ర‌ణాన్ని మ‌రింత ప్ర‌మాదాక‌రంగా మారుస్తూ ఉన్నారు.

ప‌ర్యాట‌క ప్రాంతాలు, ప్ర‌కృతి సౌంద‌ర్యాన్ని చూడ‌టానికి ప్ర‌జ‌లు ఎగ‌బ‌డే ప్రాంతాల్లో అయితే ప్లాస్టిక్ మ‌యం అయిపోయాయి. బీచ్ లు, స‌ముద్రాల‌ను కూడా ప్లాస్టిక్ బాటిళ్ల‌తో ముంచెత్తుతూ ఉన్నారు. ఇండియాలో మిన‌ర‌ల్ వాట‌ర్ బాటిళ్లను నిషేధిస్తే మంచిదేమో అనేంత స్థాయిలో ప్లాస్టిక్ వ్య‌ర్థాలు అలాంటి ప్రాంతాల‌ను ముంచెత్తుతూ ఉన్నాయి.

మిన‌ర‌ల్ వాట‌ర్ కంపెనీలు నీళ్ల‌ను అందించ‌డం లేద‌ని, కేవ‌లం అవి ప్లాస్టిక్ వ్య‌ర్థాల‌ను ప‌ర్యావ‌ర‌ణంలో ముంచెత్తుతూ ఉన్నాయ‌నే వాద‌న చాన్నాళ్లుగా ఉంది. లీట‌ర్ వాట‌ర్ కోసం, 200 ఎమ్ఎల్ కూల్ డ్రింక్ తాగడానికి కాసేపే ప‌డుతుంది. అయితే అలా తాగి ప‌డేసిన ప్లాస్టిక్ బాటిల్ ఏమ‌వుతోంద‌నే ఎవ‌రికి వారు వేసుకోవాల్సిన ప్ర‌శ్న‌! అలాంటి బాటిళ్లు ఎంత త‌క్కువ శాతం రీ సైకిల్ అవుతున్నాయ‌నేది దాన్ని బ‌ట్టి.. ప్ర‌మాద తీవ్ర‌త ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

అభివృద్ధి చెందిన దేశాల్లో ప్లాస్టిక్ వ్య‌ర్థాలు ఎక్కువే అయినా, వారు రీసైకిల్ చేసుకోవ‌డంలో దిట్ట‌లు. ఈ విష‌యంలో చైనా కూడా చాలా ముంద‌డుగులు వేసింది. ఒక ద‌శ‌లో ప్ర‌పంచాన్ని చైనా ప్లాస్టిక్ వ్య‌ర్థాల‌తో ప్ర‌మాదంలోకి నెడుతోంద‌నే విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి. అయితే ఇప్పుడు ఇండియా క‌న్నా చైనా నుంచి వెలువ‌డుతున్న ప్లాస్టిక్ వ్య‌ర్థాలు కేవ‌లం మూడో వంతేన‌ట‌!

కాలే ప్ర‌తి ప్లాస్టిక్ బాటిల్ ఎంతో కొంత వాతావర‌ణాన్ని పాడు చేస్తూ ఉంది. రీ సైకిల్ కాకుండా నేలలో క‌లిసిపోయే ప్ర‌తి ప్టాస్టిక్ క‌వ‌ర్ కూడా త‌న‌వంతు చేటు చేస్తూ ఉంది. ఉద‌యం లేస్తే కాయ‌గూర‌లు, పాల పాకెట్లు, వాట‌ర్ బాటిళ్లు, ఫుడ్ పార్సెళ్లు, వ‌స్తువుల ప‌ర్సెళ్లు, ఆఖ‌రికి కొబ్బ‌రి నీళ్లు తాగే స్ట్రాలు.. అన్నీ ప్లాస్టిక్ తోనే ముడిప‌డిపోయాయి. ఇర‌వై యేళ్ల నుంచి హెచ్చ‌రిక‌లు జారీ అవుతున్నా, భార‌తీయుల కొనుగోలు శ‌క్తి పెరిగే కొద్దీ వ్య‌ర్థాల స్థాయి కూడా పెరుగోతంది, యే ఏడాదికా ఏడాది రెట్టింపు దిశ‌గా సాగుతూ ఉంది.

ఈ విష‌యం మీద భార‌తీయులు దృష్టి పెట్టుకోక‌పోతే ప‌రిస్థితి మ‌రింత ప్ర‌మాదకరంగా మార‌వ‌చ్చు!

9 Replies to “ఇండియాలో ప్లాస్టిక్ ప‌ర్వ‌తాలు, ఇవి క‌రిగేదెలా!”

  1. చిత్ర గుప్తుడు మనిషి పాపం లెక్క వేసినట్లు, ప్రతి మనిషి జీవిత కాలం లో వాడి పడేసిన ప్లాస్టిక్ లెక్క కూడా రాస్తాడు ఏమో,

    నరకంలో ఆ ప్లాస్టిక్ చెత్తలో కాలుస్తారు ఏమో

    అన్ని దేముళ్ళ కలిసి కామన్ నరకం లో.

Comments are closed.