చివరిగా పెండింగ్‌లో ఉన్న ఏకైక అసెంబ్లీ స్థానానికి జనసేన అభ్యర్థిని ప్రకటించింది. అది కూడా తన మిత్రపక్షమైన టీడీపీ నాయకుడిని చేర్చుకుని, అతనికే టికెట్ ఇచ్చి, తనకు కేటాయించిన 21 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటనను పవన్‌కల్యాణ్ దిగ్విజయంగా పూర్తి చేశారు.
శ్రీకాకుళం జిల్లా పాలకొండ (ఎస్టీ) అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణను అభ్యర్థిగా జనసేన ప్రకటించింది. ఈ స్థానానికి అభ్యర్థి ఎంపిక విషయంలో పవన్‌కల్యాణ్ తనదైన రీతిలో సినిమా నాటకీయతను ప్రదర్శించారు. గత రెండు ఎన్నికల్లో నిమ్మక జయకృష్ణ టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఎటూ ఓడిపోయే సీటు కావడంతో ఆ సీటును చంద్రబాబునాయుడు వ్యూహాత్మకంగా జనసేనకు కేటాయించారు.
ఈ నేపథ్యంలో టీడీపీ ఇన్‌చార్జ్ జయకృష్ణను ఇటీవల జనసేనలో చేర్చుకున్నారు. అయితే వెంటనే పాలకొండ అభ్యర్థిగా ప్రకటిస్తే, వ్యతిరేకత వస్తుందని సర్వే నాటకానికి పవన్‌కల్యాణ్ తెరలేపారు. జయకృష్ణకే టికెట్ ఇస్తారని లోకమంతా కోడై కూసింది. అయినప్పటికీ ఐవీఆర్ఎస్ సర్వే పేరుతో ఒక వారం సినిమాను రక్తి కట్టించారు. నామినేషన్లకు గడువు దగ్గర పడుతుండడం, మరోవైపు ఇక ప్రకటించాల్సింది ఒకే ఒక్క సీటు కావడంతో, జాప్యం చేయడం బాగా లేదని పవన్ సినిమాకు తెరదించారు.
ఎట్టకేలకు సర్వేలో జయకృష్ణకు బాగున్నట్టు చెప్పి, టీడీపీ నుంచి వచ్చిన ఆయనకే టికెట్ కట్టబెట్టారు. దీంతో ఒక పనై పోయింది బాబూ అని పవన్ చేతులు దులుపుకున్నారు. టీడీపీ నాయకుడికి టికెట్ ఇవ్వడంపై స్థానిక జనసేన నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.