ర్యాంకులు ఖచ్చితంగా మంత్రులను అవమానించడమే..

మంత్రుల్లో పోటీ తత్వం పెంచడం, పాలనను వేగవంతం చేయడం వంటి చంద్రబాబు లక్ష్యాలు గొప్పవే.

ఒక రాష్ట్రానికి సీఎం అనే పదవికంటే తనను అందరూ రాష్ట్రానికి సీఈఓ హోదాతో గుర్తించాలని ఆరాటపడే తత్వం… ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిది. ఇప్పుడు ఆయన తనను ప్రజలు రాష్ట్రానికి హెడ్‌మాస్టర్ అనే హోదాతో గుర్తించాలని ఆరాటపడుతున్నట్టు కనిపిస్తున్నారు. ఎందుకంటే, స్కూల్లో పిల్లలకు ఇచ్చినట్లుగా తన కేబినెట్‌లోని మంత్రులకు కూడా ర్యాంకులు ఇవ్వాలని ఆయన ఆలోచిస్తున్నారు.

పైపెచ్చు, మంత్రులకు ర్యాంకులు ఇవ్వడం అనేది వారిని కించపరచడానికి, అవమానించడానికి, ఎక్కువ తక్కువలు చేయడానికి కాదని, కేవలం మంత్రుల మధ్య పోటీ తత్వాన్ని పెంచడానికి మాత్రమేనని చంద్రబాబు అంటున్నారు. ఫైల్స్‌ను పరిష్కరించడంలో తన స్థానం కూడా మెరుగుపరచుకోవాల్సి ఉందని ఆయన అంటున్నారు. కానీ ఆయన ఎంత మాటలు చెప్పినా, ఒకసారి ఒకటి-రెండు-మూడు అంటూ ర్యాంకులు ఇవ్వడం మొదలైన తర్వాత, ఖచ్చితంగా మంత్రులకు అవమానాలు కూడా ఉంటాయని ప్రజలు భావిస్తున్నారు.

ర్యాంకుల సిస్టమ్ అనేది విద్యా వ్యవస్థను, విద్యార్థుల్లో అభ్యసన నైపుణ్యాలను సర్వనాశనం చేస్తోందనే ఆరోపణలు చాలాకాలంగా వినిపించాయి. ప్రభుత్వాల్లోనే మార్పు వచ్చి, విద్యార్థులకు ర్యాంకుల స్థానంలో గ్రేడింగ్ సిస్టమ్ మాత్రమే ఉంటుందని ప్రకటించారు. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఒత్తిడికి గురికావడానికి, ఆత్మహత్యలకు ర్యాంకులు ఒక కారణమని భావించి గ్రేడింగ్ విధానం తీసుకువచ్చారు.

ఇప్పుడు చంద్రబాబు ర్యాంకుల విధానాన్ని కేబినెట్‌లోకి తీసుకురావడం ఖచ్చితంగా మంత్రుల మధ్య అవాంఛనీయమైన పోటీని పెంచుతుంది. అవమానాలకు కూడా పలువురిని గురిచేస్తుంది అనే విషయాన్ని ఆయన గుర్తించాలి. ర్యాంకుల బదులుగా గ్రేడింగ్ సిస్టమ్ కొంతమేరకు మెరుగైనదని అనుకోవచ్చు.

మంత్రుల్లో పోటీ తత్వం పెంచడం, పాలనను వేగవంతం చేయడం వంటి చంద్రబాబు లక్ష్యాలు గొప్పవే. కానీ, ఆ లక్ష్యాలను సాధించేందుకు ఆయన అనుసరించే విధానాలు ప్రిమిటివ్‌గా ఉంటున్నాయి. తన ర్యాంకు మెరుగుపరచుకోవాల్సి ఉందని చెప్పే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు చివరి ర్యాంకు వస్తే దాన్ని ప్రకటించగలరా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ర్యాంకుల బదులుగా గ్రేడింగ్ సిస్టమ్ తీసుకువచ్చినా, ఆ వివరాలను బహిరంగంగా ప్రకటించడం ప్రభుత్వ వ్యవస్థకు మేలు చేయదు. ఎవరి గ్రేడింగ్‌ను వారికి మాత్రమే అందజేస్తే మేలు జరుగుతుంది. తాము ఏ గ్రేడ్‌లో ఉన్నామో మంత్రులకు తెలియడం, వారిపై పర్యవేక్షణ ఉన్నదనే విషయం అర్థం కావడం కూడా సరిపోతుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు.

8 Replies to “ర్యాంకులు ఖచ్చితంగా మంత్రులను అవమానించడమే..”

Comments are closed.