హోం మంత్రే ఇలా మాట్లాడితే ఎలా?

హోంమంత్రి స్థాయిలో ఉండి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని ప్రజలు మండిపడుతున్నారు. బీజేపీ తీవ్రంగా విమర్శిస్తోంది.

రాజకీయ నాయకులకు అందులోనూ బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారికి నోరు అదుపులో ఉండాలి. ఆచితూచి మాట్లాడకపోతే అభాసుపాలవుతారు. విమర్శలు ఎదుర్కొంటారు. మంత్రులు ఇంకా జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. కర్ణాటక హోం శాఖ మంత్రి పరమేశ్వర చాలా క్యాజువల్​గా ఓ మాటన్నారు. అదిప్పుడు వివాదమవుతోంది. ఇంతకీ ఆయన ఏమన్నాడు? పెద్ద నగరాల్లో మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరగడం చాలా మామూలే అన్నాడు.

కొన్ని రోజుల కింద బెంగళూరులోని బీటీఎం లే అవుట్‌‌‌‌లో ఒక వ్యక్తి ఇద్దరు యువతులను ఫాలో అయ్యాడు. ఒకామెతో అసభ్యకరంగా ప్రవర్తించి పారిపోయాడు. దీంతో షాక్‎కు గురైన అమ్మాయిలు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హోంమంత్రి పరమేశ్వర స్పందించారు. ‘‘పెద్ద పెద్ద నగరాల్లో ఇలాంటి ఘటనలు కామన్.. పట్టించుకోవద్దు. అమ్మాయిని వేధించిన వాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. కమిషనర్​తో నేను ఫోన్​లో మాట్లాడాను. ఇలాంటి ఘటనలు వైరల్ అయినప్పుడు కామన్ ​గానే ప్రజల దృష్టి వాటిపైకి మళ్లుతుంది’’ అని పరమేశ్వర అన్నాడు.

హోంమంత్రి స్థాయిలో ఉండి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని ప్రజలు మండిపడుతున్నారు. బీజేపీ తీవ్రంగా విమర్శిస్తోంది. లైంగిక వేధింపులు ఎక్కడైనా జరుగుతూనే ఉంటాయి. దానికో నిర్దిష్ట ప్రాంతమంటూ లేదు. లైంగిక వేధింపులు, అత్యాచారాలు జరగడానికి మహానగరాలు, పల్లెలు అనే తేడా ఏమీ లేదు. కాకపోతే మహానగరాల్లో ఇలాంటివి జరగడానికి అస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఘటనలు తమ దృష్టికి వచ్చినప్పుడు పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలి. కాని హోం మంత్రే ఇలాంటివి జరగడం కామన్​ అంటే పోలీసులు పట్టించుకుంటారా? ఇలాంటి పనులు చేసే పోకిరీలు తమకేం జరగదని నిర్లక్ష్యంగా ఉంటారు కదా.

లైంగిక వేధింపులు రోడ్డు మీద జరుగుతాయి. పని ప్రదేశంలో జరుగుతాయి. సినిమా రంగంలో జరుగుతాయి. అసలు జరగని రంగమంటూ లేదు. కాని ఇవన్నీ కామన్ ​అనలేం కదా. లైంగిక హింసను, వేధింపులను ఎదుర్కొంటోన్న మహిళా బాధితులు ఎందరో! అయినా పెదవి విప్పి ఫిర్యాదు చేసే సాహసం చేసే వారిని మాత్రం వేళ్ల మీద లెక్కపెట్టచ్చు. ‘విమెన్స్‌ ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ సర్వే’ కూడా ఇదే విషయం చెబుతోంది. సుమారు 68.7 శాతం మంది ఉద్యోగినులు తామెదుర్కొంటోన్న వేధింపుల గురించి రాతపూర్వకంగా గానీ లేదంటే మాటల రూపంలో గానీ ఫిర్యాదు చేసే సాహసం చేయలేకపోతున్నారట!

2 Replies to “హోం మంత్రే ఇలా మాట్లాడితే ఎలా?”

  1. చిన్న నాటి తన చిలిపి పనులు గుర్తుకు వచ్చాయి. అందుకే అలా. వీరే కదా మన నేతలు

Comments are closed.