భూముల రేట్లు ఢమాల్

ఒక్కసారిగా విశాఖలో భూముల రేట్లు ఢమాల్ మన్నాయి. దానికి కారణం అందరికీ తెలిసిందే. వైసీపీ హాట్ ఫేవరేట్ సిటీగా విశాఖ ఉంది. మరోసారి గెలిస్తే విశాఖను రాజధానిగా చేసుకుంటామని జగన్ చెప్పారు. దాని కంటే…

ఒక్కసారిగా విశాఖలో భూముల రేట్లు ఢమాల్ మన్నాయి. దానికి కారణం అందరికీ తెలిసిందే. వైసీపీ హాట్ ఫేవరేట్ సిటీగా విశాఖ ఉంది. మరోసారి గెలిస్తే విశాఖను రాజధానిగా చేసుకుంటామని జగన్ చెప్పారు. దాని కంటే ముందు నాలుగేళ్ళుగా విశాఖ పాలనా రాజధాని అవుతుందని ఊరించారు. ఈ పరిణామాలతో విశాఖతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. గజం మీద ఒకేసారి నలభై నుంచి యాభై శాతం ధరలు పెరిగాయి.

విశాఖలోని కీలకమైన ప్రాంతాలుగా ఉన్న ఎంవీపీ కాలనీ, సిరిపురం జంక్షన్, సీతమ్మ ధార, అక్కయ్యపాలెం, దసపల్లా హిల్స్, అక్కయ్యపాలెం వంటి చోటో భూముల ధరలు బాగా పెరుగుతూ వచ్చాయి. గతంలో గజం లక్ష ఉన్న చోట్ల లక్షన్నర దాకా ఎగబాకాయి. కొన్ని చోట్ల అయితే రెండు లక్షల దాకా గజం రేటు ఉన్న సందర్భాలు ఉన్నాయి.

ఎకరా లెక్కన చూస్తే ఒకనాడు విశాఖలోని కీలక ప్రాంతాలలో 60 కోట్ల దాకా ఉండేది వంద కోట్లకు చేరుకుంది. అలా పైపైకి ఎగబాకిన రేట్లు అన్నీ ఇపుడు నేల చూపులు చూస్తున్నాయి. ఇపుడు మళ్లీ యధా తధ పరిస్థితి ఏర్పడుతోంది.

విశాఖతో పాటు దాని పరిసర ప్రాంతాలు అయిన సాగర్ నగర్, భీమిలీ, మధురవాడ, ఎండాడ, రుషికొండ వంటి చోట్ల గజం లక్షన్నర అని చెప్పేవారు. కేవలం వారం రోజుల వ్యవధిలో అది కాస్తా లక్ష రూపాయలకు వచ్చి పడింది. పెందుర్తి సబ్బవరం, ఎలమంచిలి, అనకాపల్లి, విజయనగరం వంటి చోట్ల కూడా ధరలు గణనీయంగా తగ్గాయి.

ఈ పరిణామాన్ని చూసిన రియల్టర్లు తలలు పట్టుకుంటుంటే మధ్యతరగతి వర్గాలు ఉద్యోగస్తులు మాత్రం సంతోషిస్తున్నారు. మా విశాఖకు రాజధాని అక్కరలేదు, హాయిగా ఇలాగే ఉండనీయండి అని అంటున్నారు. ధరలు తగ్గితే ఒక గూడు వేసుకోవచ్చు అన్న వారే ఎక్కువగా ఉన్నారు. రానున్న రోజులలో మరింతగా ధరలు తగ్గడం ఖాయమని అంటున్నారు. రియల్ బూమ్ అన్నది పాలపొంగు మాదిరిగా ఒక్కసారి పడిపోయింది అని అంటున్నారు.

జగన్ కచ్చితంగా గెలుస్తారు అని నమ్మి విశాఖ నుంచి శ్రీకాకుళం దాకా వెంచర్లు భారీగా వేసిన రియల్టర్లకు నిరాశే దక్కుతోంది. ఇందులో వైసీపీకి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. ఇలా అవుతుందని అనుకోలేదని బావురు మంటున్నారు. రాజధాని ఎంత పనిచేసింది అన్నది చాలా మంది మాటగా ఉంది.