విశాఖను పరిపాలనా రాజధాని చేస్తామని వైసీపీ అధినాయకత్వం గత అయిదేళ్లుగా చెబుతూ వచ్చింది. కానీ అది అసలు జరగలేదు. జగన్ ఆలోచన అన్నది కలగానే మిగిలిపోయింది. తాను విశాఖ నుంచే పాలిస్తాను ని జగన్ అనుకున్నారు. మనసులో దాచుకోకుండా జనాలకూ చెప్పారు. రుషికొండ మీద ఉన్న టూరిజం భవనాలను రాజ ప్రాసాదంగా తీర్చిదిద్దారు. ఒకవేళ వైసీపీ గెలిచి ఉంటే క్యాంప్ ఆఫీసు గా రుషికొండ అయి ఉండేది. కానీ విధి విచిత్రం కాబట్టి అనుకున్నది జరగలేదు.
కానీ అనూహ్యంగా అనుకోనిది ఒకటి జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం విశాఖకు తరలివచ్చింది. ఇది ఆరేళ్ళ క్రితమే ఏపీకి రావాల్సి ఉంది. రాజధాని ఎక్కడ అని సాగిన ఊగిసలాటలో అలా వెనక్కి వెళ్ళింది.
అమరావతి రాజధాని అని టీడీపీ ప్రభుత్వం నిర్ధారించినా ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం విశాఖలోనే అన్ని హంగులూ చేర్చాలని చూసింది. ఆ విధంగా రిజర్వ్ బ్యాంక్ రీజనల్ ఆఫీసు కోసం విశాఖలోనే భవనాన్ని సూచించింది. విశాఖలోని వీఎమ్మార్డీయే భవనంలోని అయిదవ అంతస్తులో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారు
తమకు అక్కడ కేటాయించాలని ఆర్బీఐ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ విశాఖ జిల్లా కలెక్టర్ ని కోరడం దానికి ఓకే చేయడం జరిగిపోయాయి. అతి తొందర్లోనే విశాఖలో ఆర్బీఐ రీజనల్ ఆఫీస్ ఉంటుంది. సాధరణంగా రాజధాని ఎక్కడ ఉంటే అక్కడ ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు. కానీ విశాఖలో ఏర్పాటు చేయడం ద్వారా జగన్ కోరికను కొంతలో కొంత అయినా ఆర్బీఐ తీర్చినట్లు అయింది. అయితే ఇపుడు ఏపీలో ప్రభుత్వం మారింది. అమరావతి మన రాజధాని అని టీడీపీ కూటమి స్పష్టంగా చెబుతోంది. దాంతో విశాఖ నుంచి ఆర్బీఐని అమరావతికి తీసుకెళ్ళే చాన్స్ కూడా ఉండొచ్చు అని అంటున్నారు.