విజయసాయి వారికి మంచివారు అయిపోయారా?

రాజకీయాల నుంచి వైదొలగినా విజయసాయిరెడ్డి చేసిన భూ అక్రమాల మీద విచారణ జరిపించాలని గతంలో టీడీపీ నేతలు అన్నారు.

విజయసాయిరెడ్డి. వైసీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన పేరు చెబితేనే విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు దిగ్గున లేచి విమర్శలు సంధించేవారు. ఆయన భూకబ్జాలకు పాల్పడ్డారు అని ఆయన విశాఖలో ఎన్నో అక్రమాలు చేశారని విరుచుకుపడేవారు.

అయితే ఇటీవల కాకినాడ పోర్టు కేసు విషయంలో విజయసాయిరెడ్డి సీఐడీ ముందుకు వచ్చి విచారణకు హాజరై మీడియా ముందు చేసిన సంచలన కామెంట్స్ వైసీపీని ఇరుకున పెట్టాయి. విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి దూరం అవుతారని భావించిన వారికి షాక్ తినిపించాయి. పైగా ఆయన వైసీపీని కార్నర్ చేయడం టీడీపీ తమ్ముళ్ళకు ఆనందాన్ని ఇస్తోందిలా ఉంది.

అందుకే ఆయనను వెనకేసుకుని వస్తున్నారు. విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అయితే దీని మీద మాట్లాడుతూ జగన్ కోసం ఆయన పదహారు నెలలు జైలు జీవితాన్ని అనుభవించారని సానుభూతిని వ్యక్తం చేయడం విశేషం. జగన్ చెప్పినదల్లా చేసి ఆయనకు ఎంతో సహకరించిన విజయసాయిరెడ్డిని పక్కన పెట్టేశారని గంటా అంటున్నారు.

ఇపుడు విజయసాయిరెడ్డ్డికి చంద్రబాబు మీద ప్రేమ కలిగింది అని వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం తప్పు అన్నారు. విజయసాయిరెడ్డికి జగన్ మీద ద్వేషం కలిగిందని మనసు విరిగిపోయిందని ఆయనే చెప్పినా దానిని వైసీపీ నేతలు వక్రీకరిస్తున్నారని గంటా మండిపడ్డారు. ఎవరినీ నమ్మకుండా ఉన్న జగన్ చివరికి ఒంటరిగా రాజకీయ ఏకాకిగా మారిపోతారని గంటా జోస్యం చెప్పారు.

విజయసాయిరెడ్డికి చంద్రబాబు మీద ప్రేమ పుట్టలేదని గంటా అంటున్నది నిజమే అనుకున్నా ఆయన మీద టీడీపీ నేతలకు సానుభూతి పుట్టడమే విశేషమని వైసీపీ నేతలు అంటున్నారు. రాజకీయాల్లో ఎదుటి వారి ప్రత్యర్ధులు తమకు మిత్రులు అన్న సూత్రం పనిచేస్తూ ఉంటుంది. విజయసాయిరెడ్డి ఇపుడు వైసీపీకి జగన్ కి దూరం అయ్యారు కాబట్టి టీడీపీకి ఆయన మంచివారుగా కనిపించవచ్చు అని వైసీపీ నేతలు అంటున్నారు. రాజకీయాల నుంచి వైదొలగినా విజయసాయిరెడ్డి చేసిన భూ అక్రమాల మీద విచారణ జరిపించాలని గతంలో టీడీపీ నేతలు అన్నారు. అదే విధంగా ఆయన మీద విచారణలు ఉంటాయా లేదా అన్నది ముందు ముందు తెలుస్తుందని అంటున్నారు.

4 Replies to “విజయసాయి వారికి మంచివారు అయిపోయారా?”

Comments are closed.