వర్మ తప్ప.. త్యాగరాజులందరికీ ఫలం దక్కింది!

చంద్రబాబు నుంచి వరం పొందిన ‘పిఠాపురం త్యాగరాజు’ వర్మకు మాత్రం ఇప్పటిదాకా ఎలాంటి త్యాగఫలం దక్కనేలేదు.

2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవడానికి వీల్లేదని కంకణం కట్టుకోబట్టి.. ఇతర పార్టీలన్నీ ఒకటే జట్టుగా ఏర్పడ్డాయి. అలా మూడు పార్టీలు కూటమిగా ఏర్పడడం వలన అనివార్యమైన పరిస్థితుల్లో ఆయా పార్టీల నాయకులు అనేకమంది కొన్ని కొన్ని త్యాగాలు చేయవలసి వచ్చింది. వారి వ్యూహం ఫలించి, మొత్తానికి కూటమి అధికారంలోకి వచ్చింది.

త్యాగాలు చేసిన నాయకులకు ప్రభుత్వపరంగా ఇతర అవకాశాలుకల్పిస్తూ వస్తున్నారు. అనేక మంది త్యాగరాజులు ఇప్పటికే ఇతర పదవులను దక్కించుకుని హోదాలను అనుభవిస్తున్నారు. అయితే.. చిత్రం ఏమిటంటే.. చంద్రబాబునాయుడు నుంచి ప్రత్యేకంగా వరం పొందిన ‘పిఠాపురం త్యాగరాజు’ వర్మకు మాత్రం ఇప్పటిదాకా ఎలాంటి త్యాగఫలం దక్కనేలేదు.

నిజానికి పొత్తులు కుదరడానికి అత్యంత కీలకమైన త్యాగం పిఠాపురం వర్మదే అని చెప్పాలి. 2019 ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో పోటీచేసి ఓడిపోయిన పవన్ కల్యాణ్ 2024 లో ఎక్కడినుంచి పోటీచేస్తారనే సంగతిని.. నామినేషన్ల పర్వం వచ్చేదాకా తేల్చనేలేదు. సంకేతాలు కూడా ఇవ్వలేదు. అసలు ఈ పార్టీల మధ్య పొత్తులు కూడా కుదురుతాయా? లేదా? అనేవిధంగానే చివరి వరకు పరిస్థితి సాగుతూ వచ్చింది.

అలాంటి నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలో అయిదేళ్ల పాటూ తాము అధికారంలో లేకపోయినా సరే.. తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ వచ్చిన నాయకుడు వర్మ మాత్రమే. అందుకు ఆయన ఎన్ని కష్ట నష్టాలు ఓర్చుకున్నారో ఆయనకు, చంద్రబాబుకు కూడా బాగా తెలుసు! ఎమ్మెల్యేగా పోటీచేయడానికి ఆయన అన్ని రకాలుగానూ సిద్ధం అయ్యారు.

అయితే పవన్ కల్యాణ్ చిట్టచివరి నిమిషంలో తాను పిఠాపురం నుంచి బరిలో ఉంటానని ప్రకటించారు. అప్పటిదాకా ఆ నియోజకవర్గంలో జనసేన తరఫున ఎమ్మెల్యేగా పోటీచేయడానికి రంగం సిద్ధం చేసుకున్న తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ను పవన్ కాకినాడ పార్లమెంటుకు పంపారు. ఆ రకంగా పవన్ కోసం త్యాగం చేసిన తంగెళ్లకు మరో వరం దక్కింది.

పిఠాపురం వర్మ ఇండిపెండెంటుగా చేయాలనుకోగా, చంద్రబాబు ప్రత్యేకంగా పిలిపించి.. గెలిచిన తర్వాత.. మొదటి ఎమ్మెల్సీని చేస్తానని నమ్మబలికి పవన్ కోసం పనిచేసేలా ప్రేరేపించారు.

తీరా.. గెలిచారు. ఇప్పటికే బోలెడు ఎమ్మెల్సీ సీట్లను పంచి పెట్టారు. చివరికి పవన్ అనుచరులకు, నాదెండ్ల మనోహర్ కోసం త్యాగం చేసిన వారికి కూడా ఎమ్మెల్సీలు దక్కాయి. తంగెళ్ల కోసం తాను కోరుకున్న కాకినాడ ఎంపీ సీటు వదులుకున్న సాన సతీష్ కు కూడా ఎంపీ పదవి దక్కింది.

బిజెపిని కాదనలేని ఈ పార్టీల దౌర్బల్యానికి రాజ్యసభ ఎంపీ పదవి మీద ఆశ వదలుకున్న త్యాగరాజు నాగబాబుకు కూడా మంత్రి పదవి దక్కబోతోంది. త్యాగాలు చేసిన అందరికీ ఏదో ఒకటి దక్కుతోంది. కానీ పవన్ కల్యాణ్ కోసం త్యాగం చేసిన వర్మకు మాత్రం.. మొండిచెయ్యే ఎదురవుతోంది.

ఆయన ప్రేక్షకుడిలాగా.. ఈ త్యాగరాజులు అందుకుంటున్న పదవులను చూస్తూ గడపాల్సి వస్తోంది.

31 Replies to “వర్మ తప్ప.. త్యాగరాజులందరికీ ఫలం దక్కింది!”

  1. షర్మిల కి తప్ప అందరికీ పండు ఫలం కూడా దక్కాయి..కానీ ఎప్పడూ రాసినట్టు లేవే..

  2. నీకు ఏమిటో కిరికిరి పంచాయతీ పెట్టాలి అని ఉన్నట్లుఉంది.. అది అవ్వదమ్మ

Comments are closed.