సూప‌ర్ సిక్స్ హామీల అమ‌లు కోసం రోడ్డెక్కారు

వాహ‌న‌మిత్ర కింద ఆటో, ట్యాక్సీ డ్రైవ‌ర్ల‌కు సాయం అందించ‌క‌పోవ‌డంతో ఇబ్బందులు ప‌డుతున్నార‌ని వామ‌ప‌క్షాల నేత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా టీడీపీ, జ‌న‌సేన అధినేత‌లు ఇచ్చిన సూప‌ర్‌సిక్స్ హామీల‌ను అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేస్తూ వామ‌ప‌క్షాల నేతృత్వంలో ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ మేర‌కు అనంత‌పురం కలెక్ట‌రేట్‌ను ముట్ట‌డించారు. సీపీఐ, సీపీఎం ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన ఆందోళ‌న కార్య‌క్ర‌మంలో రైతులు, కార్మికులు భారీ సంఖ్య‌లో పాల్గొన్నారు. సూప‌ర్ సిక్స్ హామీల్ని అమ‌లు చేయాల‌ని వారు నిన‌దించారు.

అదే స‌మ‌యంలో విధుల‌కు హాజ‌ర‌య్యేందుకు వ‌చ్చిన క‌లెక్ట‌ర్ వినోద్‌కుమార్ వాహ‌నాన్ని నిర‌స‌న‌కారులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కున్నాయి. చాలా సేపు క‌లెక్ట‌ర్ వాహ‌నాన్ని ముందుకు క‌ద‌ల‌నివ్వ‌లేదు. ఈ సంద‌ర్భంగా పోలీసులు, ఆందోళ‌న‌కారుల మ‌ధ్య తోపులాట, వాగ్వాదం జ‌రిగింది. ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల అమ‌ల్లో జాప్యం ఎందుకుని వామ‌ప‌క్షాల నాయ‌కులు నిల‌దీశారు.

రైతు భ‌రోసా కింద ఏడాదికి రూ.20 వేలు చొప్పున ఇస్తామ‌న్న హామీ ఏమైంద‌ని వారు ప్ర‌శ్నించారు. అలాగే త‌ల్లికి వంద‌నం పథ‌కం కింద ఇంట్లో ఎంత మంది పిల్ల‌లు చ‌దువుకుంటున్నా, అంద‌రికీ ఏడాదికి రూ.అ5 వేలు ఇస్తామ‌ని హామీ ఇచ్చార‌ని, ఆ ప‌థ‌కాన్ని కూడా అట‌కెక్కించార‌ని వామ‌ప‌క్ష నాయ‌కులు విమ‌ర్శించారు.

అలాగే వాహ‌న‌మిత్ర కింద ఆటో, ట్యాక్సీ డ్రైవ‌ర్ల‌కు సాయం అందించ‌క‌పోవ‌డంతో ఇబ్బందులు ప‌డుతున్నార‌ని వామ‌ప‌క్షాల నేత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వం కొలువుదీరి ఆరునెల‌లు దాటినా కీల‌క హామీల అమ‌ల్లో నిర్ల‌క్ష్యం ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని వారు విమ‌ర్శించారు.

7 Replies to “సూప‌ర్ సిక్స్ హామీల అమ‌లు కోసం రోడ్డెక్కారు”

Comments are closed.