తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ నెలకుంది. మున్సిపల్ చైర్‌పర్సన్ నక్కా భానుప్రియపై వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కౌన్సిలర్లే అవిశ్వాసం తీర్మానం పెట్టారు. ఈ నెల 9న ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో రాజకీయ ఉత్కంఠకు తెరలేచింది.
వెంకటగిరి మున్సిపాల్టీలో మొత్తం 25 వార్డులున్నాయి. వీటిలో మూడు స్థానాలను వైసీపీ ఏకగ్రీవం చేసుకోగా, మిగిలిన 22 స్థానాల్లోనూ టీడీపీపై గెలుపొందింది. 25కు 25 స్థానాలను వైసీపీ దక్కించుకున్నట్టైంది. అయితే ఎన్నికలకు ముందు ముగ్గురు కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. ఆ తర్వాత మరో ముగ్గురు కూడా టీడీపీలో చేరారు. ప్రస్తుతానికి టీడీపీ బలం ఆరుగురు. వైసీపీ పక్షాన 19 మంది ఉన్నారు.
కనీస బలం కూడా లేకపోవడంతో ఎన్నికను వాయిదా వేయించాలని టీడీపీ ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. ఎన్నికను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణీత సమయానికి జరిపించాలని కలెక్టర్‌కు తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి, అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైసీపీ నాయకుడు మల్లాది విష్ణు ఆధ్వర్యంలో వినతిపత్రాలు సమర్పించారు.
ఈ నేపథ్యంలో వెంకటగిరి మున్సిపల్ చైర్‌పర్సన్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరిగే ఎన్నికకు ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా గూడూరు సబ్‌కలెక్టర్‌ను నియమించారు. ఇరుపక్షాలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వైసీపీ కౌన్సిలర్లు క్యాంప్‌లో ఉన్నారు. వాళ్లను ప్రలోభపెడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే ఏమవుతుందో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకుంది.