ఆ పనిచేయకుండా.. జగన్ ను నిందిస్తే ఎలా?

ముఖ్యమంత్రి కార్యాలయానికి, నివాసానికి ప్రభుత్వం ఫర్నిచర్ కొనడం, మరమ్మతులకోసం చాలా మామూలు సంగతి. కోడెల శివప్రసాద్ వ్యవహారంతో పోలుస్తూ జగన్మోహన్ రెడ్డి.. ప్రభుత్వం యొక్క ఫర్నిచర్ కాజేయడానికి చూస్తున్నట్టుగా.. ఆయనను బద్నాం చేయడానికి తెలుగుదేశం…

ముఖ్యమంత్రి కార్యాలయానికి, నివాసానికి ప్రభుత్వం ఫర్నిచర్ కొనడం, మరమ్మతులకోసం చాలా మామూలు సంగతి. కోడెల శివప్రసాద్ వ్యవహారంతో పోలుస్తూ జగన్మోహన్ రెడ్డి.. ప్రభుత్వం యొక్క ఫర్నిచర్ కాజేయడానికి చూస్తున్నట్టుగా.. ఆయనను బద్నాం చేయడానికి తెలుగుదేశం నాయకులు చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అడ్డగోలుగా అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. జగన్ మీద కేసులు పెట్టాలని కోడెల కొడుకు శివరామ్ ఆరోపణల్లోనే అర్థం లేదనుకుంటే మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా అదే పాట పాడుతున్నారు.

కోడెల చేసిన తప్పు వేరు. హైదరాబాదు నుంచి అమరావతి అసెంబ్లీకి తరలి వెళ్లవలసిన ప్రభుత్వ ఫర్నిచర్ ను మద్యలో తన కొడుకు శివరామ్ మోటారుసైకిళ్ల షోరూంలో దించేసుకున్నారు. అది ఖచ్చితంగా  ప్రభుత్వ ఫర్నిచర్ ను దొంగిలంచడమే అవుతుంది. దొరికేదాకా దొరే అన్న సామెత చందంగా.. వైసీపీ ప్రభుత్వం వచ్చేవరకు అనుభవించారు. ఆ తర్వాత తమ దొంగపని బయటపడుతుందనే భయంతో ప్రభుత్వానికి లేఖరాశారు. ఫర్నిచర్ తీసుకు వెళ్లమని అన్నారు. అసలు అక్కడ ఆ ఫర్నిచర్ ఉండడమే తప్పు. నరసరావుపేటలోని ఆయన నివాసం లేదా కొడుకు దుకాణం కోసం చేయించిన ఫర్నిచర్ కాదు అది. అలా ఇరుక్కున్నారు.

కానీ జగన్ సంగతి వేరు. ముఖ్యమంత్రి నివాసం కోసం చేయించిన ఫర్నిచర్ అది. ఒకవేళ వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవడమే నిబంధనల ప్రకారం సరైన చర్య అయితే.. అందుకు ఖచ్చితమైన ప్రొసీజర్ ఒకటి ఉంటుంది. ఆ వ్యవహారాలు చూసే ప్రభుత్వ శాఖలు జగన్ కు లేఖ రాయాల్సి ఉంటుంది. ఫర్నిచర్ ను అప్పగించాలని, ప్రభుత్వం తీసుకువెళుతుందని రాయాలి. అందుకు ఆయన అడ్డుపడితే తప్పు. ఫర్నిచర్ తీసుకువెళ్లకుండా వ్యతిరేకిస్తే ఆయనమీద నిందలేయడం ఓకే. కానీ.. ప్రొసీజర్ ఫాలో కాకుండానే.. జగన్ మీద నిందలు వేయడం సబబు కాదు అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

మరీ ఫర్నిచర్ కోసం ఆశపడినట్టుగా మాజీ ముఖ్యమంత్రి జగన్ మీద ఆరోపణలు చేయడం అనేది.. కేవలం తెదేపా కుట్ర అంటున్నారు. ఇలాంటి నిందలకు వీలుగా.. ప్రభుత్వం తరఫున ఇంకా ఫర్నిచర్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభించకుండా ఈలోగా జగన్ ను బద్నాం చేయాలని చూస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు.