అసెంబ్లీ సాక్షిగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అభాసుపాలైంది. గవర్నర్ ఎస్.అబ్దుల్‌నజీర్‌ను అవమానించారంటూ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించడంపై వైసీపీ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ప్రజాపద్ధుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగాన్ని అవహేళన చేసేలా న్యాయమూర్తులు, ఎన్నికల కమిషనర్లు, రాష్ట్ర గవర్నర్లతో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. అలాగే గవర్నర్ అసెంబ్లీలోకి ప్రవేశించేటప్పుడు సభ్యులంతా సమయపాలన పాటించాలని, రాష్ట్రపతిని పార్లమెంట్‌లోకి తీసుకెళ్లిన విధంగానే గవర్నర్‌ను కూడా మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్, ముఖ్యమంత్రి కలిసి స్వాగతం పలకాలన్నారు.
కానీ ఈ ప్రభుత్వం మాత్రం గవర్నర్‌ను స్పీకర్ చాంబర్‌లో కూచోపెట్టి సీఎం కోసం వేచి వుండేలా చేసిందని విమర్శించడంపై వైసీపీ ఘాటుగా స్పందించింది. పయ్యావుల కేశవ్ పచ్చి అబద్ధాలు చెప్పారంటూ వైసీపీ ఇవాళ అసెంబ్లీలో తిప్పికొట్టింది. గవర్నర్‌ను తమ ప్రభుత్వం అవమానించలేదని, దగ్గరుండి సీఎం ఆహ్వానించారని ఆధారాలతో సహా నిరూపించడం గమనార్హం. ఈ మేరకు అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తనదైన శైలిలో టీడీపీ ఎమ్మెల్యే ఆరోపణల్ని బలంగా తిప్పి కొట్టారు.
స్పీకర్ తమ్మినేని సీతారాం అనుమతితో గవర్నర్‌కు సీఎం స్వాగతం పలికిన తీరుకు సంబంధించి వీడియోను ప్రదర్శించి రాష్ట్ర ప్రజానీకానికి వాస్తవం ఏంటో కళ్లకు కట్టారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చలో బుగ్గన మాట్లాడుతూ, గవర్నర్ ప్రసంగంపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోందన్నారు. టీడీపీవి అన్నీ తప్పుడు ఆరోపణలని ధ్వజమెత్తారు. గవర్నర్‌కు తాము ఇచ్చినంత మర్యాద ఎవరూ ఇవ్వలేదని బుగ్గన వివరించారు.
గవర్నర్ పట్ల గౌరవ సభ పట్ల అమర్యాదగా ప్రవరిస్తున్నారని, టీడీపీ తన వక్రబుద్ధిని మార్చుకోవాలని మంత్రి హితవు పలికారు. పయ్యావుల కేశవ్ అవాస్తవ ప్రచారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి బుగ్గన విజ్ఞప్తి చేశారు. ఎల్లో మీడియా కూడా బాధ్యతారహితంగా వార్తలు రాసిందని మండిపడ్డారు. టీడీపీ వ్యవహారశైలి సభా హక్కుల ఉల్లంఘనే అని ఆయన స్పష్టం చేశారు. అలాగే తప్పుడు ఆరోపణలు చేసినవారితో పాటు అవాస్తవాలు ప్రచురించిన వారిపైనా తీవ్ర చర్యలు తీసుకోవాలని స్సీకర్‌కు మంత్రి బుగ్గన విజ్ఞప్తి చేశారు. అసత్య ప్రచారాలపై ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయాలని ఆయన కోరారు.