గిరిజనం ఆవేశం ఎలా ఉంటుందో తెలుగుదేశం పార్టీ చూస్తోందా అంటే జవాబు అవును అనే వస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ టీడీపీలో మంటలు చెలరేగుతున్నాయి. పాడేరు నుంచి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను అని తెలుగుదేశం పార్టీకి సవాల్ విసిరారు.
ఇప్పుడు అరకు విషయానికి వస్తే పార్టీ టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి నోటి కాడ ముద్ద లాక్కుందని దొన్ను దొర మండిపోతున్నారు. ఆయన ఆత్మీయ సమావేశం పెడితే ఇండిపెండెంట్ గా పోటీ చేయమని అంతా కోరారు. ఈ సందర్భంగా దొన్ను దొర టీడీపీ హై కమాండ్ మీద ఆగ్రహావేశాలను ప్రదర్శించారు. నన్ను ఎవరైనా మోసం చేస్తే సహించేది లేదు అంటూ ఫైర్ అయ్యారు. అలాంటపుడు తాను చంపడానికైనా లేక చావడానికైనా సిద్ధమని ఆయన తీవ్ర స్వరంతో హెచ్చరించారు.
చంద్రబాబు ఎమ్మెల్సీ ఇస్తామని అన్నారని, ఎవరిని నమ్మించడానికి అని ఆయన ప్రశ్నించారు. ఆ హామీని నమ్మవద్దు అని కార్యకర్తలే తీర్మానించారు అంటే దీనిని టీడీపీ పెద్దలు అర్ధం చేసుకోవాలని ఆయన అన్నారు. తాను ఏమిటి అన్నది పోటికి దిగాక టీడీపీ పెద్దలకు తెలిసి వస్తుందని అన్నారు.
అరకు అసెంబ్లీ టికెట్ ని బీజేపీకి కేటాయించారు. దాంతో దొన్ను దొర రగిలిపోతున్నారు. బీజేపీని ఓడిస్తానని ఆయన శపధం పట్టారు. దొన్ను దొర ఆగ్రహం చూసిన వారు టీడీపీకి అరకులో ఇబ్బందే అంటున్నారు. బీజేపీకి అయితే మద్దతు డౌట్ అని అంటున్నారు. ఈ పరిణామాలు అన్నీ చూస్తే అరకు, పాడేరు రెండూ వైసీపీ తిరుగులేని ఆధిక్యతతో గెలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.