టీడీపీ న‌గ‌ర అధ్య‌క్షుడిపై దాడి.. నోరు మెద‌ప‌రేం?

కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌పై య‌థేచ్ఛ‌గా దాడికి పాల్ప‌డ్డారు. పోలీసులు ప్రేక్ష‌క‌పాత్ర పోషించారు. చాలా చోట్ల క‌నీసం ఫిర్యాదులు తీసుకోడానికి కూడా పోలీసులు భ‌య‌ప‌డ్డారు. అయితే కాలం…

కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌పై య‌థేచ్ఛ‌గా దాడికి పాల్ప‌డ్డారు. పోలీసులు ప్రేక్ష‌క‌పాత్ర పోషించారు. చాలా చోట్ల క‌నీసం ఫిర్యాదులు తీసుకోడానికి కూడా పోలీసులు భ‌య‌ప‌డ్డారు. అయితే కాలం గ‌డిచేకొద్ది కూట‌మిలోనే గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయి. అప‌రిమిత‌మైన అధికారాన్ని ద‌క్కించుకున్న కూట‌మికి భ‌యం, భ‌క్తి లేకుండా పోయాయ‌న్న విమ‌ర్శ వెల్లువెత్తుతోంది.

అందువ‌ల్లే చివ‌రికి సొంత పార్టీ నాయకుల్ని చంపేందుకు కూడా వెనుకాడ‌డం లేద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఈ ప‌రంప‌ర‌లో టీడీపీ క‌డ‌ప న‌గ‌ర అధ్య‌క్షుడు సాన‌పురెడ్డి శివ‌కొండారెడ్డిపై హ‌త్యాయ‌త్నం తీవ్ర సంచ‌ల‌నం రేకెత్తించింది. అధికారంలో ఉన్న త‌మ‌పై ఇలాంటి దాడిని క‌ల‌లో కూడా ఊహించ‌లేద‌ని శివ‌కొండారెడ్డితో పాటు ఆ పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కులు వాపోతున్నారు. దోషుల్ని క‌ఠినంగా శిక్షించాల‌ని శివ‌కొండారెడ్డితో పాటు సీనియ‌ర్ నాయ‌కులు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

కొండారెడ్డిపై దాడి జ‌రిగి రెండు రోజులు గ‌డిచినా ఇంత వ‌ర‌కూ నిందితులెవ‌రో పోలీసులు గుర్తించ‌క‌పోవ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. మ‌రోవైపు క‌డ‌ప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న శివ‌కొండారెడ్డిని వైసీపీ జిల్లా అధ్య‌క్షుడు పి.ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్య‌మంత్రి అంజాద్‌బాషా ప‌రామ‌ర్శించి, త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. క‌డ‌ప న‌గ‌రంలో ఇలాంటి దాడుల్ని ఎంత మాత్రం స‌హించ‌మ‌ని వారు అన్నారు.

మ‌రోవైపు శివ‌కొండారెడ్డిని టీడీపీ జిల్లా అధ్య‌క్షుడు ఆర్‌.శ్రీ‌నివాస్‌రెడ్డి, క‌డ‌ప ఎమ్మెల్యే ఆర్‌.మాధ‌వీరెడ్డి ప‌రామ‌ర్శించ‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. క‌నీసం దాడిని ఖండించ‌క‌పోవ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. అందుకే నిందితుల్ని ప‌ట్టుకోవ‌డంలో జాప్యంపై టీడీపీ నేత‌లు గుర్రుగా ఉన్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు ప్ర‌భుత్వంతో పాటు టీడీపీ శ్రేణుల‌కు చెడు సంకేతాల్ని తీసుకెళ్తుంద‌ని వారు వాపోతున్నారు. ఇప్ప‌టికైనా న‌గ‌ర అధ్య‌క్షుడిపై దాడికి పాల్ప‌డిన దుండ‌గుల్ని అదుపులోకి తీసుకుని, ఎందుకు చేయాల్సి వ‌చ్చిందో లోకానికి తెలియ‌జేయాల్సిన అవ‌స‌రం వుంది.

2 Replies to “టీడీపీ న‌గ‌ర అధ్య‌క్షుడిపై దాడి.. నోరు మెద‌ప‌రేం?”

Comments are closed.