విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై నందిగామ ఎస్సీ రిజర్వ్‌డ్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పంతం నెగ్గించుకున్నారు. తాను అనుకున్న అభ్యర్థినే మున్సిపల్ చైర్‌పర్సన్‌గా చేసుకోగలిగారు. నందిగామ మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ వరలక్ష్మి మృతితో ఉప ఎన్నిక వచ్చింది. ఈ నేపథ్యంలో అధికార మార్పిడితో వైసీపీకి చెందిన కొందరు కౌన్సిలర్లు టీడీపీ వైపు వెళ్లారు. ఈ నేపథ్యంలో టీడీపీకి మున్సిపాల్టీని సొంతం చేసుకునే అవకాశం దక్కింది.
ఈ నేపథ్యంలో మున్సిపల్, కార్పొరేషన్లలో ఖాళీ అయిన వివిధ పదవులకు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో నందిగామ మున్సిపాల్టీలో చైర్‌పర్సన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఇక్కడ వైసీపీ నామమాత్రమే అయినా, టీడీపీలో ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కొంత కాలంగా సాగుతున్న ఆధిపత్య పోరు.. ఈ ఎన్నిక పుణ్యమా అని బజార్ను పడ్డాయి.
విజయవాడ ఎంపీ కేశినేని చిన్న ప్రతిపాదించిన మున్సిపల్ 8వ వార్డు సభ్యురాలు శాఖమూరి స్వర్ణలత పేరుతో టీడీపీ బీఫారాన్ని ఎమ్మెల్యేకు టీడీపీ నియోజక వర్గ పరిశీలకుడు కనపర్తి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం అందజేశారు. అందులో స్వర్ణలత పేరు చూసి.. సౌమ్య తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తాను ప్రతిపాదించిన అభ్యర్థి తప్ప, అధిష్టానం పేరుతో మరెవరో చెప్పిన వాళ్లకు మద్దతు ఇచ్చే ప్రశ్నే లేదని వాళ్లిద్దరికి తేల్చి చెప్పారు. దీంతో టీడీపీ అధిష్టానం ఖంగుతింది.
సౌమ్యతో మాట్లాడేందుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రయత్నించగా కాల్‌ను రిసీవ్ చేసుకోలేదు. దీంతో మరొకరికి ఫోన్ చేసి ఎమ్మెల్యే సౌమ్యతో మాట్లాడాల్సి వచ్చింది. ఇది అధిష్టానం ఆదేశం అని చెప్పినా, ఆమె ఖాతరు చేయలేదు. ఇదే సందర్భంలో లోకేశ్ వ్యక్తిగత కార్యదర్శి కిలారి రాజేష్ ఫోన్ చేసినా ఆమె పట్టించుకోలేదు. నందిగామ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎవరుండాలో తానే నిర్ణయిస్తానని, మరొకరిని ఒప్పుకునే ప్రశ్నే లేదని ఆమె తెగేసి చెప్పారు.
దీంతో మంత్రి నారాయణ రంగంలోకి దిగి, చివరికి మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికను ఆమె ఇష్టానికి వదిలేశారు. సౌమ్య ప్రకటించే అభ్యర్థే చైర్‌పర్సన్ అవుతారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నిన్న కోరం లేక వాయిదా పడిన ఎన్నిక ఇవాళ జరిగింది. విజయవాడ ఎంపీ ప్రతిపాదించిన స్వర్ణలతకు బదులు, మండవ కృష్ణకుమారిని సౌమ్య అభ్యర్థిగా నిలిపి గెలిపించుకోవడం విశేషం. దీంతో విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి పరాభవం ఎదురైందన్న చర్చకు తెరలేచింది. మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నిక పక్కకు పోయి, ఎంపీ, ఎమ్మెల్యే మధ్య పోరుగా జనం చూసే పరిస్థితి. ఈ పోరులో చివరికి ఎమ్మెల్యే సౌమ్యే గెలుపొందారని ఆమె అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు.
TDP party lo oka Mahila MLA ganatha. Ade mana YSRCP lo uuhinchgalama??
Nine, three, eight, zero, five, three, seven, seven, four, seven nvc