మోడీ కోసం అంతా పోటీ!

గతంలో వైసీపీ నేతలు మోడీ సభను విజయవంతం చేసినా, కేంద్రం నుంచి పెద్దగా ప్రాజెక్టులు లేదా వరాలు దక్కలేదు.

రెండున్నరేళ్ల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నం వచ్చినప్పుడు, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏయూ గ్రౌండ్స్‌లో భారీ సభను ఏర్పాటు చేశారు. ఆ సభకు సుమారు యాభై వేల మంది ప్రజలు హాజరయ్యారు. ఆ సమయంలో అది పెద్ద సభగా గుర్తింపు పొందింది.

మోడీ సభ అని ప్రకటించినా, ఆ సభను విజయవంతం చేయడంలో బీజేపీ కంటే వైసీపీ నాయకులే ఎక్కువ కృషి చేశారు. అధికారంలో ఉండటంతో పాటు ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో, వైసీపీ ఆ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మోడీ సభ విజయవంతం కావడంతో ప్రధాని కళ్లలో ఆనందాన్ని ఆ రోజు వైసీపీ నాయకులు చూశారు.

ఇప్పుడేమో, టీడీపీ కూటమి అధికారంలో ఉంది. బీజేపీ కూడా ఈ కూటమిలో భాగమే. మోడీ సభను నిర్వహించే బాధ్యత టీడీపీ తీసుకుంది. జనసేన, బీజేపీ కూడా సహకరిస్తున్నాయి.

ఈసారి కూడా ఏయూ గ్రౌండ్స్‌లోనే మోడీ సభను నిర్వహిస్తున్నారు. గతంలో జగన్ నాయకత్వంలో నిర్వహించిన సభ కంటే నాలుగింతలు పెద్ద జనసమూహాన్ని తీసుకురావాలని కూటమి పెద్దలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈసారి సభకు రెండు లక్షల మందికిపైగా హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అయితే ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్ పరిమితి యాభై వేలు మాత్రమే కావడంతో, ఎక్కువ మంది ఎలా హాజరుకాబోతున్నారు అన్నది ప్రశ్నగా ఉంది.

గతంలో వైసీపీ నేతలు మోడీ సభను విజయవంతం చేసినా, కేంద్రం నుంచి పెద్దగా ప్రాజెక్టులు లేదా వరాలు దక్కలేదు. ఇప్పుడు టీడీపీ కూటమి మరింత పెద్దసభను నిర్వహించినా, మోడీ విశాఖ ఉక్కు పరిశ్రమ సమస్యతో పాటు ఇతర కీలక అంశాలపై ప్రకటనలు చేయకపోతే సభ గ్రాండ్ సక్సెస్ అయినట్లు కాదని ప్రజా సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.

3 Replies to “మోడీ కోసం అంతా పోటీ!”

Comments are closed.