ఆళ్ల‌గ‌డ్డ రూర‌ల్ ఎస్ఐ వేధింపుల‌తో చ‌చ్చిపోతున్నా..!

ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ‌గా వుండాల్సిన పోలీసులే, భ‌క్ష‌కులుగా మారితే… చావు త‌ప్ప మ‌రో గ‌త్యంత‌రం ఏముంటుంది?

ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ‌గా వుండాల్సిన పోలీసులే, భ‌క్ష‌కులుగా మారితే… చావు త‌ప్ప మ‌రో గ‌త్యంత‌రం ఏముంటుంది? ఆళ్ల‌గ‌డ్డ‌లో ఓ ట్రాక్ట‌ర్ య‌జ‌మాని, డ్రైవ‌ర్ కూడా అత‌నే అయిన ఓ వ్య‌క్తి ఆత్మ‌హ‌త్యా య‌త్నానికి ముందు సెల్ఫీ వీడియోలో ఆళ్ల‌గ‌డ్డ రూర‌ల్ ఎస్ఐ హ‌రిప్ర‌సాద్ త‌న‌ను ఏ రకంగా వేధించారో క‌ళ్ల‌కు క‌ట్టారు. త‌న కుమారుడు అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో ఉన్నాడ‌ని, డ‌బ్బు అవ‌స‌ర‌మ‌ని, డిమాండ్ చేస్తున్నంత సొమ్ము త‌న వ‌ద్ద లేద‌ని ఎస్ఐని వేడుకున్నా స్పందించ‌లేద‌ని క‌న్నీళ్లప‌ర్యంత‌మ‌య్యారు.

ఆ వీడియోలో హెచ్చ‌రించిన‌ట్టుగానే… బాధితుడైన చెన్నంరాజుప‌ల్లెకు ఎన్‌.ర‌వీంద్ర ట్రాక్ట‌ర్‌ను లోన్‌లో తెచ్చుకున్నాడు. ఇసుకను బాడుగ‌కు తోలుకుంటూ జీవ‌నం సాగిస్తున్నాడు. అలాంటి వ్య‌క్తిని రూ.20 వేలు ఇవ్వాల‌ని, త‌న ప‌రిధే కాన‌టువంటి చాగ‌ల‌మ‌ర్రి టోల్‌గేటు వ‌ద్ద ఆళ్ల‌గ‌డ్డ రూర‌ల్ ఎస్ఐ అమాన‌వీయంగా ప్ర‌వ‌ర్తించడంతో… చివ‌రికి బాధితుడైన‌ ఎన్‌.ర‌వీంద్ర విష ద్రావ‌ణం తీసుకున్నాడు. ప్ర‌స్తుతం చావుబ‌తుకుల మ‌ధ్య వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ప్ర‌భుత్వాస్ప‌త్రిలో అత‌ను చికిత్స పొందుతున్నాడు. బాధితుడు విడుద‌ల చేసిన వీడియోలో ఏం చెప్పాడంటే…

“ఆళ్ల‌గ‌డ్డ‌కు ప్ర‌వేశించే మార్గంలో చాగ‌ల‌మ‌ర్రి టోల్‌గేట్ వ‌ద్ద ఇసుక ట్రాక్ట‌ర్‌ను ఎస్ఐ ఆపాడు. నన్ను డ‌బ్బు అడిగాడు. కానీ నా ద‌గ్గ‌ర డ‌బ్బు లేదు. పిల్లోనికి బాగ‌లేక‌పోతే ఇసుక లోడ్ ఎత్తుకుని వ‌చ్చాను. అందుకు రూ.5 వేలు వ‌స్తుంది. అన్‌లోడ్ చేసుకొచ్చి డ‌బ్బు ఇస్తాన‌ని చెప్పినా ఎస్ఐ విన‌లేదు. అన్‌లోడ్ పాయింట్ ద‌గ్గ‌రికొచ్చి, ట్రాక్ట‌ర్‌ను పోలీస్‌స్టేష‌న్‌కు తీసుకునిపోయినాడు. రూ.20 వేలు ఇవ్వాల‌ని డిమాండ్ చేశాడు. అయితే రూ.10 వేలు ఫోన్ పేలో పంపాను.

పిల్లోనికి ఫిట్స్ వ‌చ్చి, ఆస్ప‌త్రిలో చేర్పించాన‌ని చెప్పినా ఎస్ఐ విన‌లేదు. పోలీస్‌స్టేష‌న్ ద‌గ్గ‌రికి వెళ్లే స‌రికి క‌నీసం తిండికి రూ.500 కూడా లేదు. ఎస్ఐ మాత్రం కేసు క‌ట్టేదే అని చెప్పినాడు. ఎవ‌రితో ఫోన్ చేయించినా, వేడుకున్నా ఎస్ఐ వినిపించుకోలేదు. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, లోకేశ్‌, చంద్ర‌బాబు సార్ ఎవ‌రికీ నాలా అన్యాయం జ‌ర‌గ‌కూడ‌దు. నాకైతే న్యాయం జ‌ర‌గాలి. మెడిక‌ల్ లిస్ట్ చూపినా ఎస్ఐ వినిపించుకోలేదు. నా చావుకు కార‌ణం ఆళ్ల‌గ‌డ్డ రూర‌ల్ ఎస్ఐ హ‌రిప్ర‌సాద్ సారే” అని అత‌ను సూసైడ్ వీడియో విడుద‌ల చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

3 Replies to “ఆళ్ల‌గ‌డ్డ రూర‌ల్ ఎస్ఐ వేధింపుల‌తో చ‌చ్చిపోతున్నా..!”

Comments are closed.