ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. దీనికి కారణాలేంటి? ఈ పోస్టుమార్టం కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది. ఎవరి రీజన్స్ వాళ్లు చెబుతున్నారు. అనీల్ కుమార్ యాదవ్ అందులో ఓ కారణాన్ని తెరపైకి తెచ్చారు. మంత్రుల నోటి దూల వల్లనే వైసీపీ ఓడిపోయిందని అభిప్రాయపడ్డారు అనీల్.
“మేం చేసిన పొరపాట్ల వల్ల, అధికారంలో ఉన్నప్పుడు చేసిన రకరకాల పనుల వల్ల మేం ఓడిపోయి ఉండొచ్చు. మంత్రులు నోటి దూల వల్ల ఓడిపోయారని కొందరు చెబుతున్నారు. ఎస్.. నిజంగా మా పొరపాటు ఉంటే మేం సరిదిద్దుకుంటాం.”
ఫలితాల తర్వాత తను అజ్ఞాతంలోకి వెళ్లలేదన్నారు అనీల్. కేవలం ప్రభుత్వానికి కొంత టైమ్ ఇచ్చామని, త్వరలోనే రోడ్లపైకి వస్తామని అన్నారు.
“ప్రజలు తీర్పు ఇచ్చారు. మా తప్పులు సరిదిద్దుకుంటాం, తొందర్లోనే ప్రజలకు అందుబాటులోకి వస్తాను. నేను అజ్ఞాతంలోకి వెళ్లిపోయానని కొంతమంది అంటున్నారు. రిజల్ట్ వచ్చి వారమే అయింది, నేనెక్కడికి పారిపోలేదు. ఫలితాలు వచ్చిన వెంటనే రోడ్డు మీద పడలేం కదా. ప్రభుత్వానికి టైమ్ ఇస్తున్నాను.”
తమ భాష వల్లనే ఓడిపోయామని కొందరు అంటున్నారని, ఇప్పుడు టీడీపీ నేతల భాష కూడా అలానే ఉందని అన్నారు అనీల్ కుమార్. భాష మార్చుకోకపోతే 2029లో టీడీపీ కూడా ఓడిపోతుందని హెచ్చరిస్తున్నారు.
చిన్న వయసులోనే 2సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, అది జగన్ దయ వల్లనే సాధ్యమైందని.. ఎప్పటికీ తను జగన్ వెంటే ఉంటానని క్లారిటీ ఇచ్చారు అనీల్. పవన్ కల్యాణ్ ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని తను అనలేదని ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.