ఏపీలో ఎన్నికలు సవ్యంగా నిర్వహించాలంటే ఉన్న అధికారులను తప్పించమంటున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ విపక్షం మీద మండిపడ్డారు. బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి అయితే ఐఎఎస్, ఐపిఎస్లపైన ఈసీకి లెటర్లు రాస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు.
ఎన్నికలు సజవుగా సాగాలంటే ఎవరిని పెడితే మీకు సంతృప్తిగా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. పోనీ మీరు కోరుకున్నట్లుగా హెరిటేజ్ సంస్థ మేనేజర్లను పెట్టి ఎన్నికలు నిర్వహించాలా అని ఆయన ప్రశ్నించారు. హెరిటేజ్చంద్రబాబుది కాబట్టి బాగా ఎన్నికలు నిర్వహిస్తారేమో అని ఆయన సెటైర్లు వేశారు.
గెలిచేందుకు దారి తెలియక తమ పాలన గురించి చెప్పుకునేందుకు ఏమీ లేక జగన్ ని తిట్టడానికే చంద్రబాబు మీటింగులు ఏర్పాటు చేస్తున్నారు అని బొత్స విమర్శించారు. వైసీపీకి అనుకూల వాతావరణం ఉందని ఆయన అన్నారు.
ఆ సంగతి తెలిసే విపక్ష కూటమి విష ప్రచారం మొదలెట్టిందని అన్నారు. ఇదిలా ఉంటే విజయనగరంలో జరిగిన పార్టీ మీటింగులో బొత్స మాట్లాడుతూ ఏ ఒక్క కార్యకర్త నిర్లక్ష్యంగా ఉండరాదని హితవు పలికారు. మీరు ఈ నెల రోజులు కష్టపడితే మరోమారు వైసీపీ అధికారంలోకి వస్తుందని అన్నారు.
ఆ మీదట రానున్న అయిదేళ్లలో కష్టపడిన ప్రతీ వారినీ గుర్తించి పార్టీ తగిన న్యాయం చేస్తుందని అన్నారు. చంద్రబాబు మాదిరిగా జగన్ పేజీలకు పేజీలు హామీలు ఇవ్వరని తాను చెప్పాల్సినవి చేయాల్సినవి తెలుసుకుని ఆయన హామీలు ఇస్తారని అన్నారు. చంద్రబాబు ఇచ్చే హామీలు ఏవీ అమలు చేయరు కాబట్టి ఎన్ని అయినా చెబుతారు అని బొత్స ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చి ఓట్లు అడుగుతున్న పార్టీ దేశంలో వైసీపీ ఒక్కటేనని ఆయన అన్నారు.